ముఖ్యమంత్రుల రక్తచరిత్ర – దేశంలో సగం మంది సీఎంలు క్రిమినల్స్

Criminal Chief Ministers
  • అత్యధికంగా రేవంత్‌రెడ్డిపై 89 కేసులు
  • పశ్చిమ బెంగాల్‌ సీఎంపై 29 కేసులు
  • చంద్రబాబు నాయుడుపై 19 కేసులు
  • సుప్రీంకోర్టుకు సంచలనాత్మక నివేదిక

సహనం వందే, న్యూఢిల్లీ:

దేశంలో చట్టాలను తయారు చేయాల్సిన ముఖ్యమంత్రులు, ప్రజాప్రతినిధులే అత్యంత తీవ్రమైన క్రిమినల్ కేసులను ఎదుర్కొంటున్న వైనంపై సుప్రీంకోర్టుకు సంచలన నివేదిక అందింది. ప్రజాస్వామ్య వ్యవస్థను కుదిపేస్తున్న ఈ దారుణ నిజాలు రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతున్నాయి.

సగం మంది ముఖ్యమంత్రులపై కేసులు
దేశంలోని మొత్తం 28 రాష్ట్రాల ముఖ్యమంత్రులలో ఏకంగా 14 మందిపై తీవ్రమైన క్రిమినల్ కేసులు పెండింగ్‌లో ఉన్నట్లు సుప్రీంకోర్టుకు అమికస్ క్యూరీ, సీనియర్ అడ్వకేట్ విజయ్ హన్సారియా 96 పేజీల నివేదిక సమర్పించారు. శాసనాలను అమలు చేయాల్సిన పదవుల్లో ఉండి నేరారోపణలు ఎదుర్కొంటున్న ఈ అగ్రనేతల జాబితా దేశ రాజకీయాల నూతన బండారాన్ని బట్టబయలు చేసింది. పాలకుల ముఖాల వెనుక ఉన్న ఈ నేర చరిత్రలు సామాన్య ప్రజలను విస్మయానికి గురిచేస్తున్నాయి.

Criminal Chief Ministers

తెలంగాణ ముఖ్యమంత్రిదే అగ్రస్థానం
ఈ సంచలన జాబితాలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొదటి స్థానంలో నిలిచారు. ఆయనపై వివిధ రకాలైన 89 తీవ్రమైన కేసులు పెండింగ్‌లో ఉన్నట్లు నివేదిక స్పష్టం చేసింది. ఇక తర్వాతి స్థానాల్లో పశ్చిమ బెంగాల్‌కు చెందిన సువెందు అధికారిపై 29 కేసులు, కర్ణాటక ముఖ్యమంత్రి డి. శివకుమార్, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడులపై చెరో 19 కేసులు ఉన్నాయి. ఆ తర్వాతి స్థానంలో కేరళ ముఖ్యమంత్రి వీడీ సతీశన్ పై 18 కేసులు ఉన్నట్లు కోర్టుకు తెలిపారు. జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ పై 5 కేసులు, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్, హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్‌విందర్ సింగ్ సుక్కులపై చెరో 4 కేసులు ఉన్నాయి. తమిళనాడు సీఎం జోసెఫ్ విజయ్ పై 2 కేసులు, బీహార్ ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరిపై 2 కేసులు నమోదై ఉన్నాయి. సిక్కిం సీఎం పీఎస్ తమాంగ్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్, ఒడిశా సీఎం మోహన్ చరణ్ మాఝీ, రాజస్థాన్ సీఎం భజన్ లాల్ శర్మలపై ఒక్కో కేసు చొప్పున పెండింగ్‌లో ఉన్నాయి.

ఎమ్మెల్యేల భయంకరమైన నేర చరిత్ర…
కేవలం ముఖ్యమంత్రులు మాత్రమే కాకుండా అనేక రాష్ట్రాల శాసనసభ్యుల పరిస్థితి మరింత దిగజారిపోయింది. దేశంలోనే అత్యధికంగా తీవ్రమైన క్రిమినల్ కేసులున్న ఎమ్మెల్యేలు ఉన్న రాష్ట్రంగా పశ్చిమ బెంగాల్ మొదటి స్థానంలో నిలిచింది. అక్కడ మొత్తం 292 మంది ఎమ్మెల్యేలలో ఏకంగా 170 మంది అంటే 58 శాతం మందిపై తీవ్రమైన కేసులున్నాయి. కేరళలో 57 శాతం, ఆంధ్రప్రదేశ్‌లో 56 శాతం, తెలంగాణలో 49 శాతం, జార్ఖండ్, ఒడిశాలలో 45 శాతం చొప్పున ఎమ్మెల్యేలు క్రిమినల్ కేసులను మోస్తూనే చట్టసభల్లో అడుగుపెడుతున్నారు. ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులే నేరాల చరిత్ర కలిగి ఉండటం మన ఎన్నికల వ్యవస్థలో నెలకొన్న తీవ్ర లోపాలను ఎత్తి చూపుతోంది.

పార్లమెంటులోనూ నేరస్థుల తిష్ట
లోక్‌సభలోని మొత్తం 543 మంది సభ్యులలో 31 శాతం మంది అంటే దాదాపు 170 మంది ఎంపీలపై తీవ్రమైన క్రిమినల్ కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. తెలంగాణలో 17 మంది ఎంపీలకు గాను 11 మందిపై, కేరళలో 21 మందికి గాను 11 మందిపై కేసులున్నాయి. బీహార్‌లో 40 మందికి 19 మంది, ఉత్తరప్రదేశ్‌లో 80 మందికి 34 మంది ఎంపీలు తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. మహారాష్ట్రలో 48 మంది ఎంపీలలో 17 మందిపై, బెంగాల్‌లో 42 మందిలో 16 మందిపై, ఆంధ్రప్రదేశ్‌లో 25 మందిలో 9 మంది ఎంపీలపై తీవ్రమైన కేసులు నమోదై ఉన్నాయి. రాజ్యసభ విషయానికి వస్తే మొత్తం 233 మంది సభ్యులలో 33 శాతం మందిపై క్రిమినల్ కేసులు ఉండగా అందులో ఐదు సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ శిక్ష పడే అవకాశం ఉన్న తీవ్రమైన కేసులు ఏకంగా 40 ఉన్నాయి.

పెండింగ్‌లో వేల కేసులు…
ఈ ఏడాది జూలై నాటికి దేశవ్యాప్తంగా సిట్టింగ్, మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలపై పెండింగ్‌లో ఉన్న మొత్తం క్రిమినల్ కేసుల సంఖ్య ఏకంగా 4192కి చేరింది. ఇందులో అత్యధికంగా ఒక్క ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోనే 1171 కేసులు విచారణ దశలో ఉండటం చూస్తుంటే అధికార బలంతో కేసులు ఎంతలా నీరుగారుతున్నాయో స్పష్టమవుతోంది. ప్రజాప్రతినిధులపై పెండింగ్‌లో ఉన్న కేసుల సత్వర విచారణ కోసం ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేయాలని అమికస్ క్యూరీ సుప్రీంకోర్టును కోరారు. ఆయా రాష్ట్రాల హైకోర్టులు ఈ కేసుల విచారణ తీరును స్వయంగా పర్యవేక్షించాలని నివేదికలో గట్టిగా సిఫారసు చేశారు.

ప్రజాస్వామ్యానికి పెను ముప్పు
రాజకీయ నాయకులు ఎంతటివారైనా అధికారంలో ఉన్నా లేకపోయినా చట్టం ముందు సమానులే అనే నిబంధన కేవలం కాగితాలకే పరిమితమవుతోందనే విమర్శలు తీవ్రమవుతున్నాయి. ఎన్నికల అఫిడవిట్లలో అన్ని వివరాలు స్పష్టంగా ఉన్నప్పటికీ రాజకీయ పార్టీలు అవేం పట్టించుకోకుండా నేరచరితులకు టికెట్లు కట్టబెడుతున్నాయి. ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఆ నాయకులే కోర్టుల చుట్టూ తిరుగుతూ అధికార బలంతో విచారణలను దశాబ్దాల తరబడి వాయిదా వేయిస్తున్నారు. సామాన్యుడి చిన్న తప్పునకే తక్షణ శిక్ష పడే దేశంలో ప్రజాప్రతినిధుల ఈ నేరాలకు మాత్రం దశాబ్దాల విచారణ ఎందుకు అవసరమనేది ఎప్పటికీ వీడని ప్రశ్నగా మారుతోంది.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *