- ఆ బ్రాండ్ ఉత్పత్తులపై కేంద్రం నిషేధం
- వినియోగదారులను మోసం చేసిన కంపెనీ
- మోసపూరిత ప్రకటనలతో బురిడీ
సహనం వందే, న్యూఢిల్లీ:
బలానికి మంచిది కదా అని మనం కళ్లు మూసుకుని నమ్మే డాబర్ బ్రాండ్ వెనుక అసలు ఎంత పెద్ద మోసం దాగుందో తెలిస్తే దిమ్మ తిరిగిపోతుంది. స్వచ్ఛతకు మారుపేరు అని గొప్పలు చెప్పుకునే ఈ దిగ్గజ సంస్థ ప్రజల నమ్మకాన్ని పెట్టుబడిగా పెట్టి ఎలా దోచుకుంటుందో ఇప్పుడు ఆధారాలతో సహా బయటపడింది. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఎఫ్ఎస్ఎస్ఏఐ ఇచ్చిన దెబ్బకు ఆ సంస్థ నోరెళ్ల బెట్టింది.
తేనె తుట్టె కదిలింది…
మనం ఎంతో నమ్మకంతో రోజూ సేవించే తేనె, ఆవు నెయ్యి, యాపిల్ సైడర్ వెనిగర్ వంటి అత్యంత కీలకమైన ఆహార పదార్థాల విషయంలో డాబర్ ఇండియా సంస్థ చేసిన ఘోరమైన మోసం ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులు రంగంలోకి దిగి ఆ సంస్థకు చెందిన ఉత్పత్తుల అమ్మకాలపై అత్యవసర నిషేధాజ్ఞలు జారీ చేశారు. కోట్లాది మంది ప్రజలు ఆరోగ్యకరమైనవి అని నమ్మి కొనుగోలు చేస్తున్న వస్తువులపైనే ఇలాంటి వేటు పడటం ఆ సంస్థ నైతిక దిగజారుడుతనానికి నిదర్శనం కాదా.

మోసపూరిత ప్రకటనలు
కంపెనీ తన వెబ్సైట్లో విక్రయిస్తున్న తినుబండారాలపై వంద శాతం సహజం, వంద శాతం స్వచ్ఛత, వంద శాతం స్వచ్ఛతకు హామీ, వంద శాతం ఆర్గానిక్, వంద శాతం లేత కొబ్బరి నీళ్లు అంటూ ప్రచారం చేస్తోంది. ఈ ప్రకటనలన్నీ నిబంధనలకు విరుద్ధంగా ఉన్నట్లు తేలింది. అసలు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేకపోయినా, ఎలాంటి ప్రామాణికత లేకపోయినా కేవలం వినియోగదారులను బురిడీ కొట్టించడమే లక్ష్యంగా ఈ భారీ ప్రచార ఆర్భాటాలకు తెరలేపారు. అమాయక ప్రజలు ఈ పెద్ద పెద్ద ప్రకటనలను చూసి మోసపోతారనే ఉద్దేశంతోనే పక్కా ప్లాన్ ప్రకారం ఈ అబద్ధపు ప్రచారాన్ని హోరెత్తించారు.
లోగోల దుర్వినియోగం
డాబర్ హిమాలయన్ ఆర్గానిక్ ఆపిల్ సైడర్ వెనిగర్, డాబర్ ఆర్గానిక్ తేనె ఉత్పత్తులపై ఎలాంటి సరైన ఎఫ్ఎస్ఎస్ఏఐ ఆర్గానిక్ అనుమతి లేకపోయినా జైవిక్ భారత్ లోగోను ప్రదర్శిస్తున్నట్లు గుర్తించారు. అలాగే డాబర్ హోమ్మేడ్ కొబ్బరి పాలు ఉత్పత్తిని వంద శాతం స్వచ్ఛత అనే వాదనతో మార్కెట్లోకి వదిలారు. ఇలాంటి నిబంధనలు ఆహారాలకు వర్తించవని నిపుణులు చెబుతున్నారు.
హెచ్చరికలను బేఖాతరు
తప్పుడు ప్రచారాలను వెంటనే ఆపేయాలని ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా గతంలోనే డాబర్ సంస్థకు నోటీసులు జారీ చేసింది. అయితే కంపెనీ వైపు నుంచి ఎలాంటి దిద్దుబాటు చర్యలు తీసుకోలేదు. హెచ్చరికలను పెడచెవిన పెట్టడంతో ఇప్పుడు నేరుగా నిషేధాజ్ఞలు జారీ చేయాల్సి వచ్చింది. ఈ పరిణామంతో మార్కెట్లో తీవ్ర కలకలం రేగింది.
పదిహేను రోజుల్లో నివేదిక
గుర్తించిన ఆహార ఉత్పత్తులతో పాటు తప్పుడు ప్రకటనలు చేస్తున్న మిగతా అన్ని ఉత్పత్తుల అమ్మకాలను తక్షణమే నిషేధించాలని డాబర్ ఇండియా లిమిటెడ్ను ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆదేశించింది. అంతేకాకుండా దీనిపై 15 రోజుల్లోగా చర్యల నివేదికను సమర్పించాలని స్పష్టం చేసింది. ఆన్లైన్ మార్కెట్లలో విక్రయాలు జరుపుతున్న ఇతర సంస్థలపై కూడా నిఘా పెంచారు.
సోషల్ మీడియాలో హెచ్చరికలు
గత కొన్ని నెలలుగా వివిధ ఆహార వ్యాపార సంస్థలు, ఈ-కామర్స్ కంపెనీలపై ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా సోషల్ మీడియా వేదికగా కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు ప్రజలకు వివరిస్తోంది. ఇప్పటికే అనేక మద్యం తయారీదారులు, ఎనర్జీ డ్రింక్స్ కంపెనీలు కూడా ఈ నిఘా వలయంలోకి వచ్చాయి. ప్రజల ఆరోగ్యంతో ఆటలాడితే ఎంతటి బడా కంపెనీలకైనా ఇదే గతి పడుతుందని స్పష్టమవుతోంది.