- దేశవ్యాప్తంగా బలపడుతున్న కాషాయదళం
- పార్లమెంటులో సొంత బలం కోసం అరాటం
- డీలిమిటేషన్ వేట మొదలు… బీజేపీ వ్యూహం
సహనం వందే, అమరావతి:
ఎన్డీయేలో అతిపెద్ద భాగస్వామిగా ఉన్న తెలుగుదేశం పార్టీ పట్టు ఇక తగ్గుతుందా? ప్రాంతీయ పార్టీలను వరుసగా చీలుస్తూ కేంద్రంలో బీజేపీ తన ఆధిపత్యాన్ని మరింత పెంచుకుంటోంది. లోక్‌సభలో 240 స్థానాలతో సొంత మెజారిటీకి దూరంగా ఉన్న కాషాయ దళం… ఇప్పుడు ఇతర పార్టీల నుంచి వస్తున్న అసమ్మతి ఎంపీలతో 319 స్థానాలకు చేరింది. ఇదే ఇప్పుడు దేశ రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేపింది.
మారుతున్న బలాబలాలు
లోక్‌సభ ఎన్నికల్లో 240 స్థానాలతో సరిపెట్టుకున్న బీజేపీకి ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి 272 స్థానాల మద్దతు అవసరమైంది. చంద్రబాబు నాయకత్వంలోని తెలుగుదేశం పార్టీ 16 మంది ఎంపీలతో ఎన్డీయేలో అతిపెద్ద భాగస్వామిగా నిలిచింది. కానీ ఇప్పుడు సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. తృణమూల్ కాంగ్రెస్‌కు చెందిన 20 మంది ఎంపీలు నేషనల్ సిటిజన్స్ పార్టీ ఆఫ్ ఇండియాలో చేరి ఎన్డీయేకు మద్దతు ప్రకటించారు. దీనితో ఇప్పుడు ఎన్‌సీపీ ఎన్డీయేలో అతిపెద్ద భాగస్వామిగా అవతరించింది. దీంతో తెలుగుదేశం పార్టీ పరిస్థితి రెండో స్థానంలోకి పోయింది.
శివసేన వర్గపోరు ప్రభావం…
శివసేనలో కూడా కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ఏక్‌నాథ్ షిండే వర్గానికి 7 స్థానాలు ఉండగా… తాజాగా ఉద్ధవ్ వర్గానికి చెందిన 6 మంది ఎంపీలు షిండే గూటికి చేరారు. దీనితో షిండే శివసేన బలం 13కు పెరిగింది. ఇది జేడీయూ ఎంపీల సంఖ్య కంటే ఎక్కువ కావడంతో లోక్‌సభలో నితీష్ కుమార్ పార్టీ నాలుగో స్థానానికి పరిమితమైంది. మరోవైపు చిరాగ్ పాశ్వాన్ లోక్ జనశక్తి పార్టీకి 5 మంది ఎంపీలు మద్దతుగా ఉన్నారు.
డీలిమిటేషన్ వైపు అడుగులు
ప్రస్తుతం లోక్‌సభలో ఎన్డీయేకు 319 మంది సభ్యుల మద్దతు ఉంది. రాజ్యాంగ సవరణలకు అవసరమైన 362 మార్కుకు బీజేపీ చేరువవుతోంది. అసోం, పశ్చిమ బెంగాల్, మేఘాలయలోని 3 ఖాళీ స్థానాలను గెలుచుకుంటే ఆ సంఖ్య పెరుగుతుంది. డీఎంకే ఎంపీలను ఓటింగ్‌కు దూరంగా ఉంచడం ద్వారా కూడా బీజేపీ తన లక్ష్యాన్ని చేరుకోవాలని చూస్తోంది. రాజ్యసభలో కూడా ఎన్డీయే 149 మంది ఎంపీలతో మెజారిటీకి చేరువలో ఉంది.
ప్రాంతీయ పార్టీల బలహీనత
రాజ్యసభలో బీజేడీ ఎంపీ దేబాశిష్ సాంతరాయ్ రాజీనామా, బీజేపీ విజయం పరిస్థితులను మార్చేశాయి. త్వరలో జరగబోయే ఎన్నికలతో రాజ్యసభలో ఎన్డీయే బలం మరింత పెరగనుంది. టీఎంసీలో అసమ్మతి పెరిగి ఆ పార్టీ ఎంపీల సంఖ్య 10కి పడిపోయింది. వైఎస్సార్ కాంగ్రెస్ 7, బీజేడీ 6, ఆమ్ ఆద్మీ పార్టీ 3, బీఆర్ఎస్ 3, బీఎస్పీ 1 స్థానాలతో స్వతంత్రంగా ఉన్నాయి. వీటిని కూడా తమ వైపు తిప్పుకునేందుకు బీజేపీ పావులు కదుపుతోంది.
బీజేపీ లక్ష్యం ఆ రెండు
డీలిమిటేషన్ ప్రక్రియను పూర్తి చేసి ఉత్తరాది రాష్ట్రాల్లో తన పట్టును మరింత పెంచుకోవాలని బీజేపీ భావిస్తోంది. మహిళా రిజర్వేషన్ల బిల్లుకు డీలిమిటేషన్‌ను జోడించి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తోంది. హిందీ రాష్ట్రాల్లో మెజారిటీ సీట్లు పెరిగితే బీజేపీకి తిరుగుండదు. గతంలో 298 ఓట్లతో వీగిపోయిన రాజ్యాంగ సవరణ బిల్లును ఇప్పుడు 352 ఓట్ల మ్యాజిక్ ఫిగర్‌తో ఆమోదింపజేయాలనేది బీజేపీ వ్యూహం.
కాంగ్రెస్ ఆరోపణలు
బీజేపీ తీరుపై కాంగ్రెస్ తీవ్ర స్థాయిలో మండిపడుతోంది. రాజ్యాంగ సవరణల ద్వారా రిజర్వేషన్లను రద్దు చేయడమే బీజేపీ అంతిమ లక్ష్యమని జైరామ్ రమేష్ ఆరోపించారు. ప్రభుత్వం దీర్ఘకాలిక ప్రణాళికతో ముందుకు సాగుతోందని ఆయన పేర్కొన్నారు. ప్రాంతీయ పార్టీల ఎంపీలను తమలో కలుపుకోకుండా అసమ్మతి వర్గాలను వాడుకోవడం ద్వారా ప్రతిపక్ష పాత్రను కూడా తామే పోషించాలని బీజేపీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోందని విశ్లేషకులు చెబుతున్నారు.