అవినీతిలో బ్యాం’కింగ్’ – లంచాల్లో టాప్ పొజిషన్లో బ్యాంకులు

In Corrpution Banks in Top Position
  • దేశంలో రెండో స్థానంలో రైల్వే శాఖ
  • కేంద్ర విజిలెన్స్ కమిషన్ నివేదిక వెల్లడి
  • గత ఏడాది 70 వేల అవినీతి ఫిర్యాదులు
  • బడా బాబుల చేతుల్లో బ్యాంక్ అధికారులు
  • విజయ్ మాల్యా, నీరవ్ మోదీలకు అండదండ

సహనం వందే, న్యూఢిల్లీ:

దేశాన్ని పట్టి పీడిస్తున్న అవినీతి లీలలు బట్టబయలయ్యాయి. కేంద్ర విజిలెన్స్ కమిషన్ విడుదల చేసిన సరికొత్త నివేదిక ప్రభుత్వ శాఖల బండారాన్ని బట్టబయలు చేసింది. గతేడాది ఏకంగా 70,584 అవినీతి ఫిర్యాదులు రావడం వ్యవస్థలోని లోపాలను ఎత్తిచూపుతోంది. సామాన్యుడి చెమట ఊడ్చి సంపాదించిన సొమ్మును అవినీతిపరులు దోచుకుంటుంటే దేశం ఎలా పురోగమిస్తుంది?

అవినీతిలో బ్యాంకులే టాప్…
బ్యాంకుల్లో అవినీతి ఏ స్థాయిలో వేళ్లూనుకుందో చూస్తే దిమ్మతిరిగిపోతుంది. ఈ మొత్తం అవినీతి లొసుగుల జాబితాలో సామాన్యులతో నిత్యం సంబంధ ఉండే బ్యాంకులు, రైల్వే శాఖలు అగ్రస్థానంలో నిలిచాయి. ఒక్క బ్యాంకింగ్ రంగంలోనే అత్యధికంగా 9993 ఫిర్యాదులు రావడం ఈ వ్యవస్థ ఎంత కలుషితమైందో తెలియజేస్తోంది.

In Corruption Banks in Top Position

కార్పొరేట్లకు బ్యాంకుల దాసోహం…
పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలకు వేల కోట్ల రూపాయల రుణాలు ఇవ్వడంలో కూడా బ్యాంక్ అధికారుల హస్తం కనిపిస్తోంది. ఎటువంటి పూచీకత్తు లేకపోయినా, ఎలాంటి లాభాలు లేకపోయినా కోట్ల రూపాయల రుణాలు మంజూరు చేసి ఆ తర్వాత ఆ కంపెనీలు ఎత్తేస్తే బ్యాంకులు దివాలా తీస్తున్నాయి. ఇక్కడ బ్యాంకు ఉన్నతాధికారులు రాజకీయ నాయకులతో కుమ్మక్కై ప్రజల డిపాజిట్ సొమ్మును నిరర్థక ఆస్తులుగా మారుస్తున్నారు. విజయ్ మాల్యా, నీరవ్ మోదీ లాంటి వారు వేలకోట్లతో దేశాన్ని మోసం చేసి విదేశాలకు పారిపోవడానికి ఇలాంటి అధికారుల లంచగొండితనమే ప్రధాన కారణం. సాధారణ రైతులకు క్రాప్ లోన్స్, చిన్న వ్యాపారస్తులకు ముద్రా రుణాలు ఇవ్వడానికి బ్యాంకు అధికారులు నేరుగా లంచాలు డిమాండ్ చేస్తుంటారు.

రైల్వేల్లో అవినీతి బాగోతం
ఇక బ్యాంకుల తర్వాత భారతీయ రైల్వే శాఖ అవినీతిలో రెండో స్థానంలో నిలిచి విస్మయానికి గురిచేస్తోంది. రైల్వే శాఖకు సంబంధించి ఏకంగా 9381 ఫిర్యాదులు అందాయి. రైల్వేలో ఇంత భారీ స్థాయిలో అవినీతి జరగడం ప్రయాణికులను తీవ్ర నిరాశకు గురిచేసే అంశం. రైల్వే స్టేషన్లలో ప్రయాణికులకు రిజర్వేషన్ టికెట్లు దొరకడమే గగనమైపోవడానికి తెరవెనుక పెద్ద ఎత్తున జరిగే మాఫియా దందాలే ప్రధాన కారణం. రైల్వే అధికారుల అండదండలతో దళారులు ప్రయాణికుల టికెట్లను బ్లాక్ చేసి అధిక ధరలకు అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్నారు.

స్థానిక సంస్థల లీలలు
ఇక మిగతా శాఖల విషయానికి వస్తే హౌసింగ్, అర్బన్ అఫైర్స్ శాఖపై 6531 ఫిర్యాదులు రాగా స్థానిక సంస్థలపై 4834 ఫిర్యాదులు వచ్చాయి. ముఖ్యంగా ఢిల్లీలోని జల్ బోర్డ్, రవాణా శాఖ, మున్సిపల్ కార్పొరేషన్ వంటి స్థానిక సంస్థలపై కూడా అవినీతి ఆరోపణలు వస్తున్నాయి. అలాగే బొగ్గు రంగంలో 4118, ఫైనాన్స్ రంగంలో 3107 ఫిర్యాదులు నమోదయ్యాయి. ఢిల్లీ ప్రభుత్వానికి సంబంధించి 2804 ఫిర్యాదులు రాగా పెట్రోలియం మంత్రిత్వ శాఖపై 2722 ఫిర్యాదులు వచ్చాయి. ఇన్సూరెన్స్ కంపెనీలు, టెలికాం రంగం, రక్షణ మంత్రిత్వ శాఖ, ఆహార, ప్రజా పంపిణీ శాఖలలో కూడా వేల సంఖ్యలో ఫిర్యాదులు నమోదవడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది.

20 ఏళ్లు గడిచినా శిక్షలు ఏవీ?
విజిలెన్స్ కమిషనే స్వయంగా జోక్యం చేసుకుని చర్యలు తీసుకుంటున్నా కూడా అవినీతిపరుల్లో భయం పుట్టకపోవడం విచారకరం. మరోవైపు సీబీఐ వద్ద 7229 అవినీతి కేసులు ఇంకా విచారణ దశలోనే పెండింగ్‌లో ఉన్నాయి. ఇందులో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే కేవలం 409 కేసులు ఏకంగా 20 ఏళ్లకు పైగా కోర్టుల్లోనే నానుతూ ఉన్నాయి. దోషులకు శిక్ష పడకపోతే ఇక చట్టంపై ప్రజలకు నమ్మకం ఎలా ఉంటుందనేది ప్రశ్న. చట్టాలు ఎంత కఠినంగా ఉన్నా లంచగొండితనం మాత్రం వేర్ల నుంచి తొలగిపోవడం లేదు. కేవలం నివేదికలు ఇస్తే సరిపోదు, దోషులను కటకటాల వెనక్కి నెడితేనే మార్పు సాధ్యమవుతుంది.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *