కాలంతో పరిగెత్తలేక కాలగర్భంలోకి – టెక్ నిపుణుల కొలువుల్లో అల్లకల్లోలం

Tech Employees facing problems
  • బ్రాండింగ్ లేక బందీ అయిన బతుకులు
  • ప్రైవేట్ గోడల మధ్యే కరిగిపోయిన ప్రతిభ
  • సెంటిమెంట్ల ఉచ్చులో కోల్పోయిన శిఖరాలు
  • నమ్మకద్రోహానికి బలైన ఉద్యోగుల జీవితాలు
  • ప్రజల అవసరాలను గుర్తించక ఘోర వైఫల్యం

సహనం వందే, హైదరాబాద్:

భారీ వేతనాల భమలో కొట్టుమిట్టాడుతున్న టెక్ దిగ్గజాల అంతరంగం బట్టబయలైంది. గూగుల్, అమెజాన్, మెటా లాంటి సంస్థలలో లక్షల్లో జీతాలు అందుకుంటున్న నిపుణులు చేసిన పెద్ద పొరపాట్లే వారి కెరీర్‌ను ప్రశ్నార్థకం చేస్తున్నాయి. కంపెనీలను గుడ్డిగా నమ్మడం, మారుతున్న కాలానికి తగినట్లుగా టెక్నాలజీని అందిపుచ్చుకోలేకపోవడం నేడు ఎంతోమంది ఉద్యోగులను రోడ్డున పడేస్తోంది.

నమ్మకద్రోహానికి బలైన జీవితాలు
టెక్ రంగంలో పోటీ ఏ స్థాయిలో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మైక్రోసాఫ్ట్ సంస్థలో ఏకంగా 30 ఏళ్ల పాటు పని చేసిన మైక్ కోస్టెర్సిట్జ్ అనుభవం వింటే దిగ్భ్రాంతి కలగక మానదు. తన కెరీర్ చివరి దశలో ఆ కంపెనీ నుంచి అతన్ని తొలగించడం పెద్ద షాక్ ఇచ్చింది. కంపెనీ తనను బాగా చూసుకుంటుందనే నమ్మకంతో సుదీర్ఘకాలం ఒకేచోట పని చేశానని, కానీ కంపెనీలు మారినప్పుడు లాయల్టీ అనేది ఏమాత్రం పనికిరాదని అతను ఆలస్యంగా గ్రహించారు. మార్కెట్ పరిస్థితులు మారుతున్నప్పుడు ముందే అప్రమత్తమై బయట అవకాశాలు వెతుక్కోకపోవడమే తాను చేసిన పెద్ద పొరపాటని ఆయన బాహాటంగానే చెబుతున్నారు.

Tech Employees Vs AI

మారిన కాలం మరువని గుణపాఠం
మెటా సంస్థలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న మరో టెక్ నిపుణుడి బాధ కూడా అలాంటిదే. 2 సంవత్సరాల పాటు ఎడ్యుటెక్ స్టార్టప్‌లో మెషిన్ లెర్నింగ్ మోడల్స్ మీద పనిచేసిన అనుభవం ఉన్నప్పటికీ, ఆ తర్వాత గ్రాడ్యుయేట్ స్కూల్‌కు వెళ్లేటప్పుడు సిస్టమ్స్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ వైపు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. అప్పట్లో అది చాలా సురక్షితమైన మార్గమనిపించింది. కానీ కాలం మారుతున్న కొద్దీ ఏఐ రంగం ఎంత వేగంగా దూసుకుపోయిందో అందరం చూస్తున్నాం. ఒకవేళ అప్పట్లోనే ఆ టెక్నాలజీని వదలకపోయి ఉంటే ఈపాటికి ఎంతో ముందుండేవాడినని, ఆ నిర్ణయం ఇప్పుడు తనను ఆలోచనలో పడేస్తోందని అతను వెల్లడించారు.

ప్రైవేట్ గోడల మధ్యే కరిగిపోయిన ప్రతిభ
అమెజాన్‌లో డేటా సైంటిస్టుగా పనిచేస్తున్న నిఖిల్ సింగ్ తన సొంత అనుభవంతో ఒక ముఖ్యమైన పాఠాన్ని పంచుకున్నారు. దశాబ్దానికి పైగా వివిధ ఉత్పత్తులను అభివృద్ధి చేస్తూ, డేటా సైన్స్ పరిణామాన్ని దగ్గర నుంచి చూసినప్పటికీ, తాను నేర్చుకున్న విషయాలను ఎప్పుడూ పబ్లిక్‌గా షేర్ చేయలేదని వాపోయారు. కేవలం కంపెనీ గోడల మధ్యే ఉండిపోవడం వల్ల బయటి ప్రపంచానికి తన అనుభవం తెలియలేదన్నారు. ఒక ప్రొఫెషనల్ ఐడెంటిటీని కేవలం ఒక ఉద్యోగంతో సరిపెట్టుకోకుండా, బయట వేదికలపై మాట్లాడటం ద్వారా సొంతంగా నిర్మించుకోవాలని, లేదంటే లింక్డ్‌ఇన్‌లో మరో సాధారణ ఉద్యోగిలాగే మిగిలిపోతామని ఆయన హెచ్చరిస్తున్నారు.

కాలంతో పాటు పరుగులు పెట్టడంలో వైఫల్యం
రెడ్ హాట్ సంస్థలో సీనియర్ టెక్నికల్ ప్రోగ్రామ్ మేనేజర్‌గా ఉన్న స్నేహా షా తన అభిప్రాయం చెబుతూ, డేటా అనలిటిక్స్ నుంచి ఏఐ రంగానికి మారడానికి కొంచెం ఆలస్యం చేశానని అభిప్రాయపడ్డారు. మొదట్లో బిజినెస్ ఇంటెలిజెన్స్, డేటా ఇంజనీరింగ్‌పై గట్టి పట్టు సాధించినప్పటికీ, జనరేటివ్ ఏఐ వ్యూహాలపై మరింత ముందుగానే దృష్టి పెట్టి ఉంటే బాగుండేదని భావిస్తున్నారు. ఏదేమైనా ఆనాడు చేసిన విశ్లేషణ పనులే నేడు వ్యాపార రంగంలో ఏఐని ఎలా ఉపయోగించాలనే విషయంలో తనకు పెద్ద సాయం చేస్తున్నాయని ఆమె సంతృప్తి వ్యక్తం చేశారు.

సెంటిమెంట్ల ఉచ్చులో కోల్పోయిన శిఖరాలు
గూగుల్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా ఉన్న ఐమెన్ మోటెన్ తన కెరీర్‌పై మాట్లాడుతూ కేవలం ఒకే రంగంలో కూరుకుపోవడం వల్ల చాలా కోల్పోయానని తెలిపారు. సాఫ్ట్‌వేర్ ఇంజనీరింగ్ మీద మాత్రమే పూర్తి దృష్టి పెట్టడం వల్ల ప్రొడక్ట్ మేనేజ్‌మెంట్, సైబర్‌సెక్యూరిటీ, సొల్యూషన్స్ ఇంజనీరింగ్ లాంటి ఇతర అద్భుతమైన కెరీర్ మార్గాలను అసలు అన్వేషించలేకపోయానని చెప్పారు. ఆ రంగాల్లో ఉన్నవారితో మాట్లాడినప్పుడు, తాను మరో మార్గం ఎంచుకుంటే ఎలా ఉండేదోనని తరచూ ఆశ్చర్యపోతుంటానని ఆమె వివరించారు.

ప్రజల అవసరాలను గుర్తించకపోవడం…
అమెజాన్‌లోనే ఇంజనీర్‌గా రితికా తన కెరీర్ తొలి నాళ్ల తప్పులను గుర్తు చేసుకున్నారు. కేవలం పని పూర్తి చేయడంపైనే దృష్టి పెట్టానేకానీ, అసలు ఏ కస్టమర్ సమస్యను పరిష్కరిస్తున్నాం, దాని వల్ల సమాజానికి లేదా కంపెనీకి ఎంతటి ప్రభావం ఉంటుందనేది ఆలోచించలేదని వాపోయారు. కేవలం కోడింగ్ చేయడం వేరు, ప్రజలు నిజంగా విలువైనదిగా భావించే ఉత్పత్తులను తయారు చేయడం వేరు అనే అసలు మర్మాన్ని తెలుసుకోవడానికి తనకు కొంత సమయం పట్టిందని ఆమె పేర్కొన్నారు.

కాలానికి తగినట్లుగా మారలేకపోవడం…
మొత్తంగా చూస్తే, టెక్ రంగంలో ప్రయాణం అనేది ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఒక కంపెనీని గుడ్డిగా నమ్మడం, కొత్త టెక్నాలజీలను నేర్చుకోవడంలో ఆలస్యం, సొంత ప్రతిభను ప్రపంచానికి చాటుకోలేకపోవడం వంటి పొరపాట్లు ఎంతోమంది మేధావుల కెరీర్‌ను వెనక్కిలాగాయి. కాలానికి తగినట్లుగా మారడం, ఎప్పటికప్పుడు కొత్త విషయాలను ఆకళింపు చేసుకోవడం, కేవలం ఉద్యోగమే కాకుండా వ్యక్తిగత బ్రాండింగ్‌ను పెంచుకోవడం ద్వారానే ఇలాంటి తప్పుల నుంచి బయటపడవచ్చు. ఏ రంగంలోనైనా సరే విజయం సాధించాలంటే నిరంతరం నేర్చుకునే తపన ఒక్కటే మనల్ని కాపాడుతుంది.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *