- పత్తి రైతులను ముంచిన ఖరీఫ్ సీజన్
- యాసంగి సగం విస్తీర్ణానికే పరిమితం
- ఆందోళన కలిగిస్తున్న వాతావరణ మార్పులు
సహనం వందే, హైదరాబాద్:
తెలంగాణలో ఈసారి తీవ్ర వర్షాభావ పరిస్థితుల వల్ల ఖరీఫ్ సీజన్ రైతులకు పెద్ద ఎత్తున నష్టాన్ని మిగిల్చింది. నీళ్లు లేక పొలాలు ఎండిపోవడంతో పాటు వర్షాలు పడక సాగు విస్తీర్ణం సాధారణం కంటే 25 శాతం పడిపోయింది. పెట్టిన పెట్టుబడి కూడా తిరిగి రాకపోవడంతో వరి, పత్తి రైతులు తీవ్రమైన అప్పుల ఊబిలో కూరుకుపోయే ప్రమాదం ఏర్పడింది. రాబోయే యాసంగి సీజన్‌లో కూడా తీవ్ర సాగు నీటి కొరత ముప్పు పొంచి ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. దీంతో రాబోయే రోజుల్లో పంటలు పండక రైతులు ఇబ్బందులు పడి పరిస్థితి నెలకొంది.
వ్యవసాయ యూనివర్సిటీ నివేదిక…
ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ యూనివర్సిటీ అంచనా ప్రకారం, ఖరీఫ్‌లో ఏకంగా 20,000 కోట్ల రూపాయల మేర నష్టం వాటిల్లింది. సాధారణంతో పోలిస్తే సాగు విస్తీర్ణం 25 శాతం పడిపోయింది. నీళ్లు లేక పొలాలు ఎండిపోవడం ఒకెత్తైతే, అసలు విత్తనాలే వేయకుండా వదిలేసిన భూములు మరొక ఎత్తు. దీనివల్ల పెట్టిన పెట్టుబడి కూడా రాక రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోయే ప్రమాదం ఏర్పడింది. రాబోయే యాసంగి పరిస్థితి ఏంటి? అనేది అందు పట్టడం లేదు అంతుబట్టడం లేదు.
యాసంగి సగానికే పరిమితమా?
రాబోయే యాసంగి సీజన్‌కు కూడా సాగు నీటి కొరత ముప్పు పొంచి ఉంది. సాధారణంగా రబీలో 1.32 కోట్ల ఎకరాల్లో పంటలు సాగవుతాయి. కానీ ఈసారి వర్షాభావ పరిస్థితుల వల్ల ఆ విస్తీర్ణం 70 లక్షల ఎకరాలకు పడిపోయే అవకాశం ఉందంటున్నారు. ముఖ్యంగా మన దగ్గర ఎక్కువగా వేసే వరి సాగు ఏకంగా 40 శాతం తగ్గే ఛాన్స్ ఉంది. దీనివల్ల ధాన్యపు దిగుబడి దారుణంగా పడిపోతుందని అధికారులు హెచ్చరిస్తున్నారు.
పత్తి రైతులకు శాపం…
ఖరీఫ్ సీజన్ లో అత్యంత ఎక్కువగా దెబ్బతిన్నది మాత్రం పత్తి రైతులే. వర్షాలు లేక పత్తి చేలు ఎండిపోయాయి. అక్టోబర్ నుంచి మొదలయ్యే ఈశాన్య రుతుపవనాలపైనే రబీ ఆశలన్నీ ఆధారపడి ఉన్నాయని ఆ వ్యవసాయ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ అల్దాస్ జానయ్య తెలిపారు. ఒకవేళ అప్పుడు కూడా వానలు కురవకపోతే సాగు దండగేనని, నీటి వసతి లేని చోట తొందరపడి పెట్టుబడులు పెట్టవద్దని నిపుణులు సూచిస్తున్నారు. ఇదిలా ఉంటే రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాత్రం… ఎల్ నినో ప్రభావం వల్ల రాబోయే రోజుల్లో తాగు, సాగునీటికి తీవ్ర కొరత ఏర్పడే ప్రమాదం ఉందన్నారు. అందుకే రైతులు తొందరపడి యాసంగిలో వరి పంటలు వేసి నష్టపోవద్దని కోరారు. తాగునీటి అవసరాలకు మొదటి ప్రాధాన్యత ఇస్తూ విద్యుత్, నీటి వనరులను ఎంతో జాగ్రత్తగా వాడుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటలు…
సాధారణంగా ప్రతి ఐదు నుంచి పది సంవత్సరాలకోసారి ఇలాంటి పరిస్థితులు రావడం సహజమేనని అధికారులు చెప్తున్నారు. గతంలో కూడా వర్షాభావంతో పంటల మార్పిడి 30 శాతానికి చేరింది. ఈ పరిస్థితిని ఎదుర్కొనేందుకు ప్రభుత్వం 12 సార్లు సమీక్ష సమావేశాలు నిర్వహించింది. ఎల్ నినో మార్పులపై అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. రైతులు నీరు ఎక్కువగా అవసరమయ్యే వరికి బదులుగా తక్కువ నీటితో పండే ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్లాలని అవగాహన కల్పిస్తున్నారు. పప్పు ధాన్యాలు, జీలుగ, జనుము వంటి పచ్చిరొట్ట పైర్లను సాగు చేయమని కోరుతున్నారు. ఇవి తక్కువ నీటితో పండడమే కాకుండా నేలలో సారాన్ని పెంచడానికి ఎంతగానో ఉపయోగపడతాయి. నీటి వనరులను సరిగ్గా అంచనా వేసుకోకుండా విత్తనాలు, ఎరువులపై ఆత్రుతగా ఖర్చు చేసి నష్టపోవద్దని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
16 ఎల్ నినో సంవత్సరాల డేటా…
ఎల్ నినోతో కచ్చితంగా కరువే వస్తుందా అంటే కానే కాదు! చరిత్రను ఒక్కసారి తిరగేస్తే గత 16 ఎల్ నినో సంవత్సరాల డేటాను పరిశీలిస్తే ఒక్కో ఏడాది ఒక్కో రకంగా వాతావరణం ప్రవర్తించిందని స్పష్టమవుతోంది. 2002లో మైనస్ 39.3 శాతం, 2004లో మైనస్ 35.7 శాతం తక్కువ వర్షపాతం నమోదైతే, మరికొన్ని సంవత్సరాల్లో మిగులు వర్షపాతం నమోదైంది. అంటే ఎల్ నినో రాగానే కరువు వచ్చేస్తుందనే అపోహను ఈ గణాంకాలు పటాపంచలు చేస్తున్నాయి. అందుకే అంతర్జాతీయ అంచనాలపైనే కాకుండా మన ప్రాంతీయ వాతావరణ మార్పులపై దృష్టి పెట్టడం చాలా అవసరం.