రాకెట్ ఎక్కుతున్న విస్కీ బాటిల్ – అంతరిక్షంలో శాస్త్రవేత్తల వినూత్న పరిశోధన

Whisky on Rocket
  • విలాసవంతమైన కిక్కు కోసం భారీ ప్రయోగం
  • ధనవంతుల కోసం లగ్జరీ మద్య పానీయం
  • రోదసిలో మ్యాజిక్… నింగిలో ఆల్కహాల్
  • ప్రతిరోజు భూమి చుట్టూ తిరగనున్న విస్కీ
  • ఐదేళ్ల తర్వాత అద్భుతమైన రుచితో స్కాచ్

సహనం వందే, హైదరాబాద్:

విస్కీ బాటిల్‌‌ను అంతరిక్షంలోకి పంపితే దాని రుచి ఎలా మారుతుందో ఎప్పుడైనా ఊహించారా? స్కాచ్ విస్కీని ఏకంగా ఆకాశంలోకి పంపి ఐదేళ్ల పాటు తిప్పేందుకు శాస్త్రవేత్తలు సిద్ధమయ్యారు. రోదసిలో కఠినమైన వాతావరణం వల్ల మద్యం ఎంత త్వరగా పక్వానికి వస్తుందో చూడటానికే ఈ ప్రయోగం చేస్తున్నారు. విశ్వాంతరాళంలో జరిగే ఈ చిత్రమైన పరిశోధన ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పెద్ద సంచలనంగా మారింది.

రోదసికి రాకెట్ ఎక్కుతున్న స్కాచ్
స్కాట్లాండ్, జపాన్ దేశాలకు చెందిన ఇంజనీర్లు స్కాచ్ విస్కీని ఒక రాకెట్‌లో ఎక్కించి రోదసిలోకి పంపేందుకు ప్లాన్ చేశారు. అక్కడ విస్కీ పరిపక్వం చెందే ప్రక్రియ చాలా వేగంగా జరుగుతుందని భావిస్తున్నారు. స్పేస్ పుఫిన్ అని పిలిచే ఈ ప్రయోగంలో కొన్ని విస్కీ శాంపిళ్లను ఒక చిన్న ఉపగ్రహంలో అమర్చి విశ్వంలోకి పంపుతారు. రోదసిలోని కఠినమైన వాతావరణానికి విస్కీ ఎలా స్పందిస్తుందో క్షుణ్ణంగా విశ్లేషించడమే ఈ ప్రాజెక్ట్ ప్రధాన లక్ష్యం.

క్యూబ్‌శాట్ ఉపగ్రహంలో ఐదేళ్ల పయనం
ఈ ప్రయోగం కోసం 2028 లాంచ్ డేటుగా ఖరారు చేశారు. స్పేస్ ఎక్స్ సంస్థ ఐఎస్ఎస్ కేంద్రం చేపట్టే రవాణా మిషన్‌లో భాగంగా దీనిని పంపుతారు. ఐఎస్ఎస్ లోని జపాన్ రవాణా మాడ్యూల్ ద్వారా ఈ ఉపగ్రహాన్ని కక్ష్యలోకి విడుదల చేస్తారు. ఈ శాటిలైట్‌ను క్యూబ్‌శాట్ అని పిలుస్తారు. దీనిని స్కాట్లాండ్, జపాన్ విద్యార్థులు కలిసి డిజైన్ చేస్తున్నారు. గ్లాస్గో విశ్వవిద్యాలయానికి చెందిన డాక్టర్ గిల్లెస్ బైలెట్ నేతృత్వంలో ఈ ప్రయోగాత్మక పనులు వేగంగా జరుగుతున్నాయి.

మైనస్ 150 నుండి ప్లస్ 200 డిగ్రీలు
ఈ క్యూబ్‌శాట్ ఉపగ్రహం ఐదేళ్ల పాటు భూమి చుట్టూ తిరుగుతూనే ఉంటుంది. ప్రతి 90 నిమిషాలకు ఒకసారి భూగ్రహం చుట్టూ ఒక రౌండ్ పూర్తి చేస్తుంది. ఆ సమయంలో అంతరిక్షంలో మైనస్ 150 డిగ్రీల తీవ్రమైన చలి నుండి ప్లస్ 200 డిగ్రీల విపరీతమైన వేడి వరకు వాతావరణం సెకన్లలో మారిపోతుంది. ఈ మార్పుల వల్ల విస్కీ మునుపెన్నడూ లేని సరికొత్త ఘాటైన రుచి వస్తుంది.

తిరిగి రాని ఉపగ్రహం, కెమికల్ టెస్టులు
ఐదేళ్ల కాలంలో శాస్త్రవేత్తలు అంతరిక్షంలో ఉన్న విస్కీ రంగు, దానిలోని రసాయన మార్పులను నిరంతరం పర్యవేక్షిస్తుంటారు. అయితే ప్రయోగం ముగిశాక ఈ చిన్న క్యూబ్‌శాట్ ఉపగ్రహాన్ని తిరిగి భూమి మీదకు రప్పించరు. భవిష్యత్తులో పెట్టుబడిదారులు ముందుకు వస్తే ఒక పెద్ద విస్కీ పీపాతో పూర్తి స్థాయి మద్యం తయారీ వ్యవస్థనే అంతరిక్షంలోకి పంపాలని డాక్టర్ గిల్లెస్ బైలెట్ యోచిస్తున్నారు.

కోట్లు కుమ్మరించే మద్యం ప్రియులు
ఈ ప్రయోగం విజయవంతమైతే స్పేస్ ఏజ్డ్ విస్కీ ప్రపంచంలోనే అత్యంత క్రేజీ డ్రింక్‌గా మారుతుంది. విస్కీ తయారీతో పాటు దానిని అంతరిక్షంలోకి పంపే ఖర్చులు తోడై ఈ సీసా ధర చాలా ఎక్కువగా ఉంటుంది. అయినా సరే అరుదైన బాటిళ్ల కోసం కోట్లు ఖర్చు చేసే ధనవంతులకు, మద్యం ప్రియులకు ఈ భారీ ధర అసలు సమస్యే కాదని చెప్పవచ్చు.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *