- కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం మండిపాటు
- ఇదంతా కాలయాపన చేయడమేనని విమర్శ
- హక్కుల హననం… వెనుకబడిన న్యాయం
సహనం వందే, చెన్నై:
మహిళా రిజర్వేషన్ల చట్టాన్ని డీలిమిటేషన్‌తో ముడిపెట్టడం వెనుక ఒక పెద్ద రాజకీయ కుట్ర దాగి ఉందని, ఇది పూర్తి మోసపూరిత చర్య అని కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరం చేసిన సంచలన ఆరోపణలు దేశ రాజకీయాల్లో ఇప్పుడు పెను దుమారం రేపుతున్నాయి. రాహుల్ గాంధీ డిమాండ్‌కు పూర్తి మద్దతుగా నిలుస్తూ 2029లోపు 33 శాతం మహిళా రిజర్వేషన్లను ఎటువంటి సాకులతోనూ వాయిదా వేయకుండా వెంటనే అమలు చేయాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ వైఖరిపై తీవ్ర విమర్శలు వస్తున్న తీరు మహిళా లోకంలో ఆగ్రహాన్ని రగిలిస్తోంది.
ముసుగు వెనుక కుట్ర…
మహిళలకు రిజర్వేషన్లు కల్పించకుండా కేంద్ర ప్రభుత్వం ఒక కుట్రకు తెరలేపిందని చిదంబరం తీవ్రంగా ధ్వజమెత్తారు. ఈ రిజర్వేషన్ల అమలును డీలిమిటేషన్ ప్రక్రియతో ముడిపెట్టడం అత్యంత ప్రమాదకరమైన ఆలోచన అని ఆయన మండిపడ్డారు. ఇది కేవలం ఒక విధానపరమైన జాప్యం కాదని, దీని వెనుక పక్కాగా ఒక హిడెన్ ఎజెండా ఉండి తీరుతుందని ఆయన కుండబద్దలు కొట్టారు. మహిళల రాజకీయ ప్రాతినిధ్యాన్ని అణచివేయడమే లక్ష్యంగా పాలకులు ఈ కుతంత్రాలకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు.
కాలయాపన రాజకీయాలు
రాజ్యాంగ పరమైన హక్కులను కూడా కాలరాసేలా ప్రభుత్వాలు వ్యవహరిస్తున్న తీరు సిగ్గుచేటని రాజకీయ విశ్లేషకులు మండిపడుతున్నారు. 33 శాతం రిజర్వేషన్ల చట్టం పార్లమెంట్‌లో ఆమోదం పొందినా… దానిని అమలు చేయకుండా కాలయాపన చేయడం ద్వారా మహిళలను మోసం చేస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. సెన్సెస్, డీలిమిటేషన్ సాకులను ముందుకు తెచ్చి మహిళల హక్కులను కాలరాస్తున్న వైనం పాలకుల ద్వంద్వ వైఖరిని అద్దం పడుతోంది.
రిజిజు కామెంట్లపై విమర్శలు…
కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు మాత్రం మహిళా కోటా అమలు ప్రక్రియ జనాభా లెక్కలు, డీలిమిటేషన్ ప్రక్రియలతోనే ముడిపడి ఉంటుందని వాదిస్తున్నారు. ఈ చట్టబద్ధమైన ప్రక్రియలు ముగిసే వరకు కోటాను అమలు చేయడం కుదరదంటూ ఆయన ఎదురుదాడి చేస్తున్నారు. అయితే ప్రభుత్వపు ఈ వివరణలను ప్రతిపక్షాలు తీవ్రంగా తప్పుబడుతున్నాయి. ఇవన్నీ కేవలం మహిళలను మరింతకాలం వేచి ఉండేలా చేయడానికి పన్నుతున్న పన్నాగాలేనని వారు దుయ్యబట్టారు.
హక్కుల కోసం మహిళల పోరాటం…
మహిళల రాజ్యాంగ హక్కులను కేవలం రాజకీయ వ్యూహాల కోసం బలిపీఠం ఎక్కించడం అన్యాయమని ప్రతిపక్షాలు గట్టిగా నిలదీస్తున్నాయి. 2029 నాటికి కూడా మహిళలకు చట్టసభల్లో సముచిత స్థానం దక్కకపోతే అది ప్రజాస్వామ్యానికే పెను ముప్పు అవుతుందని హెచ్చరిస్తున్నారు. రిజర్వేషన్లను విడిగా ఎందుకు అమలు చేయలేరని నిలదీస్తున్న మహిళా లోకం, ఈ కాలయాపన వెనుక ఉన్న దోషుల ఎవరో నిలదీయాలని పిలుపునిస్తోంది.
పెరుగుతున్న ప్రజా ఆగ్రహం
ఈ పోరాటం ఇప్పుడు కేవలం ఒక రిజర్వేషన్ డిమాండ్‌ను దాటి దేశ భవిష్యత్తును నిర్ణయించే పెద్ద యుద్ధంగా మారింది. మహిళల కోటాను రాజకీయ తాకట్టు వస్తువుగా మారుస్తున్న పాలకుల తీరుపై నూతన తరహా ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది. ఈ సంక్షోభం నుంచి ప్రభుత్వం ఎలా బయటపడుతుందనే దానికంటే మహిళల ఆగ్రహాగ్ని నుంచి ఎలా తప్పుకుంటుందనేదే ఇప్పుడు అసలు ప్రశ్నగా మిగిలింది.
అంతులేని వేచిచూపు
చట్టాలు ఉన్నా అమలుకు నోచుకోని దయనీయ స్థితిలో మహిళల హక్కులు నలుగుతున్నాయి. చిదంబరం లేవనెత్తిన ఈ ప్రశ్నలకు ప్రభుత్వం ఎటువంటి సమాధానం ఇస్తుందనేది కాలమే నిర్ణయించాలి. ఏది ఏమైనా మహిళా రిజర్వేషన్ల అంశం దేశ రాజకీయాల్లో మరోసారి ప్రకంపనలు సృష్టిస్తోంది.