- అందని లెక్కలు… చందాల పేరుతో దోపిడీ
- బయటపడ్డ అక్రమాలు… పైపైన చర్యలు
- పెద్ద వారిని తప్పించి చిన్న వారిపై యాక్షన్
- మౌనంగా ఉన్న అధికార యంత్రాంగం
సహనం వందే, అయోధ్య:
దైవకార్యం పేరుతో భక్తులు అర్పించిన కానుకలు ఇప్పుడు కనుమరుగవుతున్నాయి. అయోధ్య రామమందిర నిర్మాణం కోసం సమర్పించిన వెండి ఇటుకల నుంచి నగదు వరకు ఏవీ నేడు లెక్కల్లో లేవు. ఆస్థానంలో సాగిన నిధుల సేకరణ వ్యవస్థ, ఆ తరువాత వెలుగులోకి వచ్చిన అవినీతి బాగోతం భక్తుల నమ్మకాన్ని వమ్ము చేస్తోంది. మందిరం పవిత్రతను కాపాడాల్సిన వారు అక్రమాలకు పాల్పడి సంపదను పోగేసుకున్న తీరు ఇప్పుడు దేశాన్ని నిశ్చేష్టులను చేస్తోంది.
పవిత్ర వెండి ఇటుకల మాయాజాలం
పుణెకు చెందిన సింధీ సమాజ సభ్యులు 210 వెండి ఇటుకలను విరాళంగా ఇచ్చారు. వీటి విలువ సుమారు 2 కోట్లుగా ఉంటుంది. ప్రతి ఇటుక ఒక కిలో బరువు కలిగి ఉండేది. వీటిని ట్రస్టు జనరల్ సెక్రటరీ చంపత్ రాయ్‌కు అప్పగించారు. అయితే వీరికి ఎటువంటి రసీదు ఇవ్వలేదు. క్వాలిటీ చెకింగ్ పేరిట కాలయాపన చేశారు. ఐదేళ్లు గడిచినా ఆ వెండి ఇటుకలు ఎక్కడికి వెళ్ళాయో ఎవరికీ తెలియదు. అప్పగించిన కానుకల జాడ కూడా లేకపోవడం పెద్ద వివాదంగా మారింది.
నిధుల సేకరణలో వ్యవస్థీకృత దోపిడీ
మందిరంలోని 35 డొనేషన్ బాక్సుల ద్వారా నిధులు సేకరిస్తారు. వీటిని 200 మీటర్ల దూరంలోని కౌంటింగ్ రూమ్ కి తరలిస్తారు. రోజూ 8 నుంచి 13 లక్షల రూపాయల వరకు వసూలవుతుంటుంది. కొన్ని రోజుల్లో ఇది 60 లక్షల వరకు వెళ్తుంది. ఈ ప్రక్రియలో ప్రైవేట్ ఏజెన్సీలు, ట్రస్టు సిబ్బంది కలిసి పని చేస్తారు. నోట్ల కట్టలను లెక్కించేటప్పుడు 10 కట్టలకు బదులుగా 12 నుండి 13 కట్టలను లెక్కించి మిగిలిన వాటిని కాజేసేవారని అకౌంట్ ఇంచార్జి మహిపాల్ సింగ్ బయటపెట్టారు.
అక్రమ ఆస్తుల వెనుక దాగి ఉన్న నిజాలు
కౌంటింగ్ సిబ్బందిగా పనిచేసిన వారిలో లవ్కుష్ మిశ్రా, అనుకల్ మిశ్రా, కేడీ తివారీ, టిన్ను యాదవ్ వంటి వారు ఉన్నారు. ఒకప్పుడు కారు మెకానిక్ గా ఉన్న లవ్కుష్ ఇంట్లో లక్ష రూపాయలు దొరకగా, కేడీ తివారీ 5 కోట్ల పైగా ఆస్తులు సంపాదించారు. టిన్ను యాదవ్ 50 కోట్ల విలువైన ఆస్తులను కూడగట్టారు. బ్యాంకులు సైతం ముందే హెచ్చరించినా ట్రస్టులోని కొందరు పెద్దలు ఈ అక్రమాలను అడ్డుకోకపోగా ప్రశ్నించిన వారిని విధుల నుంచి తొలగించారు.
భూముల కొనుగోలులో భారీ కుంభకోణం
మందిర నిర్మాణ సమయంలో భూమి కొనుగోళ్లలో తీవ్రమైన అవకతవకలు జరిగాయి. రెండు కోట్లకు కొన్న భూమిని కేవలం 10 నిమిషాల్లోనే 18.5 కోట్ల రూపాయలకు ట్రస్టుకు అమ్మిన ఉదంతాలు వెలుగులోకి వచ్చాయి. నిర్మాణానికి సంబంధించిన కాంట్రాక్టర్ల పేమెంట్లలో కూడా 40 శాతం వరకు కమిషన్లు వసూలు చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఇదంతా చంపత్ రాయ్ కనుసన్నల్లోనే జరిగిందని, ఆయన బంధువు ఒకరు ఈ అక్రమాల్లో కీలకంగా వ్యవహరించారని విమర్శలున్నాయి.
మౌనంగా ఉన్న అధికార యంత్రాంగం
కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ట్రస్టులో 15 మంది సభ్యులు ఉన్నారు. ఇందులో నిపేంద్ర మిశ్రా, అనిల్ మిశ్రా, జ్ఞానేష్ కుమార్ వంటి వారు ఉన్నారు. వీరి పర్యవేక్షణలో ఇంత భారీ అవినీతి జరుగుతున్నా ఎవరూ స్పందించలేదు. సమాజ్ వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్, అరవింద్ కేజ్రీవాల్ వంటి వారు నిధుల దుర్వినియోగంపై ఫిర్యాదులు చేసినా ఫలితం లేకుండా పోయింది. ఇంటెలిజెన్స్ నివేదికలు ఉన్నా ప్రభుత్వం స్పందించక పోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది.
ప్రశ్నలకు దొరకని సమాధానం
దర్యాప్తు జరుగుతోందని చెబుతున్నప్పటికీ ప్రధాన దోషులపై చర్యలు లేవు. కేవలం చిన్నస్థాయి సిబ్బందిని అరెస్టు చేసి చంపత్ రాయ్, అనిల్ మిశ్రాల రాజీనామాలతో వ్యవహారాన్ని ముగించే ప్రయత్నం చేశారు. అయోధ్య రామమందిరం అంటే భక్తుల నమ్మకానికి చిహ్నం. కానీ ఇక్కడ జరిగిన వ్యవహారం కేవలం నిధుల చోరీ మాత్రమే కాదు, కోట్లాది మంది భక్తుల నమ్మకాన్ని కాజేసిన ద్రోహం. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఇప్పుడు దేశవ్యాప్తంగా డిమాండ్ పెరుగుతోంది.