తాగడంలో మనోళ్లే తోపు! – తూలుతున్న తెలంగాణ… దేశంలో నెంబర్-1

Telangana Top 1 position in Liquor usage
  • రెండో స్థానం దక్కించుకున్న మన ఆడబిడ్డలు
  • పట్టణాల కంటే పల్లెల్లోనే కిక్కు చాలా ఎక్కువ
  • ఇది విజయమంటారా? వినాశనం అంటారా?
  • గుల్లవుతున్న కాలేయం… ఇదే అసలు నిజం

సహనం వందే, హైదరాబాద్:

మందు తాగడంలో మన తెలంగాణోళ్లను కొట్టేటోడే లేడని మీకు తెలుసా? జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (ఎన్.ఎఫ్.హెచ్ఎస్-6) వెల్లడించిన నిజాలు చూస్తే ఎవరైనా సరే నోరెళ్లబెట్టాల్సిందే. దేశంలోనే అత్యధికంగా మద్యం సేవిస్తున్న రాష్ట్రంగా మన తెలంగాణ మొదటి స్థానంలో నిలిచి అందరినీ ఆశ్చర్యపరిచింది.

పురుషుల్లో మనోళ్లదే హవా…
మన రాష్ట్రంలో 15 ఏళ్లు దాటిన మగవాళ్లలో ఏకంగా 43.9 శాతం మంది క్రమం తప్పకుండా మద్యం తాగుతున్నారు. దేశమంతటా చూస్తే ఈ సగటు కేవలం 18.9 శాతమే ఉంటే, మనోళ్లు దానికి రెండింతలకు పైగా స్కోర్ చేసి రికార్డు సృష్టించారు. ఈ పోటీలో 42.2 శాతంతో రాజస్థాన్ రెండో స్థానంలో నిలిచింది. ఆ తర్వాత ఛత్తీస్‌గఢ్ 38.3 శాతం, జార్ఖండ్ 33.6 శాతం, మధ్యప్రదేశ్ 26.9 శాతంతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

నగరాల కంటే పల్లెల్లోనే ఎక్కువ
మనం సిటీల్లోనే బార్లు, పబ్‌ల గోల ఎక్కువనుకుంటాం కానీ అసలైన కిక్కు పల్లెటూర్లలోనే ఉంది. పట్టణాల్లో 15 ఏళ్లు పైబడిన పురుషుల్లో మద్యం తాగేవారు 36.3 శాతం ఉంటే, గ్రామాల్లో అది ఏకంగా 46.6 శాతానికి చేరింది. అంటే పట్టణాల కంటే పల్లెల్లోనే మరో 10 శాతం మంది ఎక్కువగా ఈ అలవాటులో మునిగిపోయారు.

మహిళల్లోనూ దేశంలో రెండో స్థానం…
ఈ విభాగంలో ఆడవాళ్లు కూడా తక్కువేమీ కాదు. మహిళల కేటగిరీలో తెలంగాణ 7.1 శాతంతో దేశంలోనే రెండో స్థానంలో నిలిచింది. రాజస్థాన్ 19.9 శాతంతో మొదటి స్థానంలో ఉండగా, ఛత్తీస్‌గఢ్ 5.7 శాతం, జార్ఖండ్ 5.5 శాతంతో మన వెనుకే ఉన్నాయి. ఏ చిన్న సంబరమైనా, దావత్ అయినా సరే చేతిలో గ్లాస్ లేకుండా పూర్తి కాకపోవడం మన తెలంగాణ సంస్కృతిలో భాగమైపోయింది. ప్రతి వేడుకలోనూ మద్యం సీసా ఉండాల్సిందే అన్నట్లుగా పరిస్థితి మారిపోయింది.

ముందున్న ప్రమాదాలు
ఈ రికార్డు చూసి సంతోషపడాలో లేక బాధపడాలో అర్థం కావడం లేదు. కాలర్ ఎగరేసే ఈ నంబర్ల వెనుక కుటుంబాలు నాశనం కావడం, ఆరోగ్యం పాడవ్వడం లాంటి చేదు నిజాలు ఉన్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వాలు అప్రమత్తమై మద్యం అమ్మకాలపై నియంత్రణ విధించకపోతే మున్ముందు పెద్ద ముప్పే ముంచుకొస్తుంది.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *