యంత్రాలతో మిగిలేది ఒంటరితనమే – మార్క్ జుకర్‌బర్గ్ మానిఫెస్టోపై విమర్శలు

Mark Zuker Berg Comments on AI
  • భావోద్వేగాలు లేని ఏఐ భవిష్యత్తు
  • ఉత్పాదకత పేరుతో అనుభవాల కోత
  • ఏదో బతికేయడం కాదు అనుభవించాలి
  • సంపదను పోగు చేయడమే జీవితమా?

సహనం వందే, అమెరికా:

సాంకేతిక దిగ్గజం మార్క్ జుకర్‌బర్గ్ మానవ సంబంధాలను పూర్తిగా యాంత్రికం చేసేలా ఒక కొత్త ప్రణాళికను తెరపైకి తెచ్చారు. ఏఐ సాంకేతికతతో ప్రతి ఒక్కరి జీవితాన్ని సులభతరం చేస్తామంటూ ఆయన ప్రకటించిన సుదీర్ఘ విధాన పత్రం ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీసింది. మనుషుల మధ్య ఉండే సహజమైన అనుబంధాలను తొలగించి, ఆ స్థానంలో కృత్రిమ ఏజెంట్లను కూర్చోబెట్టాలని ఆయన చూస్తున్నారు. జీవితాన్ని కేవలం ఉత్పాదకత కోసమే అన్నట్లుగా మలచాలని ఆయన చేస్తున్న ప్రయత్నంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

యాంత్రిక ప్రపంచంలో కృత్రిమ బంధాలు
మార్క్ జుకర్‌బర్గ్ విడుదల చేసిన సుదీర్ఘ ప్రణాళిక అసలు మనుషుల జీవితాలను ఎటు వైపు తీసుకెళ్తుందనే దానిపై తీవ్రమైన ప్రశ్నలు వస్తున్నాయి. ఏఐ రంగంలో వస్తున్న వ్యతిరేకతను తగ్గించేందుకే ఆయన ఈ ప్రయత్నం చేస్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. డేటా కేంద్రాల ఏర్పాటు వల్ల పెరుగుతున్న విద్యుత్ బిల్లులపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహం ఉంది. మరోవైపు ఆంథ్రోపిక్ సీఈఓ డారియో అమోడీ హెచ్చరించినట్లుగా ఈ సాంకేతికత వల్ల ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఉంది. ఓపెన్ ఏఐ సీఈఓ సామ్ ఆల్ట్‌మాన్ ఇంటిపై జరిగిన దాడులే ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. ప్రజల ఆగ్రహాన్ని చల్లార్చేందుకే జుకర్‌బర్గ్ ఈ సోది కబుర్లు చెబుతున్నారనే విమర్శలు వస్తున్నాయి.

ప్రేమ అంటే శ్రద్ధ పెట్టడమే
వ్యక్తిగత ఏజెంట్లు మనుషుల బంధాలను, ఆరోగ్యాలను మెరుగుపరుస్తారని జుకర్‌బర్గ్ చెబుతున్నారు. కానీ నిజమైన ప్రేమ అనేది కేవలం ఒక అనుభూతి మాత్రమే కాదు… ఎదుటివారిపై మనం పెట్టే శ్రద్ధ అని గుర్తించాలి. తన కూతురితో కలిసి బేకింగ్ చేయడానికి ఏఐ సాయం తీసుకున్నానని ఆయన గర్వంగా చెబుతున్నారు. సొంతంగా ఆలోచించి వంటకం చేస్తే వచ్చే ఆనందాన్ని ఏ ఏఐ కూడా ఇవ్వలేదు. తండ్రి తన కూతురితో గడిపే సమయం, ఆమె ఇష్టాలను తెలుసుకునే ప్రయత్నం కేవలం ఒక యాంత్రిక పనిగా మారిపోతుంది. కష్టపడి నేర్చుకునే ఏ విద్యలోనైనా ఉండే ఆనందం ఏఐ ఇస్తే రాదు.

ఉత్పాదకత పేరుతో అనుభవాల కోత
పుస్తకం చదవడం అనేది కేవలం సమాచారం సేకరించడం కాదు… అది ఒక అనుభూతి. జుకర్‌బర్గ్ మాత్రం మనుషులు ప్రతి పనిలోనూ ఉత్పాదకతను పెంచుకోవాలని కోరుకుంటున్నారు. అభిరుచులను కూడా యంత్రాల ద్వారా చేయిస్తే ఆ మజాయే వేరుగా ఉంటుందని ఆయన నమ్ముతున్నారు. కానీ మనుషులు సరదాగా గడపాల్సిన హాబీలను కూడా ఉత్పాదకత కింద మార్చాలని చూడటం సరికాదు. ఇలా చేయడం వల్ల మనుషులు తమ జీవితంలోని అసలుసిసలు అనుభవాలను కోల్పోవాల్సి వస్తుంది.

డబ్బున్నవారికే అందలం
శాస్త్రీయ పురోగతిలో అందరూ భాగస్వాములు కావాలని ఆయన కోరుకుంటున్నారు. జోనాస్ సాల్క్ పోలియో వ్యాక్సిన్‌ను ఎలాంటి డబ్బులు ఆశించకుండా అందరికీ ఉచితంగా అందించారు. కానీ నేడు జుకర్‌బర్గ్ మాత్రం ఏఐ మోడల్స్‌ను డబ్బున్నవారికే అందుబాటులో ఉంచేలా పేవాల్స్ పెట్టాలని చూస్తున్నారు. అందరికీ ఉచితంగా ఇస్తామని చెప్పడం కేవలం మాటల గారడీ మాత్రమే. అంతిమంగా డబ్బున్నవారికే ఇవన్నీ దక్కుతాయనేది కాదనలేని సత్యం. సంపదను పోగు చేయడమే జీవితం అనుకునే సిలికాన్ వ్యాలీ కుబేరులకు జీవితం అంటే ఏమిటో అసలు అర్థం కావడం లేదు.

అనుభవాల విలువ తెలుసుకోవాలి
జీవితం అంటే కేవలం విజయాలను గుప్పెట్లో పెట్టుకోవడం కాదు. పుస్తకాలు చదవడం, సంగీతం వినడం, సినిమాలు చూడడం ఇవన్నీ మనుషుల మనసులను అర్థం చేసుకోవడానికి ఉపయోగపడతాయి. కళాకారులు తమ శైలిలో ప్రపంచాన్ని ఎలా చూస్తారో వ్యక్తపరుస్తారు. కానీ ఏఐ ద్వారా ఇవన్నీ క్షణాల్లో చేయిస్తే మనుషులకు మిగిలేది శూన్యమే. రాక్ క్లైంబింగ్ చేస్తున్నట్లు ఏఐతో పోస్టర్ తయారు చేసుకుని గర్వపడే వారిని చూస్తే జాలి వేస్తుంది. జీవితాన్ని అనుభవించకుండా కేవలం యంత్రాల వెంట పరిగెత్తితే చివరికి మిగిలేది ఒంటరితనం మాత్రమే.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *