ఓట్లపై వేటు… 16 కోట్ల మంది ఔట్ – మాజీ ఎన్నికల కమిషనర్ లావాసా విమర్శ

Ex Election Commissioner Lavasa
  • ఢిల్లీలో మేధావులు, మాజీ అధికారుల ఫైర్
  • ఓటర్ల జాబితాలో భారీ కుంభకోణం
  • అర్హులైన వారికీ ఓట్ల గండం ఉందని ఆరోపణ
  • పారదర్శకతకు తూట్లు పొడిచిన ఈసీఐ

సహనం వందే, న్యూఢిల్లీ:

దేశ ప్రజాస్వామ్య వ్యవస్థకు గుండెకాయ వంటి ఓటర్ల జాబితా ఇప్పుడు ఒక పెద్ద కుంభకోణానికి నిలయంగా మారింది. ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక సవరణ ప్రక్రియలో ఏకంగా 16 కోట్ల మంది ఓటర్ల పేర్లు గాలిలో కలిసిపోయాయి. ఈ భారీ తొలగింపు వెనుక ఉన్న అసలు కారణం ఏమిటి? 16 కోట్ల మంది ఓటర్లు ఎలా అదృశ్యమయ్యారు? ఇంతటి ఘోర వైఫల్యానికి బాధ్యత ఎవరిది? ఇవే ప్రశ్నలు ఇప్పుడు దేశవ్యాప్తంగా రాజకీయ సంచలనం రేపుతున్నాయి.

దేశ ప్రజాస్వామ్య మూలాలను కదిలించేలా… ఢిల్లీలోని కాన్ స్టిట్యూషన్ క్లబ్ ఆఫ్ ఇండియాలో శనివారం కీలక సమావేశం జరిగింది. కాన్ స్టిట్యూషనల్ కండక్ట్ గ్రూప్, గ్రూప్ ఆన్ ఫెడరలిజం అండ్ ఎలక్షన్స్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కన్ క్లేవ్… దేశ రాజకీయ ముఖచిత్రాన్ని మార్చే అంశాలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఒకేసారి ఎన్నికలు, పౌరసత్వ సవరణలు, ఎన్నికల సంఘం పనితీరుపై సమావేశంలో మాజీ బ్యూరోక్రాట్లు, న్యాయమూర్తులు, రచయితలు, పౌర సమాజ ప్రతినిధులు పాల్గొన్నారు.

పారదర్శకతకు పాతర వేసిన ఈసీఐ
మాజీ ఎన్నికల కమిషనర్ అశోక్ లావాసా ఎన్నికల సంఘం తీరుపై నిప్పులు చెరిగారు. 16 కోట్ల మంది ఓటర్లను జాబితా నుండి తొలగించినా… అంతమందిని ఎందుకు తొలగించారో చెప్పే డేటా మాత్రం బయటకు రావడం లేదని ఆయన విమర్శించారు. కేవలం వలసల సాకు చూపి తప్పించుకుంటున్న ఎన్నికల సంఘం… అసలు ఎంతమంది అనర్హులను గుర్తించిందో స్పష్టమైన సమాచారం ఇవ్వడం లేదని ఆయన నిలదీశారు. పారదర్శకతను గాలికి వదిలేసి రహస్యంగా ఓటర్ల పేర్లు తొలగించడం ప్రజాస్వామ్యానికి పెద్ద ముప్పుగా ఆయన అభివర్ణించారు.

Conclave on One Nation - One Election

ఆర్మీ కల్నల్ భార్యకే దిక్కు లేదు
వ్యవస్థ ఎంతటి వైఫల్యానికి చేరిందో చెప్పడానికి ఒక ఆర్మీ కల్నల్ ఉదంతమే నిదర్శనం. కనీసం దేశం కోసం పనిచేసే సైనికుడి కుటుంబానికి కూడా ఓటరు జాబితాలో రక్షణ లేదని లావాసా ఎద్దేవా చేశారు. కల్నల్ భార్య పేరు జాబితా నుంచి మాయం కావడమే వ్యవస్థ నిర్వీర్యమైందని చెప్పడానికి చాలదా? కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు సామాన్యుల నుంచి ఉన్నతాధికారుల వరకు తమ ఓటు హక్కుపై ప్రతి ఒక్కరికీ భయం పట్టుకుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

పారదర్శకతకు పాతర వేస్తున్న ఈసీఐ
ఎన్నికల సంఘంపై ప్రజలకు నమ్మకం పోయిందని మాజీ న్యాయమూర్తులు స్పష్టం చేశారు. ఎన్నికల సమయంలో పారదర్శకత పాటించడంలో ఈసీఐ విఫలమైందని వారు ఆరోపించారు. ఫారం 17సి, సీసీటీవీ ఫుటేజీ, ప్రిసైడింగ్ అధికారుల డైరీలు వంటి కీలక రికార్డులను పబ్లిక్ డొమైన్ లో పెట్టాలని డిమాండ్ చేసినా ఈసీఐ వాటిని బయట పెట్టడానికి నిరాకరిస్తోందని వారు పేర్కొన్నారు. ఓటు ప్రాథమిక హక్కు అని, దానిని కాపాడటంలో ఈసీఐ బాధ్యతారహితంగా వ్యవహరిస్తోందని వారు విమర్శించారు.

ప్రజాస్వామ్యానికి పెను ముప్పు
ఓటు హక్కు అనేది రాజ్యాంగం ఇచ్చిన ప్రాథమిక హక్కు. అటువంటి హక్కును అడ్డగోలుగా తొలగిస్తూ వివరణ కూడా ఇవ్వకుండా ఎన్నికల సంఘం వ్యవహరిస్తున్న తీరు దేశ భవిష్యత్తును ప్రమాదంలోకి నెడుతోంది. ఇప్పటికైనా ఎన్నికల సంఘం కళ్ళు తెరిచి ఈ 16 కోట్ల ఓట్ల తొలగింపుపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ప్రజాస్వామ్యంపై ప్రజలకు ఉన్న చివరి నమ్మకం కూడా తుడిచిపెట్టుకుపోవడం ఖాయం.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *