- పతనమవుతున్న ఇతర దేశాల నోట్లు
- కుప్పకూలిన అంతర్జాతీయ మార్కెట్లు
- అమెరికాపై నమ్మకం… పెట్టుబడుల మళ్లింపు
- యుద్ధ ప్రభావం అగ్రరాజ్యంపై ఉండదన్న ట్రస్ట్
సహనం వందే, హైదరాబాద్:
ఇరాన్ యుద్ధం కారణంగా ప్రపంచ మార్కెట్లు అతలాకుతలం అవుతుంటే, అమెరికా డాలర్ మాత్రం తన విశ్వరూపాన్ని చూపిస్తోంది. ఇన్వెస్టర్లు సురక్షితమైన పెట్టుబడిగా డాలర్‌ను భావించి పరుగులు తీస్తుండటంతో అగ్రరాజ్యం కరెన్సీ ఆకాశమే హద్దుగా దూసుకుపోతోంది. ఆపద కాలంలో ఆదుకుంటాయనుకున్న ఇతర సురక్షిత పెట్టుబడులన్నీ నీరుగారిపోయాయి. ఈ వికృత ఆర్థిక అసమతుల్యత ఇప్పుడు అగ్రరాజ్యం ఆధిపత్యానికి తిరుగులేని ఆయుధంగా మారింది.
డాలర్ ఎందుకు పెరుగుతుంది?
యుద్ధం వచ్చినప్పుడు ప్రపంచవ్యాప్తంగా వ్యాపారాలు దెబ్బతింటాయనే భయం ఉంటుంది. ఇలాంటి సమయంలో పెట్టుబడిదారులు తమ డబ్బును నష్టపోకుండా ఉండాలని భావిస్తారు. దీన్నే ‘సేఫ్ హెవెన్’ అంటారు. అంటే తుఫాను వచ్చినప్పుడు సురక్షితమైన గూటికి చేరినట్లుగా ఇన్వెస్టర్లు తమ దగ్గర ఉన్న ఇతర కరెన్సీలను అమ్మి డాలర్లను కొంటారు. ప్రస్తుతం ప్రపంచం నమ్మే ఏకైక సురక్షిత గూడు డాలర్ మాత్రమే.

అమెరికాపై అంత నమ్మకం ఏంటి?
ప్రపంచంలో అత్యధిక వాణిజ్యం డాలర్లలోనే జరుగుతుంది. యుద్ధం వల్ల చమురు ధరలు పెరిగితే ఆ చమురు కొనడానికి కూడా దేశాలకు డాలర్లు కావాలి. అమెరికా ఆర్థిక వ్యవస్థ చాలా పెద్దది, స్థిరమైనది. యుద్ధం ఎక్కడ జరిగినా అమెరికాకు నేరుగా నష్టం జరగదనే నమ్మకం అందరిలో ఉంటుంది. అందుకే మిగిలిన దేశాల కరెన్సీలు కుప్పకూలుతున్నా అమెరికా డాలర్ విలువ మాత్రం రోజురోజుకూ ఆకాశాన్ని తాకుతోంది.
రూపాయికి సెగ…
అమెరికా డాలర్ విలువ పెరగడం వల్ల భారత రూపాయిపై తీవ్ర ఒత్తిడి పెరుగుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ పడిపోవడం వల్ల దిగుమతులు ఖరీదైనవిగా మారతాయి. ముఖ్యంగా ముడి చమురు ధరలు పెరిగి సామాన్యులపై భార పడుతుంది. యుద్ధం వల్ల భారత్ వంటి దేశాలు ఆర్థికంగా భారీ మూల్యం చెల్లించాల్సి వస్తోంది. ఇది ద్రవ్యోల్బణానికి దారితీసే ప్రమాదం ఉంది.
పెట్టుబడుల పలాయనం
యుద్ధ భయంతో విదేశీ ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను ఉపసంహరించుకుంటున్నారు. ఆసియా మార్కెట్ల నుంచి నిధులు భారీగా తరలిపోతున్నాయి. సురక్షితమైన డాలర్ బాండ్లు, అమెరికా ఆస్తుల కొనుగోలుకు అందరూ పోటీ పడుతున్నారు. దీనివల్ల స్థానిక మార్కెట్లు కుప్పకూలిపోతున్నాయి. యుద్ధం కేవలం సరిహద్దులకే పరిమితం కాకుండా అందరి జేబులను దెబ్బతీస్తోంది.
అమెరికా ఆర్థిక వ్యవస్థకు బలం
ఈ సంక్షోభం అమెరికా ఆర్థిక వ్యవస్థకు బలాన్ని ఇస్తోంది. ప్రపంచ వాణిజ్యం మొత్తం డాలర్ చుట్టూ తిరగడం అమెరికాకు కలిసొస్తోంది. యుద్ధం వల్ల చమురు సరఫరా దెబ్బతినడం కూడా డాలర్ వృద్ధికి కారణమైంది. ఇతర దేశాలు తమ కరెన్సీని కాపాడుకోవడానికి నానా తంటాలు పడుతున్నాయి. ఆర్థిక విశ్లేషకులు దీనిని ఒక ప్రమాదకరమైన ధోరణిగా అభివర్ణిస్తున్నారు.
ముగింపు లేని సంక్షోభం
ఇరాన్ యుద్ధం ఎంతకాలం సాగితే అంతకాలం ఈ అనిశ్చితి కొనసాగుతుంది. డాలర్ జోరుకు అడ్డుకట్ట వేయడం ప్రస్తుత పరిస్థితుల్లో అసాధ్యంగా కనిపిస్తోంది. చిన్న దేశాల ఆర్థిక వ్యవస్థలు దివాళా తీసే స్థితికి చేరుకున్నాయి. ప్రపంచ దేశాలు కలిసికట్టుగా నిర్ణయం తీసుకోకపోతే ఈ ఆర్థిక అసమానతలు మరింత పెరుగుతాయి. యుద్ధం ఆగిపోతేనే ప్రపంచానికి శాంతి, ఆర్థిక స్థిరత్వం లభిస్తాయి.
బొల్లోజు రవి, సీనియర్ జర్నలిస్ట్