అవినీతి టాపర్లు – వందల కోట్ల లంచాలు… అక్రమాస్తుల కోటలు

Corruption Officers in Telangana
  • తెలంగాణలో ఏసీబీ వలలో తిమింగలాలు
  • సామాన్యుడిని పీడిస్తున్న దందా రాయుళ్లు
  • దర్యాప్తులో విస్తుగొల్పే నిజాలు

సహనం వందే, హైదరాబాద్:

తెలంగాణలో ప్రభుత్వ అధికారుల అవినీతి కొత్త పుంతలు తొక్కుతోంది. ఒకప్పుడు వేలు, లక్షల కోసం కక్కుర్తి పడ్డ అధికారులు ఇప్పుడు వందల కోట్ల ఆస్తులను కూడబెడుతూ అడ్డంగా దొరికిపోతున్నారు. ప్రజల సొమ్ముతో విలాసాలు అనుభవిస్తూ అవినీతిలో టాపర్లుగా నిలుస్తున్న ఈ బడా అధికారుల బండారం ఒక్కొక్కటిగా బయటపడుతోంది. ఏసీబీ దాడుల్లో బయటపడుతున్న అక్రమాస్తుల లెక్కలు చూస్తుంటే సామాన్యుడికి మైండ్ బ్లాక్ అవ్వక తప్పదు.

హెచ్ఎండీఏ చీఫ్ ఇంజనీర్ భారీ సంపాదన
హెచ్ఎండీఏ చీఫ్ ఇంజనీర్ రవీందర్ అవినీతి ఉదంతం వ్యవస్థలోని కుళ్ళను బయటపెట్టింది. బాధ్యతలు చేపట్టిన ఏడాదిలోనే రవీందర్ ఏకంగా 100 కోట్ల ఆస్తులు కూడబెట్టాడు. ఇతని ఇంట్లో సోదాల్లో 45 లక్షల నగదు, కిలోన్నర బంగారం, 12.5 కిలోల వెండి బయటపడ్డాయి. వీటితో పాటు శంషాబాద్, కృష్ణాపూర్, పసుమాములలో ప్లాట్లు, నార్సింగి, నానక్‌రామ్‌గూడలో 4 ఫ్లాట్లు, గూడూరులో 4 ఎకరాల భూమి, మోకిలాలో విల్లా, కొండాపూర్‌లో 4 అంతస్తుల వాణిజ్య భవనం ఉన్నట్లు తేలింది. వీటి మార్కెట్ విలువ 100 కోట్ల పైమాటే అని అధికారులు అంచనా వేస్తున్నారు.

అధికారంతో సాగించిన అక్రమ దందా
రవీందర్ ఎలివేటెడ్ కారిడార్ల టెండర్లు, ఔటర్ రింగ్ రోడ్డు లీజు వ్యవహారాలను తన అవినీతికి మార్గంగా మార్చుకున్నాడు. రిజిస్ట్రేషన్ విలువ ప్రకారమే ఇతని ఆస్తులు 9.24 కోట్లుగా ఉన్నాయని ఏసీబీ ప్రకటించింది. ప్రస్తుతం ఇతడిని జ్యుడిషియల్ కస్టడీకి తరలించారు. అక్రమ ఆస్తులు, బినామీ లావాదేవీలపై దర్యాప్తు కొనసాగుతోంది.

పోలీస్ అధికారి అక్రమ సామ్రాజ్యం
తెలంగాణ పోలీస్ కంప్యూటర్ సర్వీసెస్ డీఎస్పీ సంకిరెడ్డి భీంరెడ్డి అవినీతి లెక్కలు అంతకుమించి ఉన్నాయి. తెలంగాణ, కర్ణాటకలో 16 చోట్ల సోదాలు చేయగా ఇతని అక్రమ ఆస్తులు బయటపడ్డాయి. 44 ఎకరాల వ్యవసాయ భూమి, బెంగళూరులో కమర్షియల్ స్థలాలు, కిలోల కొద్దీ బంగారం, వెండి ఏసీబీకి దొరికాయి. ఇతడు రాసిన డైరీ ఆధారంగా ఇతని అక్రమ సంపాదన 300 కోట్లు ఉంటుందని తేల్చారు. ఈ భారీ అవినీతి కారణంగా ఇతడిని ప్రభుత్వం సస్పెండ్ చేసింది.

ఎక్సైజ్ అధికారి అక్రమార్జన
నిజామాబాద్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ కొమ్మూరి మల్లారెడ్డి గత జూన్‌లో ఏసీబీకి దొరికిపోయాడు. 11 ప్రాంతాల్లో సోదాలు చేయగా కోట్ల విలువైన స్థిర, చరాస్తులను గుర్తించారు. ఇందులో 4 నివాస గృహాలు, ఒక కమర్షియల్ బిల్డింగ్, 8 ఓపెన్ ప్లాట్లు, 10.23 ఎకరాల వ్యవసాయ భూములు ఉన్నాయి. ఇవి కాకుండా ఇంట్లో 3.31 లక్షల నగదు, బ్యాంకుల్లో 50 లక్షలు, ఒక ఎస్‌యూవీ కారు, స్కూటర్ స్వాధీనం చేసుకున్నారు.

దర్యాప్తులో కొనసాగుతున్న బినామీల వేట
అవినీతి అధికారుల బంధువులు, సహచరుల ఇళ్లలో కూడా దాడులు నిర్వహించి ఆస్తులను ఏసీబీ గుర్తించింది. బినామీ పేర్లతో దాచిన ఆస్తులను పట్టుకునేందుకు దర్యాప్తును వేగవంతం చేశారు. గత నెల రోజుల్లో ఏసీబీకి దొరికిన ఈ అవినీతి తిమింగలాలు వ్యవస్థలో పాతుకుపోయిన వేర్లను తెలియజేస్తున్నాయి. ప్రతి అక్రమ లావాదేవీని కూలంకషంగా విశ్లేషిస్తున్న ఏసీబీ నిందితులను శిక్షించేందుకు సిద్ధమవుతోంది.

వ్యవస్థలో పెరిగిన అవినీతి..‌.
ప్రభుత్వ బాధ్యతలను నిర్వహించాల్సిన వారే ప్రజా ధనాన్ని దోచుకోవడం ఆందోళన కలిగిస్తోంది. ఒకప్పుడు చిన్న మొత్తాలతో దొరికిన అధికారులు, ఇప్పుడు వందల కోట్లతో పట్టుబడుతున్నారు. ఈ వరుస దాడులు అవినీతి అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాయి. ఏసీబీ పట్టుబిగిస్తున్న కొద్దీ బయటపడని మరిన్ని అవినీతి పీఠాలు బయటపడే అవకాశం ఉంది.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *