రోజంతా రోడ్డుపైనేనా? – ట్రాఫిక్ నగరాల్లో బెంగళూరు టాప్

Traffic Troubles in India
  • నాలుగో స్థానంలో నిలిచిన హైదరాబాద్
  • 10 కిలోమీటర్లు వెళ్ళడానికి 32:37 నిమిషాలు
  • అత్యంత మెరుగైన తక్కువ ట్రాఫిక్ నగరం ఢిల్లీ

సహనం వందే, హైదరాబాద్:

దేశంలోని ప్రధాన నగరాల్లో ట్రాఫిక్ నరకం ఏ స్థాయిలో ఉందో తాజా నివేదిక బట్టబయలు చేసింది. కేవలం 10 కిలోమీటర్ల దూరం ప్రయాణించడానికి అరగంటకు పైగా సమయం పడుతోంది. రద్దీ వేళల్లో ట్రాఫిక్‌లో చిక్కుకుని ఏటా వందల గంటలు వృథా అవుతున్నాయి. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

Traffic Troubles in India

మొదటి స్థానంలో బెంగళూరు
దేశంలోనే అత్యంత ట్రాఫిక్ నగరంగా బెంగళూరు మొదటి స్థానంలో నిలిచింది. ఇక్కడ 10 కిలోమీటర్లు వెళ్లడానికి 36:09 నిమిషాలు పడుతోంది. గతేడాదితో పోలిస్తే 2 నిమిషాలు సమయం పెరిగింది. రద్దీ వేళల్లో గడిపే ఈ ప్రయాణాల వల్ల ఏడాదిలో 168 గంటల సమయం వృథా అవుతోంది. ఉద్యోగులు మానసికంగా తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు.

కోల్‌కతాలో తీవ్ర ఇబ్బందులు
కోల్‌కతా నగరం ఈ ట్రాఫిక్ జాబితాలో రెండో స్థానంలో నిలిచింది. ఇక్కడ 10 కిలోమీటర్ల దూరం ప్రయాణించడానికి 35:18 నిమిషాల సమయం పడుతుంది. గతేడాదితో పోలిస్తే 25 సెకండ్లు అదనంగా పెరుగుదల నమోదయింది. రద్దీ వేళల్లో నగరవాసులు ఏడాదిలో 150 గంటల పాటు కేవలం రోడ్లపైనే గడపాల్సి వస్తోంది. ఇరుకైన రోడ్లు సమస్యను తీవ్రతరం చేస్తున్నాయి.

పూణే, హైదరాబాద్ స్థితి
పూణే నగరం ట్రాఫిక్ ఇబ్బందుల్లో మూడో స్థానాన్ని దక్కించుకుంది. ఇక్కడ 10 కిలోమీటర్ల దూరం ప్రయాణించడానికి 33:20 నిమిషాలు పడుతోంది. గత సంవత్సరంతో పోలిస్తే 11 సెకండ్లు పెరిగింది. ఏడాదికి 152 గంటలు వృథా అవుతున్నాయి. ఇక హైదరాబాద్‌లో 10 కిలోమీటర్ల ప్రయాణానికి 32:37 నిమిషాలు పడుతోంది. ఇక్కడ కూడా 11 సెకండ్లు పెరిగింది. ఏడాదికి 123 గంటల సమయం వృథా అవుతోంది. హైదరాబాద్ నాలుగో స్థానంలో నిలిచింది.

చెన్నై, ఎర్నాకులం తీరు
చెన్నై నగరంలో 10 కిలోమీటర్ల దూరం వెళ్లాలంటే 31:15 నిమిషాలు పడుతుంది. గతేడాదితో పోలిస్తే 1 నిమిషం ప్రయాణ సమయం పెరిగిపోయింది. ఏడాదికి 132 గంటల సమయాన్ని కోల్పోతున్నారు. ఇక ఎర్నాకులం నగరంలో 29:51 నిమిషాలు పడుతుండగా, ఏడాదిలో 118 గంటలు వృథా అవుతున్నాయి. చిన్న నగరాల్లో కూడా ఈ రకమైన రద్దీ పెరగడం ఆశ్చర్యకరంగా ఉంది.

జైపూర్, అహ్మదాబాద్ తీరు
జైపూర్‌లో 10 కిలోమీటర్ల ప్రయాణానికి 29:16 నిమిషాలు పడుతుండగా, 42 సెకండ్లు అదనంగా పెరిగింది. అహ్మదాబాద్‌లో 28:59 నిమిషాలు పడుతుండగా, ఇక్కడ మాత్రం 17 సెకండ్లు తగ్గింది. ముంబై నగరంలో 10 కిలోమీటర్లకు 28:51 నిమిషాలు పడుతుండగా, ఏడాదికి 126 గంటలు వృథా అవుతున్నాయి. ఆర్థిక రాజధానిలో ట్రాఫిక్ కాస్త మెరుగ్గా ఉన్నప్పటికీ జనం పాట్లు తప్పడం లేదు.

మెరుగ్గా ఢిల్లీ పరిస్థితి
దేశ రాజధాని న్యూఢిల్లీ విషయానికి వస్తే… మిగతా నగరాలతో పోలిస్తే ఇక్కడ పరిస్థితి చాలా మెరుగ్గా ఉంది. ఢిల్లీలో 10 కిలోమీటర్ల దూరం ప్రయాణించడానికి 24 నిమిషాల సమయం మాత్రమే పడుతోంది. గతేడాదితో పోలిస్తే 28 సెకండ్లు పెరిగినప్పటికీ, మిగతా నగరాలతో పోలిస్తే ఇక్కడే ప్రయాణం వేగంగా సాగుతోంది. రద్దీ వేళల్లో ఏడాదికి 104 గంటల సమయం కోల్పోతున్నారు. మెరుగైన రహదారులు ఢిల్లీకి వెసులుబాటు కల్పిస్తున్నాయి.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *