- కాకతీయ వైభవాన్ని నాశనం చేస్తారా?
- ప్రపంచ వారసత్వ హోదా రద్దవుతుందా?
- రామప్ప చెరువుకు గండికొట్టే కుట్ర
- 15 గ్రామాల ప్రజల మహా తిరుగుబాటు
- ఉద్యమానికి కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్ శ్రీకారం
సహనం వందే, వరంగల్:
మన చరిత్రకు గుండెకాయ లాంటి రామప్ప ఆలయాన్ని, ఆ పక్కనే ప్రశాంతమైన రామప్ప చెరువును బొగ్గు గనుల తవ్వకాల్లో ముంచెత్తేందుకు సింగరేణి సంస్థ సిద్ధమవుతోందా? ములుగు జిల్లా వెంకటాపురంలో ఓపెన్ కాస్ట్ బొగ్గు గనిని తవ్వాలని చూస్తున్న తీరుపై ఇప్పుడు సర్వత్రా నిరసన జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్, ఇతర సాంస్కృతిక వేత్తలు అంతా కలిసి ఈ ప్రాజెక్టును తక్షణమే ఉపసంహరించుకోవాలని గగ్గోలు పెడుతున్నారు. సుమారు 800 సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ యునెస్కో వారసత్వ కట్టడాన్ని కాపాడుకోవడానికి 15 గ్రామాల ప్రజలు దసరా పండుగ తర్వాత ఉద్యమానికి సిద్ధమవుతున్నారు.
బొగ్గు తవ్వకాలతో రాతి పునాదికే ప్రమాదం!
వరంగల్ నిట్ రిటైర్డ్ ప్రొఫెసర్ పాండురంగరావు ప్రకారం… ఈ ఓపెన్ కాస్ట్ గని రామప్ప ఆలయానికి, చెరువుకు కేవలం 5 కిలోమీటర్ల దిగువన ఉంది. అక్కడికి 300 మీటర్ల లోతు వరకు తవ్వకాలు జరపాలని చూస్తున్నారు. భౌగోళిక సర్వే నివేదికల ప్రకారం రామప్ప చెరువులోని నీరు భూగర్భ మార్గాల ద్వారా ఈ గని వైపు ప్రవహించే అవకాశం ఉంది. చెరువు దగ్గర నీటి ప్రవాహాన్ని అడ్డుకునే కట్ ఆఫ్ ట్రెంచ్ లేకపోవడం వల్ల లోతైన తవ్వకాలతో నీటి ఇంకుడు వేగవంతమవుతుంది. దీనివల్ల రామప్ప గుడికి వాడిన ఇసుక పునాది దెబ్బతిని ఆలయం కుంగిపోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.
ప్రకంపనల దెబ్బకు శిల్పాలు తట్టుకోగలవా?
పైకి చూడటానికి గని పేలుళ్ల ప్రభావం తక్కువే అని నివేదికలు చెబుతున్నా, పదే పదే జరిగే పేలుళ్ల ప్రకంపనలు ఆలయంపై తీవ్ర ప్రభావం చూపుతాయి. ఇప్పటికే రంగా మండపంలో దూలాలు విరగడం, నేల కుంగడం లాంటి సమస్యలతో గుడి పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది. పైగా ఈ తవ్వకాల వల్ల చుట్టుపక్కల ఉండే జీవవైవిధ్యం, పర్యావరణం, స్థానిక ప్రజల సామాజిక, ఆర్థిక జీవనం పూర్తిగా నాశనమవుతాయి. అందుకే సింగరేణి సంస్థ ఈ ప్రతిపాదనను వెంటనే వెనక్కి తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఆలయం దగ్గర బొగ్గు గని ప్రతిపాదన వెనక్కి తీసుకోవాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా డిమాండ్ చేశారు.
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి వినతిపత్రం…
ఈ ప్రాజెక్టును ఆపాలని కోరుతూ కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్ ప్రతినిధి పాండురంగారావు నాయకత్వంలో ఒక బృందం హైదరాబాద్లో కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డిని కలిసింది. సింగరేణి సంస్థ పనులు చేపట్టేందుకు సిద్ధమవుతోందని, మంత్రి వెంటనే జోక్యం చేసుకుని ఈ ప్రాజెక్టును రద్దు చేయాలని విన్నవించింది. మాజీ మేయర్ రాజేశ్వర్ రావు, సామాజిక వేత్త మండపా శశిధర్ రావు లాంటి నాయకులు ప్రజా ఉద్యమానికి పిలుపునిచ్చారు. రామప్ప చెరువుకు గండిపడితే మునిగిపోయే గ్రామాలన్నింటిలో పర్యటించి, బొగ్గు గని వల్ల వచ్చే ముప్పు గురించి ప్రజలకు అవగాహన కల్పిస్తామని చెబుతున్నారు.
ప్రపంచ వారసత్వ హోదాకే పెద్ద ముప్పు!
మరొక ఉద్యమకారుడు మందల పరశురాములు మాట్లాడుతూ, రామప్ప ఆలయానికి వచ్చిన యునెస్కో ప్రపంచ వారసత్వ హోదాను కాపాడుకోవడానికి అందరూ ముందుకు రావాలని కోరారు. చుట్టుపక్కల బొగ్గు తవ్వకాలు జరిపితే ఆ హోదా పోయే ప్రమాదం ఉంది. తెలంగాణకు గర్వకారణమైన ఒక చారిత్రక సంపదను కాపాడుకోవడానికి ప్రజలంతా ఏకమై పోరాడాల్సిన సమయం వచ్చింది.