- 19 ఏళ్ల తర్వాత కోల్‌కతాలో అడుగు
- గళం వినిపించేలా వేదికపై కవితలు
- ప్రముఖ రచయిత్రి తస్లీమా నస్రీన్ ప్రయాణం
సహనం వందే, కోల్‌కతా:
బంగ్లాదేశ్ నుంచి బహిష్కరణకు గురై దశాబ్దాలుగా ప్రవాస జీవితం గడుపుతున్న ప్రముఖ రచయిత్రి తస్లీమా నస్రీన్ సరిగ్గా 19 సంవత్సరాల తర్వాత కోల్‌కతాలో అడుగుపెట్టారు. 2007 నవంబర్ తర్వాత ఆమె మళ్లీ ఈ నగరానికి రావడం ఇదే మొదటిసారి. భావప్రకటన స్వేచ్ఛపై మతవాదులు చేసిన దాడులను ఎదిరిస్తూ తన గళాన్ని మరోసారి వినిపించేందుకు ఆమె రాక ఇప్పుడు రాజకీయంగానూ, సామాజికంగానూ తీవ్ర చర్చనీయాంశమైంది.
ఇంటికి చేరిన ప్రవాస స్వరం
తస్లీమా నస్రీన్ శుక్రవారం కోల్‌కతాలోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగారు. బంగ్లాదేశ్ నుంచి వేధింపులు ఎదుర్కొని 1994 లోనే దేశం విడిచి వెళ్లిన ఆమె, 2004 లో కోల్‌కతాలో ఆశ్రయం పొందారు. అయితే 2003లో తన పుస్తకంపై వచ్చిన నిరసనలు, 2007 నవంబర్ లో జరిగిన హింసాకాండ కారణంగా అప్పటి బుద్ధదేవ్ భట్టాచార్య ప్రభుత్వం ఆమెను నగరం నుంచి బలవంతంగా పంపేసింది. అప్పట్లో జైపూర్, ఢిల్లీల ద్వారా విదేశాలకు వెళ్లిన ఆమె దశాబ్దాల తర్వాత మళ్లీ అదే నగరానికి చేరుకున్నారు. ఈ రాకను ఆమె తన సొంత దేశానికి వస్తున్న భావోద్వేగ క్షణంగా అభివర్ణించారు.
బెంగాల్ గడ్డపై సాహిత్య ప్రయాణం
కోల్‌కతాకు తిరిగి వచ్చిన తస్లీమా నస్రీన్ రవీంద్ర సదన్ లో జరిగే మతతత్వ వ్యతిరేక సాహిత్య కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఈ వేదికపై ఆమె తొలిసారిగా బహిరంగంగా కవితలు వినిపించనున్నారు. ఈ పర్యటనకు భద్రత కల్పించిన పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి, నిర్వాహకులకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వం ఏది ఉన్నా రచయిత్రి స్వేచ్ఛ మాత్రం ప్రాథమిక హక్కుగా ఉండాలని స్పష్టం చేశారు. పశ్చిమ బెంగాల్ లో కొద్ది నెలల క్రితం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరుణంలో ఈ సాహిత్య కార్యక్రమం ప్రాధాన్యత సంతరించుకుంది.
మతవాదంపై రాజీలేని పోరాటం
మహిళల హక్కులపై, మత తీవ్రవాదంపై తస్లీమా నస్రీన్ ఎప్పుడూ నిష్కర్షగా రాస్తూనే ఉన్నారు. మత గ్రంథాలు సమకాలీన సమాజానికి పనికిరావని చెప్పినందుకే తనను దేశం నుంచి బహిష్కరించారని ఆమె తెలిపారు. మతాలను ప్రభుత్వం నుంచి వేరు చేయాలని, 21 వ శతాబ్దంలో 7 వ శతాబ్దపు చట్టాలను అమలు చేయాల్సిన అవసరం లేదని ఆమె గట్టిగా పోరాడుతున్నారు. ఇరాన్ లో మహిళలపై ఆంక్షలను తీవ్రంగా వ్యతిరేకిస్తూనే అమెరికా, ఇజ్రాయెల్ సైనిక జోక్యాన్ని కూడా తాను సమర్థించబోనని స్పష్టం చేశారు.
భారత్ బంగ్లాదేశ్ పరిస్థితులపై…
ఇండియాలో ముస్లింలకు సమాన హక్కులు ఉన్నాయని, హిందువులతో సమానంగా అన్ని ప్రయోజనాలు పొందుతున్నారని తస్లీమా నస్రీన్ విశ్లేషించారు. భారత్ లో ముస్లింల జనాభా తగ్గడం లేదని, కానీ బంగ్లాదేశ్ లో హిందువుల జనాభా మాత్రం వలసల కారణంగా తగ్గిపోయిందని తెలిపారు. బంగ్లాదేశ్ లో హిందువులు అణచివేతకు భయపడి కోర్టులకు కూడా వెళ్లలేకపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. పాలస్తీనాలో అఘాయిత్యాలపై ఆందోళన చెందుతున్న వారు ముందుగా తమ దేశంలో జరుగుతున్న తప్పులనే సరిదిద్దుకోవాలని సూచించారు.
స్వేచ్ఛే ప్రాతిపదికగా ప్రజాస్వామ్యం
సెక్యులరిజంకు, మతతత్వానికి మధ్యే అసలైన సంఘర్షణ జరుగుతోందని తస్లీమా నస్రీన్ తేల్చిచెప్పారు. స్వేచ్ఛను కోరుకునే వారికి, కోరుకోని వారికి మధ్యే తేడా ఉందని వివరించారు. భిన్నాభిప్రాయాలు వ్యక్తంచేసే హక్కు, ఇతరులను విమర్శించే స్వేచ్ఛ లేకపోతే ప్రజాస్వామ్యం మనగడ సాధ్యం కాదని అన్నారు. విదేశాల్లో సుదీర్ఘకాలం గడిపినా ఎప్పుడూ తన రచనల ద్వారా మహిళా సాధికారత కోసం, అభ్యుదయ భావాల కోసం ఆమె తన పోరాటాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు.