- మూడేళ్ల పోరాటంతో ప్రభుత్వాలకే చెమటలు
- రైతన్న ఉద్యమంతో ఎయిర్ పోర్ట్ రిజెక్ట్
- 20 వేల కోట్లతో పెట్టుబడిపై గట్టి పోరాటం
- ఏకనాపురం ప్రజల ధీరత్వం
సహనం వందే, కాంచీపురం:
చెన్నై నగరానికి రెండవ విమానాశ్రయాన్ని ఏర్పాటు చేయాలనే ప్రభుత్వ బలవంతపు నిర్ణయాన్ని ఎదిరించి ఏకనాపురం రైతులు అక్షరాలా 1100 రోజులు సాగించిన అద్భుతమైన ఉద్యమంతో వేల కోట్ల ప్రాజెక్టును నిలవరించారు.
దిగ్గజాలకు చుక్కలు చూపిన ఏకనాపురం
చెన్నై రద్దీని తగ్గించడానికి కాంచీపురం జిల్లాలోని ఏకనాపురం గ్రామంలో 20 వేల కోట్ల రూపాయలకు పైగా వ్యయంతో కొత్త గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టు ఏర్పాటు చేయాలని అధికారులు మాస్టర్ ప్లాన్ సిద్ధం చేశారు. కానీ తమిళనాడులో ఢిల్లీ స్థాయి దిగ్గజాలకే చుక్కలు చూపిస్తూ ఏకనాపురం రైతులు మూడు సంవత్సరాలకు పైగా ఢిల్లీ స్థాయి దిగ్గజాలకే చుక్కలు చూపించారు. ఎన్నో ఉద్యమాలు కొద్దిరోజుల్లోనే నీరుగారిపోయినా ఈ గ్రామం మాత్రం మూడు సంవత్సరాలకు పైగా అద్భుతమైన ఉద్యమం సాగించింది.
36 నెలల నిరంతర యజ్ఞం
మిగతా చోట్ల లాగా కేవలం ఒక్కరోజు ధర్నాలు చేసి చేతులు దులుపుకోకుండా ఏకనాపురం ప్రజలు అక్షరాలా 1100 రోజులు అంటే దాదాపు మూడేళ్ల పాటు నిరంతర పోరాటాన్ని ఒక యజ్ఞంలా నడిపించారు. ప్రతిరోజూ ఉదయం లేస్తే నిరసన, రాత్రి పగలు తేడా లేకుండా గ్రామమంతా ఒకే తాటిపై నిలబడి సాగించిన ఈ సుదీర్ఘ పోరాటమే ప్రభుత్వాలను వణికించింది. రాజకీయ పార్టీలు, సంఘాలు వెనుక ఉండి నడిపిస్తేనే ఉద్యమాలు నడుస్తాయనే అప్రతిష్టను పూర్తిగా చెరిపేస్తూ ఆ గ్రామ ప్రజలే స్వయంగా తమ ఉద్యమానికి నాయకత్వం వహించారు.
మహిళలు పిల్లలతో గాంధేయ పోరు
ఈ పోరాటంలో మహిళలు, వృద్ధులు ముందుండి నడిచారు. పొలాలు పోతే తమ బతుకులు వీధిన పడతాయని భావించిన అక్కడి తల్లులు రోడ్డెక్కి వంటావార్పు కార్యక్రమాలు నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా జానపద పాటలు పాడుతూ ప్రదర్శనలు చేస్తూ నిరసనను నిత్యం చర్చనీయాంశంగా ఉంచారు. పిల్లలు సైతం స్కూళ్లకు సెలవులు పెట్టి మరీ తమ తల్లిదండ్రుల ఆవేదనకు గొంతుకలయ్యారు. ప్రతిరోజూ రిలే నిరాహార దీక్షలు చేయడం ప్రభుత్వ అధికారులను గ్రామంలోకి అడుగుపెట్టనీయకుండా బహిష్కరించడం వంటి వినూత్న పద్ధతులు అవలంబిస్తూ ఎక్కడా హింసకు తావు ఇవ్వకుండా కేవలం గాంధేయ మార్గంలోనే అధికారులకు చుక్కలు చూపించారు.
దిగివచ్చిన ప్రభుత్వం…
రోజులు గడిచేకొద్దీ ప్రజా వ్యతిరేకత తీవ్రరూపం దాల్చడంతో ప్రభుత్వాలు పూర్తిగా డిఫెన్స్ లో పడ్డాయి. ఏకనాపురం రైతుల గట్టి పట్టుదల ముందు భారీ బడ్జెట్ ప్రాజెక్ట్ సైతం మోకరిల్లింది. చివరకు ఏకనాపురం వద్ద విమానాశ్రయ నిర్మాణాన్ని నిలిపివేస్తున్నట్లు అధికారికంగా ప్రకటన వెలువడింది. ఈ వార్త తెలియగానే ఆ గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. రైతులు ఒకరికొకరు మిఠాయిలు తినిపించుకుంటూ తమ ఆనందాన్ని ఘనంగా పంచుకున్నారు.