రగిలిన రష్మిక… శివాలెత్తిన శ్రీలీల – జాన్వీపై అసభ్య వీడియోల రగడ

Tollywood Stars VS AI
  • ఏఐ ఫేక్ వీడియోలపై ఆగ్రహ జ్వాల
  • కీర్తి సురేష్, చిన్మయి, ఖుష్బూ విమర్శలు
  • ఆన్‌లైన్ హరాస్‌మెంట్… డిజిటల్ ముప్పు
  • సమాజ బాధ్యతారాహిత్యంపై తీవ్ర ఆగ్రహం
  • తారల ఆవేదనలతో ఊపందుకున్న చర్చ

సహనం వందే, హైదరాబాద్:

టెక్నాలజీ పెరిగిన ఈ రోజుల్లో మహిళలపై డిజిటల్ వేధింపులు ఒక పెద్ద సమస్యగా మారాయి. సోషల్ మీడియాలో ఆన్‌లైన్ హరాస్‌మెంట్, సైబర్ స్టాకింగ్, ఇమేజ్ బేస్డ్ అబ్యూస్, మార్ఫింగ్, బ్లాక్‌మెయిలింగ్ వంటి ఘటనలు చూస్తూనే ఉన్నాం. ఏఐ సాయంతో నకిలీ ఫోటోలు, వీడియోలు తయారు చేయడం సులభంగా మారింది. ఈ రకమైన కంటెంట్ ను వైరల్ చేస్తూ మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే కుట్రలు జరుగుతున్నాయి. డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లలో మహిళలకు సరైన భద్రత ఉందో లేదో అని ఆలోచించాల్సిన సమయం ఇది.

సినీ రంగాన్ని షాక్‌కు గురిచేసిన ఏఐ మార్ఫింగ్
ఇటీవల సినీ రంగానికి చెందిన నటీమణులు కూడా ఈ తరహా ఏఐ వేధింపులకు గురై బహిరంగంగా ఆవేదన వ్యక్తం చేశారు. దేవర సినిమాలోని ఒక పాట దృశ్యాలను ఏఐ టెక్నాలజీతో అసభ్యంగా మార్ఫింగ్ చేసిన ఘటన నెటిజన్లను షాక్‌కు గురిచేసింది. నటి జాన్వీ కపూర్ ఫోటోలు, వీడియోలను తప్పుగా చిత్రీకరించడం వల్ల వినోద రంగంలో మహిళల రక్షణపై చర్చ మొదలైంది. సమాజంలో గుర్తింపు ఉన్న వ్యక్తులకే ఇలాంటి పరిస్థితి ఎదురైతే ఇక సామాన్య మహిళల పరిస్థితి ఏమిటనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

హద్దులు దాటొద్దు… తారల ధ్వజం
ఈ అంశంపై జాన్వీ కపూర్ స్పందిస్తూ… మహిళల హద్దులు, ఆత్మగౌరవం అనేవి చర్చించాల్సిన విషయాలు కావని, ప్రతీ ఒక్కరూ వాటిని గౌరవించాలని చెప్పారు. అనుమతి లేకుండా నకిలీ కంటెంట్ తయారు చేయడం తీవ్రమైన నేరమని స్పష్టం చేశారు. నటి శ్రీలీల స్పందిస్తూ… టెక్నాలజీ మన జీవితాలను సులభతరం చేయడానికి ఉపయోగపడాలి తప్ప ఇతరులకు హాని కలిగించడానికి కాదన్నారు. సమాజంలో ఉన్న ప్రతీ మహిళకు గౌరవం ఇవ్వాలని పిలుపునిచ్చారు. అలాగే కీర్తి సురేష్ స్పందిస్తూ… ట్రోలింగ్, డీప్‌ఫేక్స్ ద్వారా తమ గొంతును నొక్కడం సాధ్యం కాదని స్పష్టం చేశారు.

చిన్మయి, ఖుష్బూ, రష్మిక ఆగ్రహం
డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి స్పందిస్తూ… ఆన్‌లైన్ వేధింపుల వల్ల తన గొంతును ఎవరూ నొక్కలేరని, ఉన్నత చదువులు చదివి ఉద్యోగాలు చేసేవారు కూడా ఇలాంటి పనులకు పాల్పడుతుండడం అసహ్యం కలిగిస్తోందన్నారు. నటి, రాజకీయ నాయకురాలు ఖుష్బూ స్పందిస్తూ… తాము పబ్లిక్ ఫిగర్స్‌మే కావచ్చు కానీ ఎవరి సొత్తు కాదని, గౌరవంగా బతికే హక్కు అందరికీ ఉందన్నారు. నటి రష్మిక మందన్న స్పందిస్తూ… ఏఐని తప్పుడు పనులకు వాడితే తీవ్ర నష్టం జరుగుతుందని, తప్పు చేసిన వారికి కఠినమైన శిక్షలు పడాలని కోరారు. నటి గౌరి కిషన్ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు మహిళలకు సురక్షిత వాతావరణం కల్పించడంలో విఫలమవుతున్నాయని అభిప్రాయపడ్డారు.

వేధింపుల వెనుక మానసిక రోగం
సైబర్ క్రైమ్ నిపుణురాలు ప్రగతి రతన్ స్పందిస్తూ… ఆన్‌లైన్ అబ్యూస్ అనేది అసూయ, అధికారం చెలాయించే మనస్తత్వం నుంచే వస్తుందని చెప్పారు. కొందరు టీములుగా ఏర్పడి మహిళలను లక్ష్యంగా చేసుకుని వేధింపులకు గురిచేస్తున్నారని తెలిపారు. 20 నుంచి 30 ఏళ్ల మధ్య వారు ఇలాంటి దుర్మార్గాలకు పాల్పడుతున్నారని ఆమె పేర్కొన్నారు. చట్టపరమైన చర్యలకు వెనుకాడకూడదని సూచించారు. నూతన ఐటీ నిబంధనల ప్రకారం ఫిర్యాదు వచ్చిన నిర్ణీత సమయంలోనే ఏఐ ఆధారిత నకిలీ, అసభ్యకర కంటెంట్‌ను సోషల్ మీడియా వేదికల నుంచి తొలగించాల్సి ఉంటుంది.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *