బాబా బూతులు… కంగనా వాతలు – రాందేవ్ వ్యాఖ్యలపై బాలీవుడ్ నటి ఫైర్

Ramdev Baba Vs Kangana
  • వ్యక్తిగత జీవితంలోకి రావడంపై ఆగ్రహం
  • రాందేవ్ బాబా మోసాలపై కంగనా ప్రస్తావన
  • ఇద్దరి మధ్య ముదిరిన మాటల యుద్ధం

సహనం వందే, న్యూఢిల్లీ:

రాజకీయాలు వ్యాపారం ఆధ్యాత్మికత ఇవన్నీ ఇప్పుడు ఒకే గాడిలో నడుస్తున్నాయి. బీజేపీ ఎంపీ కంగనా రనౌత్, యోగా గురువు బాబా రాందేవ్ మధ్య చెలరేగిన తాజా వివాదం దీనికి నిదర్శనం. ఒక మహిళ వ్యక్తిగత జీవితంపై బాబా చేసిన చౌకబారు వ్యాఖ్యలపై కంగనా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

రాందేవ్ చౌకబారు వ్యాఖ్యలు…
బాబా రాందేవ్ ఇటీవల హద్దులు దాటి మాట్లాడారు. బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ లక్ష్యంగా ఆయన బహిరంగ వేదికపై తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కంగనా చిన్నతనం ఎలా గడిచింది? ఆమె యవ్వనం ఎలా సాగింది? ఆమె సాధించిన విజయాలు ఏమిటి? అంటూ ఎద్దేవా చేశారు. ప్రస్తుత యువతను జనరేషన్ గట్టర్ అని కంగనా అనడాన్ని ఆయన తీవ్రంగా తప్పుపట్టారు. ఇలాంటి వ్యాఖ్యలు చేయడం కలుషితమైన మనస్తత్వానికి నిదర్శనం అని రాందేవ్ తీవ్ర స్థాయిలో ఆరోపించారు.

భగ్గుమన్న కంగనా…
రాందేవ్ చేసిన ఈ వ్యాఖ్యలు నేరుగా కంగనా చెవుల్లోకి వెళ్లాయి. ఎవరికీ భయపడని ఫైర్ బ్రాండ్ కంగనా అగ్గిమీద గుగ్గిలం అయ్యారు. తనదైన శైలిలో ఆమె తీవ్రంగా విరుచుకుపడ్డారు. బాబా జీ నా యవ్వనం, బెడ్‌రూమ్ గురించి పగటి కలలు కనకండి అంటూ ఆమె నేరుగా ఘాటైన పదజాలంతో హెచ్చరించారు. కేవలం ఎవరో చెప్పే రూమర్లు గాసిప్‌ల ఆధారంగా ఒక మహిళ వ్యక్తిగత జీవితంపై కామెంట్లు చేయడం ఒక గురువుకు తగదని ఆమె గట్టిగా హితవు పలికారు.

సుప్రీంకోర్టు చీవాట్ల అస్త్రం
కంగనా కేవలం ఆగ్రహం వ్యక్తం చేయడంతో సరిపెట్టలేదు. బాబా రాందేవ్ గత చరిత్రను, ఆయన నకిలీ వ్యాపారాన్ని ఆమె నేరుగా టార్గెట్ చేశారు. కనీసం తనకు ఇప్పటివరకు సుప్రీంకోర్టు నుంచి ఎలాంటి మొట్టికాయలు పడలేదని ఆమె గుర్తు చేశారు. తాను మాట్లాడే ప్రతి మాట కచ్చితమైన ఆధారాలతో ఉంటుందే తప్ప కట్టుకథల మీద కాదని స్పష్టం చేశారు. మార్కెట్లో వస్తువులను అమ్ముకోవడానికి తప్పుడు ప్రకటనలు, మోసపూరిత క్లెయిమ్‌లు చేసే వారి కంటే తన పాత్ర ఎంతో స్వచ్ఛంగా ఉంటుందని ఆమె తేల్చి చెప్పారు.

Ramdev Baba  Vs Kangana

నైతికతపై నిలదీత…
తన క్యారెక్టర్ గురించి మాట్లాడే నైతిక హక్కు బాబా రాందేవ్‌కు అసలే లేదని ఎంపీ కంగనా కుండబద్దలు కొట్టారు. తన క్యారెక్టర్ ఆయన కంటే ఎంతో మెరుగ్గా ఉందని, తనలో ఎలాంటి మోసాలు లేవని ఆమె ధీమాగా చెప్పారు. రాందేవ్ ఒక ఫ్రాడ్ అని ఆయన నుంచి తాను ఎలాంటి క్యారెక్టర్ పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం లేదని మండిపడ్డారు. పతంజలి ఆయుర్వేద ఉత్పత్తుల ప్రకటనల విషయంలో సుప్రీంకోర్టు రాందేవ్‌ను తీవ్రంగా మందలించిన సంగతిని గుర్తుచేస్తూ ఆయన వ్యాపార సామ్రాజ్యం నైతికతను కంగనా కడిగిపారేశారు.

రాజకీయ కలకలం…
బాలీవుడ్ నటిగా ఉన్నప్పటి నుంచి కంగనా ఎప్పుడూ వివాదాలకు కేంద్ర బిందువే. ఇప్పుడు అధికార పార్టీకి చెందిన ఎంపీగా ఆమె ఒక యోగా గురువును నేరుగా ఢీకొనడం రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. ఒకరినొకరు కింది స్థాయికి దిగి విమర్శించుకోవడం వెనుక ఉన్న అసలు రాజకీయ కోణంపై సర్వత్రా చర్చ నడుస్తోంది. ఒకరు ఆధ్యాత్మికత ముసుగులో విమర్శిస్తే మరొకరు చట్టపరమైన అంశాలను అస్త్రాలుగా మలచి తిప్పికొడుతున్నారు. వీళ్లిద్దరి మధ్య నడుస్తున్న ఈ పబ్లిక్ వివాదం ఇప్పుడు జాతీయ స్థాయిలో పతాక శీర్షికలకు ఎక్కింది.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *