20 మంది డిస్మిస్… 332 మంది సస్పెండ్ – అవినీతిపై రాజస్థాన్ సర్కార్ సమరశంఖం

Rajasthan Governement
  • అధికారుల ముడుపులపై ఉక్కుపాదం
  • రిటైర్డ్ అవినీతి అధికారుల పెన్షన్ల నిలిపివేత
  • ప్రజలను రాచిరంపాన పెడుతున్న ఉద్యోగులు
  • నేరుగా రంగంలోకి దిగిన సీఎం కార్యాలయం

సహనం వందే, రాజస్థాన్:

రాజస్థాన్‌లో ప్రభుత్వ యంత్రాంగం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అవినీతిపై సర్కారు కత్తులు దూసింది. క్లర్కుల నుంచి ఉన్నతాధికారుల వరకు అక్రమాలకు పాల్పడితే ఇక సహించేది లేదని ముఖ్యమంత్రి కార్యాలయం స్పష్టం చేసింది. వ్యవస్థను నిలువునా మార్చే దిశగా చేపట్టిన ఈ కఠిన చర్యలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతున్నాయి.

20 మంది అధికారుల డిస్మిస్…
అవినీతిని ఏమాత్రం ఉపేక్షించకూడదని నిర్ణయించుకున్న రాజస్థాన్ ప్రభుత్వం ఏకంగా 20 మంది అధికారులను సర్వీసుల నుంచి తొలగించింది. వీరు తమ వృత్తి ధర్మానికి పూర్తిగా ద్రోహం చేశారని సర్కారు భావిస్తోంది. తప్పు చేసిన వారికి సర్వీసులో ఉండే అర్హత లేదని భావించి ఈ కఠిన శిక్ష విధించింది. ఇది ప్రభుత్వ ఉద్యోగుల్లో భయాందోళనలు రేకెత్తిస్తోంది.

Rajasthan Government Suspensions

సస్పెన్షన్లతో వణికిన శాఖలు
మరో 332 మంది అధికారులపై సస్పెన్షన్ వేటు పడింది. క్లాస్ ఒకటి నుంచి క్లాస్ నాలుగు వరకు ఉన్న సిబ్బంది ఈ జాబితాలో ఉన్నారు. కింది స్థాయి క్లర్క్ నుంచి తహసీల్దారు స్థాయి వరకు అందరికీ ఈ హెచ్చరిక వెళ్ళింది. తాము ఎవరికీ జవాబుదారీ కామనుకున్న వారికి ఈ నిర్ణయం పెద్ద షాక్ ఇచ్చింది. వ్యవస్థలో అకౌంటబిలిటీ పెంచేలా ఈ చర్యలు ఉన్నాయి.

17 మంది పెన్షన్ల నిలిపివేత…
పదవీ విరమణ చేసిన అధికారులకు సైతం ప్రభుత్వం షాక్ ఇచ్చింది. అవినీతికి పాల్పడి ఆస్తులు కూడబెట్టిన 17 మంది అధికారుల పెన్షన్లను ప్రభుత్వం నిలిపివేసింది. రిటైర్ అయ్యాక కూడా అవినీతి చేసిన వారు తప్పించుకోలేరని సర్కారు నిరూపించింది. ప్రజల సొమ్ముతో విలాసాలు అనుభవించిన వారికి ప్రభుత్వ ఖజానా నుండి రూపాయి కూడా వెళ్లకూడదని ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది.

అవినీతిపైనే ప్రధాన ఆరోపణలు
ప్రభుత్వ పథకాలను అర్హులకు చేరనీయకుండా మధ్యవర్తులతో కుమ్మక్కు అవ్వడం, ఫైళ్లను అనవసరంగా నెలల తరబడి పెండింగ్‌లో ఉంచడం వీరిపై ఉన్న ప్రధాన ఆరోపణలు. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను బుట్టదాఖలు చేయడం కూడా వీరి నిర్లక్ష్యానికి నిదర్శనం. లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయిన వారు కూడా ఈ చర్యల జాబితాలో ఉన్నారు.

పరిపాలనపై సవాళ్లు
ఒకేసారి ఇంతమందిని సస్పెండ్ చేయడం వల్ల పరిపాలనా విభాగంలో సిబ్బంది కొరత ఏర్పడే అవకాశం ఉంది. అధికారులు భయంతో పని ఆపేసే పరిస్థితి రాకూడదని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. నిర్ణయాలు తీసుకోవడం వేగవంతం అవ్వాలి కానీ ఆగిపోకూడదు. ప్రభుత్వం దీనికి ప్రత్యామ్నాయంగా మరిన్ని కొత్త నియామకాలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.

పారదర్శకత వైపు అడుగులు
ప్రభుత్వ కార్యాలయాల్లో సీసీటీవీల పర్యవేక్షణ, ఈ ఆఫీస్ విధానం పెరిగితేనే అవినీతి తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. మనుషుల ప్రమేయం తగ్గితే ఇలాంటి కఠిన నిర్ణయాల అవసరం ఉండదు. పాత పద్ధతులు ఇకపై నడవవని సర్కారు స్పష్టం చేస్తోంది. ప్రజల నమ్మకాన్ని గెలవాలంటే ఇలాంటి కఠినమైన అడుగులు పారదర్శక విధానాలతో తోడవ్వాలని అందరూ భావిస్తున్నారు.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *