- కాలేజీల ఎంబీబీఎస్ ఫీజుల దోపిడీపై ధర్నా
- నాలుగున్నర ఏళ్ల కోర్సు…ఐదేళ్ల ఫీజు వసూలు
- విద్యార్థులకు 12 లక్షల అదనపు భారం
- నిబంధనలు గాలికి వదిలేసి ఇంటర్న్‌షిప్ బ్రేక్
సహనం వందే, కరీంనగర్:
కరీంనగర్లో వైద్య విద్యార్థుల తల్లిదండ్రులు రోడ్డెక్కారు. ప్రతిమ, చల్మెడ ఆనందరావు వైద్య కళాశాలలు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నాయని వారు మండిపడుతున్నారు. ప్రభుత్వ నిబంధనలను కాలరాస్తూ నాలుగున్నర సంవత్సరాల ఎంబీబీఎస్ కోర్సుకు ఐదేళ్ల ఫీజులు వసూలు చేస్తున్నారని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. దీనిపై ప్రశ్నిస్తే కాలేజీ యాజమాన్యాలు మొండిగా సమాధానం ఇస్తుండటంతో గందరగోళం నెలకొంది.
అక్రమ ఫీజుల వసూళ్ల పర్వం
కరీంనగర్‌లోని ప్రతిమ, చల్మెడ ఆనందరావు వైద్య కళాశాలల తీరుపై తల్లిదండ్రుల కమిటీ పోరాటం చేస్తోంది. విద్యార్థుల నుంచి ప్రభుత్వం నిర్ణయించిన దానికంటే ఒక్కొక్కరి వద్ద 12 లక్షల రూపాయలు అదనంగా వసూలు చేస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. ఈ దోపిడీపై తల్లిదండ్రులు చాలా రోజుల నుంచి కాలేజీ, యూనివర్సిటీ చుట్టూ తిరుగుతున్నా ఫలితం లేకుండా పోయింది. దీంతో విసిగిపోయిన తల్లిదండ్రులు సోమవారం కరీంనగర్ లో ఆయా కాలేజీల వద్ద ధర్నా నిర్వహించారు.

జీవోను తుంగలో తొక్కి
తల్లిదండ్రులు నేరుగా హైదరాబాద్‌లో మెడికల్ ఫీజు రెగ్యులేటరీ కమిటీ చైర్మన్ గోపాల్‌రెడ్డిని కలిశారు. నిబంధనల ప్రకారం 13 లక్షల రూపాయల కేటగిరీలో ఉన్న కళాశాలలు నాలుగున్నర సంవత్సరాలకే ఫీజు తీసుకోవాలి. ఒకవేళ ఐదు సంవత్సరాల ఇన్స్టాల్మెంట్లుగా విభజిస్తే, ప్రతి సంవత్సరం 11 లక్షల 70 వేల రూపాయలు మాత్రమే వసూలు చేయాలని జీవో స్పష్టం చేస్తోంది. కానీ కళాశాలలు ఈ నిబంధనను ఏమాత్రం పట్టించుకోవడం లేదు.
బీ కేటగిరీ విద్యార్థులపై భారం
నిబంధనలు పాటించకుండా యాజమాన్యాలు ఇష్టం వచ్చినట్లు ఫీజులు వసూలు చేస్తున్నాయి. ఇలాంటి తీరు వల్ల బీ కేటగిరీ విద్యార్థులకు అదనంగా 6 లక్షల 50 వేల రూపాయల భారం పడుతోంది. సీ కేటగిరీ విద్యార్థుల పరిస్థితి మరింత దారుణంగా ఉంది. వారిపై ప్రతి ఏటా 13 లక్షల రూపాయల అదనపు భారం పడుతోందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇంటర్న్‌షిప్‌ల నిలుపుదల
ఫీజుల విషయంలో ప్రశ్నించినందుకు యాజమాన్యాలు విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. ఫీజులు చెల్లించలేదనే నెపంతో వారం రోజులుగా విద్యార్థుల ఇంటర్న్‌షిప్‌లను నిలిపివేశారు. కమిటీ చైర్మన్ జోక్యం చేసుకుని విద్యార్థులను అనుమతించాలని కోరినా కాలేజీ యాజమాన్యాలు ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. భవిష్యత్తు దెబ్బతింటుందనే భయం విద్యార్థుల్లో కనిపిస్తోంది.
హాల్ టికెట్ల కోసం వేధింపులు
గతంలో పరీక్షలకు ముందు బ్యాలెన్స్ మొత్తాన్ని చెల్లిస్తేనే హాల్ టికెట్ ఇస్తామని కాలేజీలు షరతులు పెట్టాయి. ఆ సమయంలో తప్పనిసరి పరిస్థితుల్లో తల్లిదండ్రులు ఆ మొత్తాన్ని చెల్లించాల్సి వచ్చింది. కానీ ఇప్పుడు ఐదో సంవత్సరం పేరుతో మళ్ళీ 13 లక్షల రూపాయలు కడితేనే క్లాసులకు రానిస్తామని బెదిరిస్తున్నారు. ప్రభుత్వ నిబంధనలకు కట్టుబడి ఉండాల్సిన వైద్య విద్యాసంస్థలు వ్యాపార కేంద్రాలుగా మారడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.
ప్రభుత్వం స్పందించాలి
ప్రభుత్వం విడుదల చేసిన జీవోను కాలేజీలు తుంగలో తొక్కినా అధికారులు ఎందుకు మౌనంగా ఉన్నారనేది ప్రశ్నార్థకంగా మారింది. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని తక్షణమే ఉన్నతాధికారులు స్పందించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. దోపిడీకి పాల్పడుతున్న ప్రతిమ, చల్మెడ ఆనందరావు వైద్య కళాశాలలపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.