- రేవంత్ బూతులంటూ గులాబీ నేత సాకులు
- ప్రతిపక్ష నేతగా పలాయనవాదం దారుణం
- అసెంబ్లీకి వెళ్లకుండా ఇంట్లో కూర్చోవడమేంటీ
సహనం వందే, హైదరాబాద్:
అసెంబ్లీకి మొహం చాటేయడం… ప్రశ్నించాల్సిన చోట పారిపోవడం ఏరకమైన నాయకత్వం? లక్షలాది మంది ప్రజల సమస్యలను గాలికొదిలేసి, బూతులంటూ సాకులు చెప్పి ఇంట్లో కూర్చుంటే జనం ఊరుకుంటారా? రాజకీయ పండితుడు భయపడి సభకు రానంటూ మొండికేస్తున్నారు. ఈ రాజకీయ నాటకాల వెనుక అసలు కుట్ర ఏంటి?
కాంగ్రెస్ ధర్నాలు… కేసీఆర్ సాకులు
తెలంగాణలో ప్రజాస్వామ్యం ఏ స్థాయికి దిగజారిపోయిందో చూడటానికి ఈ పరిణామాలే తిరుగులేని సాక్ష్యం. అసెంబ్లీకి రావాలని ఒకరు ధర్నాలు చేస్తుంటే, ఆ ధర్నాలకు భయపడి ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ సభకు ముఖం చాటేయడం శోచనీయం. ప్రతిపక్షంగా ప్రభుత్వాన్ని ఉతికి ఆరేయాల్సిన పవిత్రమైన శాసనసభలో, అధికార పార్టీయే ప్రతిపక్ష నేతపై ధర్నాలు చేయడం ఆశ్చర్యం కలుగుతుంది. సభకు రాకపోతే రాజీనామా చేయాలంటూ కాంగ్రెస్ డిమాండ్ చేస్తుంటే, కేసీఆర్ మాత్రం కుంటిసాకులు వెతుకుతున్నారు.
బూతు సాకులు…
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో వాడే భాష బాగోలేదని, బూతులు వినడానికి తాను సభకు రానని కేసీఆర్ చెప్పడం హాస్యాస్పదంగా ఉంది. దశాబ్దాల రాజకీయ అనుభవమున్న ఒక సీనియర్ మోస్ట్ లీడర్, మాజీ ముఖ్యమంత్రి మాట్లాడే మాటేనా ఇది? రేవంత్ రెడ్డి నోరు పారేసుకుంటే, ఆయనను సభలోనే మైక్ పట్టుకుని తిప్పికొట్టే దమ్ము, ధైర్యం ఉండాలి కానీ సభను వదిలి పారిపోవడం ఎవరిని మోసం చేయడానికీ? ప్రత్యర్థి బలహీనతను అస్త్రంగా మలచుకోవాల్సింది పోయి, భయపడి ఇంట్లో కూర్చోవడం ప్రధాన ప్రతిపక్ష నాయకుడికి ఎంత మాత్రం తగదు.
కేసీఆర్ భాష గురించి తెలియదా?
గతంలో ఇదే కేసీఆర్ అసెంబ్లీలోనూ, బయటా ప్రత్యర్థులపై ఎంత కఠినమైన, పరుషమైన పదజాలం వాడారో తెలంగాణ ప్రజలు ఎప్పటికీ మరచిపోలేరు. మరి ఆ రోజుల్లో ఆయన వాడిన భాష ఇతరులకు ఎంతో బాధ కలిగించి ఉంటుందనే ఆలోచన ఆయనకు అప్పుడు ఎందుకు రాలేదు? ఇవాళ తనకు వ్యతిరేకంగా అదే స్థాయి భాష వాడుతుంటే తట్టుకోలేక సభను బహిష్కరించడాన్ని ఏమనుకోవాలి?
ఒంటరి అయిపోతాననే భయమా?
ప్రజల ఓట్లతో గెలిచి, వారి సమస్యలపై అసెంబ్లీలో గళం ఎత్తాల్సిన బాధ్యత ప్రతిపక్ష నేతపై నూటికి నూరుపాళ్లు ఉంటుంది. కోట్ల రూపాయల ప్రజాధనంతో నడిచే అసెంబ్లీ సమావేశాలను ఇలా బహిష్కరిస్తూ కాలం గడపడం ప్రజల విశ్వాసాన్ని వంచించడమే అవుతుంది. ముఖ్యమంత్రికి ధీటుగా సమాధానం చెప్పలేక, సభలో ఒంటరి అయిపోతామనే భయంతోనే కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారనేది కాదనలేని సత్యం. ప్రజా సమస్యల కంటే కేసీఆర్ అహంభావం, మధ్య నలుగుతున్నది మాత్రం సామాన్య తెలంగాణ ప్రజలే.
సురేఖ ఎపిసోడ్… కాంగ్రెస్ డైవర్షన్
మరోవైపు ఈ మొత్తం రగడ వెనుక పెద్ద రాజకీయ కుట్రే నడుస్తోందనేది బహిరంగ రహస్యం. ఇటీవల మంత్రి సురేఖను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేసిన తర్వాత రాష్ట్రంలో పెను భూకంపమే రేగింది. ఆ సురేఖ ఎపిసోడ్ వల్ల ప్రభుత్వంపై వస్తున్న తీవ్ర వ్యతిరేకతను పక్కదారి పట్టించేందుకే కాంగ్రెస్ పార్టీ ఈ డ్రామాను తెరపైకి తెచ్చిందనే విమర్శలు కూడా ఉన్నాయి. ప్రజల అసహనాన్ని డైవర్ట్ చేయడానికి అధికార పార్టీ కావాలనే కేసీఆర్ అసెంబ్లీ హాజరు అంశాన్ని ముందుకు నెట్టింది తప్ప, ఇందులో మరోటి ఏమీ లేదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. సురేఖ ఎపిసోడ్ మంటలను చల్లార్చడానికి కాంగ్రెస్ చేస్తున్న పాలిటిక్స్‌కు కేసీఆర్ గైర్హాజర్ మరింత బలాన్ని చేకూరుస్తోంది. అధికార పార్టీ వేసిన వలలో చిక్కుకుని సభకు వెళ్లకుండా తనంతట తానే తప్పుకుంటున్నారు. దీనివల్ల ప్రతిపక్షం తన పదును కోల్పోతోందనే నగ్న సత్యాన్ని బీఆర్ఎస్ నాయకులు ఎప్పుడు గ్రహిస్తారో అర్థం కాదు. ప్రజలు వీరికి ఓట్లేసింది ఇలా రోజుకో డ్రామా ఆడి కాలక్షేపం చేయడానికో, అసెంబ్లీని బహిష్కరించడానికో కాదనే కఠిన సత్యాన్ని ఎప్పటికి గుర్తిస్తారో?