సిగ్గుమాలిన ఎన్టీఏ… విద్యార్థులను ముంచే – నిన్న నీట్… నేడు నెట్…. తీరుమారని దరిద్రం

NTA NET Paper Leak
  • కీలకమైన నెట్ ప్రశ్నలన్నీ తప్పులు తడకే
  • 2024 ఇంగ్లీష్ పేపర్ నుంచి సగం ప్రశ్నలు
  • ఎన్టీఏ నిర్వాకం… మూడు పరీక్షల రద్దు
  • మళ్లీ పరీక్షలకు ఏర్పాట్లు చేసిన అధికారులు

సహనం వందే, న్యూఢిల్లీ:

నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) నిర్వహించిన యూజీసీ నెట్ పరీక్షల్లో భారీగా తప్పులు దొర్లాయి. ఇంగ్లీష్, కామర్స్, సోషియాలజీ పేపర్లలో అక్షర దోషాలు, పాత ప్రశ్నల పునరావృతం తీవ్ర కలకలం రేపాయి. దీంతో ఏడు వారాల నిరీక్షణ తర్వాత ఆ మూడు సబ్జెక్టుల పరీక్షలను పూర్తిగా రద్దు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. అభ్యర్థుల భవిష్యత్తును అగమ్యగోచరంగా మార్చిన ఈ భారీ వైఫల్యంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

NTA

దేశంలో అధికారిక వైఫల్యాల పరాకాష్ట…

గత మూడు నెలలుగా దేశాన్ని ఉక్కిరిబిక్కిరి చేసిన నీట్ పరీక్షల లీక్ వ్యవహారం… విద్యార్థుల ఉద్యమాలు… కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా… ఇలాంటి ఘటనలతో దేశం వణుకుతుంటే ఎన్టీఏ తీరును ఏమాత్రం మార్చుకోవడం లేదు. అసిస్టెంట్ ప్రొఫెసర్ అర్హత, పీహెచ్‌డీ ప్రవేశాల కోసం నిర్వహించే అత్యంత కీలకమైన యూజీసీ నెట్ పరీక్షల నిర్వహణలో తీవ్రమైన నిర్లక్ష్యం బయటపడింది. జూన్ నెలలో జరిగిన ఈ పరీక్షకు సంబంధించి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విడుదల చేసిన ప్రావిజనల్ ఆన్సర్ కీలలో తీవ్రమైన గోల్‌మాల్ వెలుగు చూసింది. మొత్తం 87 సబ్జెక్టులకు గాను 84 సబ్జెక్టుల కీలను విడుదల చేసిన అధికారులు, ఇంగ్లీష్, కామర్స్, సోషియాలజీ సబ్జెక్టుల కీలను మాత్రం నిలిపివేశారు. ఈ మూడు సబ్జెక్టుల ప్రశ్నపత్రాలలో తీవ్రమైన తప్పులు ఉన్నట్లు గుర్తించడంతో పరీక్షల నిర్వహణపై పెద్ద ఎత్తున విమర్శలు చెలరేగాయి. విద్యార్థుల నుంచి వస్తున్న తీవ్రమైన ఫిర్యాదుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికార వర్గాలు స్పష్టం చేశాయి.

పరీక్షా పేపర్‌ తప్పుల తడక…

సోషియాలజీ పరీక్షా పేపర్‌లో దొర్లిన తప్పులు చూస్తే ఎన్టీఏ పనితీరు ఏ స్థాయిలో ఉందో స్పష్టంగా అర్థమవుతుంది. పేపర్‌లో ప్రముఖ సామాజిక శాస్త్రవేత్తల పేర్లే పూర్తిగా తప్పుగా ముద్రితమయ్యాయి. ర్రిట్జర్ పేరు పుట్జర్ గాను, పార్సన్స్ పేరు పార్సో గాను, ఘుర్యే పేరు ఘున్యే గాను, ఏఆర్ దేశాయ్ పేరు ఏకే దేశాయ్ గాను తప్పుగా వచ్చాయి. దీనికి తోడు పుస్తకాల పేర్లు గందరగోళంగా ఉండటం, వ్యాకరణ, పంక్చుయేషన్ తప్పులు దొర్లడం, ప్రాథమిక సిలబస్‌తో సంబంధం లేని ప్రశ్నలు ఇవ్వడం జరిగాయి.

ఇంగ్లీష్ పేపర్‌లో పాత ప్రశ్నల దండయాత్ర

ఇంగ్లీష్ సబ్జెక్ట్ పరీక్షా పేపర్‌లో ఏకంగా కాపీ పేస్ట్ దందాలు బయటపడ్డాయి. 2024 సంవత్సరంలో జరిగిన పరీక్షలో అడిగిన 150 ప్రశ్నలలో ఏకంగా 67 ప్రశ్నలు ఈసారి జరిగిన పరీక్షలో అచ్చం అలాగే పునరావృతమయ్యాయి. కనీసం ఆప్షన్ల క్రమం కూడా మార్చకుండా యథాతథంగా దింపేయడం అధికారులు ఎంత బాధ్యతారహితంగా వ్యవహరించారో తేటతెల్లం చేస్తోంది. ఇదే తరహాలో కామర్స్ పేపర్‌లో కూడా ప్రశ్నలు రిపీట్ కావడం పట్ల అభ్యర్థులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. నిరుద్యోగుల భవితవ్యాన్ని నిర్ణయించే జాతీయ స్థాయి పరీక్షలలో ఈ స్థాయి కాపీ కొడుతుండటం విద్యా వ్యవస్థలోని లోపాలను ఎత్తి చూపుతోంది.

సమస్య పరిష్కారానికి కమిటీ మొండిచేయి

ఫిర్యాదుల పరిశీలన కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక కమిటీ ఎన్టీఏ అవకతవకలను బట్టబయలు చేసింది. సాధారణంగా ఆన్సర్ కీ ప్రక్రియలో తప్పు ప్రశ్నలను తొలగించి మార్కులు కలపడం జరుగుతుంది. కానీ ఈ పేపర్లలోని లోపాలు ఆ స్థాయిని మించిపోయాయని కమిటీ తేల్చింది. ఫ్యాక్చువల్, టైపోగ్రాఫికల్, ట్రాన్స్‌లేషన్ తప్పులతో పాటు ప్రాథమిక ప్రమాణాలు కూడా గాలికి కొట్టుకుపోయినట్లు కమిటీ గుర్తించింది. ప్రశ్నలను తొలగించడం ద్వారా సమస్య పరిష్కారం కాదని, పేపర్ ప్రమాణాలు పూర్తిగా దెబ్బతిన్నాయని తేలడంతో రీటెస్ట్ నిర్వహణే ఏకైక మార్గంగా ఎన్టీఏ అంగీకరించింది. ఈ మూడు సబ్జెక్టుల పరీక్షలను సెప్టెంబర్ 9 మరియు సెప్టెంబర్ 10 తేదీలలో మళ్లీ నిర్వహించనున్నట్లు ఎన్టీఏ షెడ్యూల్ ప్రకటించింది.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *