- ర్యాంక్ అడగొద్దు… కులం అడగొద్దు!
- విద్యార్థుల మధ్య వివక్షకు చెక్
- క్యాంపస్లో సరికొత్త రూల్స్
- వివక్ష నిరోధానికి కఠిన నిబంధనలు
సహనం వందే, ఐఐటీ బాంబే:
దేశంలోనే అత్యుత్యమ విద్యాసంస్థల్లో ఒకటైన ఐఐటీ బాంబే ఒక విప్లవాత్మక నిబంధనను అమల్లోకి తెచ్చింది. క్యాంపస్లో విద్యార్థులు ఒకరినొకరు జేఈఈ, గేట్ ర్యాంకులు లేదా రిజర్వేషన్ కేటగిరీల గురించి అడగకూడదని ఆదేశించింది. సరదాగా లేదా కుతూహలంతో అడిగినప్పటికీ అది పరోక్షంగా కులాన్ని తెలుసుకునే ప్రయత్నంగా పరిగణిస్తామని స్పష్టం చేసింది. ఇలాంటి ప్రశ్నలు విద్యార్థుల మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతున్నాయని గుర్తించి క్యాంపస్లో వీటిని పూర్తిగా నిషేధించింది.
విషాద సంఘటనతో మార్గదర్శకాలు
ఇటీవల మొదటి సంవత్సరం చదువుతున్న ఒక విద్యార్థి అనుమానాస్పద రీతిలో ప్రాణాలు కోల్పోవడంతో ఈ మార్గదర్శకాలను తీసుకొచ్చారు. సదరు విద్యార్థి కుల వివక్ష ఎదుర్కొన్నాడని తోటి విద్యార్థులు ఆందోళన చేపట్టడంతో యాజమాన్యం స్పందించింది. ప్రవేశం పొందిన తర్వాత అందరూ సమానమేనని, ప్రతిభను కేవలం ఎంట్రన్స్ మార్కులతోనే కొలవలేమని స్పష్టం చేసింది. ఎలాంటి పక్షపాతం లేదా వివక్షకు తావులేకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకుంది.
డిజిటల్ ప్లాట్ఫామ్లలోనూ నిషేధం…
ఈ నిబంధనలు సోషల్ మీడియా, డిజిటల్ మాధ్యమాలకు కూడా వర్తిస్తాయి. వాట్సాప్, ఫేస్బుక్, ఈమెయిల్ వంటి వేదికలపై కుల, లింగ లేదా మతపరమైన వ్యాఖ్యలు చేయడం, అపహాస్యం చేసే జోక్లు పంపడం, ద్వేషపూరిత మెసేజ్లు ఫార్వర్డ్ చేయడంపై పూర్తి నిషేధం విధించారు. ఈ రూల్స్ ఉల్లంఘిస్తే తీవ్రమైన క్రమశిక్షణా చర్యలు ఉంటాయని అధికారులు హెచ్చరించారు.
స్నేహ సంబంధాలకు ప్రోత్సాహం
ఒక ర్యాంక్ ద్వారా వ్యక్తి సామర్థ్యాన్ని అంచనా వేయడం సరైనది కాదని ఐఐటీ స్పష్టం చేసింది. విద్యార్థుల మధ్య మంచి సంబంధాలు ఏర్పడటానికి ఉమ్మడి ఆసక్తులు, ఆటలు, సంగీతం, సినిమాలు, విభిన్న హాబీల ఆధారంగా స్నేహం పెంచుకోవాలని కోరింది. ఊరు లేదా కళాశాలల గురించి మాట్లాడుకోవచ్చు కానీ కుల సమాచారాన్ని బయటపెట్టే అంశాలను టచ్ చేయకూడదని తెలిపింది.
సమాన ప్రాతినిధ్యం…
ర్యాంకుల వివరాలు ప్లేస్మెంట్ రిక్రూట్మెంట్లలో కూడా ఇబ్బందికరంగా మారుతున్నాయని, కొన్ని సంస్థలు ఇంటర్వ్యూలలో జనరల్ ర్యాంకులను మాత్రమే అడుగుతున్నాయని ఫిర్యాదులు వచ్చాయి. రాజ్యాంగం అందించిన రిజర్వేషన్ విధానాలను సరైన రీతిలో అమలు చేస్తూనే అందరికీ సమాన ప్రాతినిధ్యం కల్పించడమే తమ లక్ష్యమని సంస్థ పేర్కొంది. విద్యార్థుల ఒత్తిడి తగ్గించేందుకు కౌన్సిలర్లను నియమించడం, వెల్నెస్ సెంటర్లను బలోపేతం చేయడం వంటి చర్యలు చేపట్టారు.
బాధ్యులపై కఠిన చర్యల డిమాండ్
విద్యాసంస్థల్లో ప్రతి ఒక్కరికీ రక్షణ, గౌరవం లభించినప్పుడే నిజమైన ప్రగతి సాధ్యమవుతుందని అధికారులు స్పష్టం చేశారు. విద్యార్థి వర్గాలు ఈ నిర్ణయాన్ని ఆహ్వానిస్తూనే, నిబంధనలు సరిగ్గా అమలు జరిగేలా ప్రత్యేక పర్యవేక్షణ వ్యవస్థ ఉండాలని డిమాండ్ చేస్తున్నాయి. వివక్ష ఎదుర్కొన్న వారికి తక్షణమే న్యాయం జరిగేలా చూడాలని కోరుతున్నాయి.