బం’ఘోరం’ – డబ్బు కోసం బంగారం అమ్మేస్తున్నారు

Gold Rates
  • ఇంకా ధరలు పడిపోతాయన్న భయం
  • 6 లక్షల కోట్ల రూపాయల విలువైన గోల్డ్ సేల్
  • బయటకు బంగారం… నగదు వైపు మొగ్గు
  • ఈ పరిస్థితి దేశ ఆర్థిక రంగానికి లాభమేనా?

సహనం వందే, హైదరాబాద్:

భారతీయులకు బంగారం అంటే ఒక పవిత్రమైన ఆస్తి. కష్టకాలంలో కూడా అమ్మని ఈ పసిడి ఇప్పుడు మార్కెట్‌లోకి వరదలా వస్తోంది. ధరల పతనం సామాన్యులను భయాందోళనకు గురిచేస్తోంది. బీరువాల్లో దాచుకున్న సంపద కరిగి నగదుగా మారుతోంది. ఇది కేవలం అమ్మకం కాదు… దేశ ఆర్థిక వ్యవస్థలో వస్తున్న భారీ మార్పుకు నిదర్శనం.

పడిపోతున్న పసిడి విలువ
బంగారం ధరలు రికార్డు స్థాయి నుండి వేగంగా దిగజారుతున్నాయి. పది గ్రాముల ధర 1.40 లక్షల రూపాయల నుండి 1.20 లక్షల రూపాయలకు పడిపోవచ్చన్న ఆందోళన ప్రజల్లో ఉంది. ధరలు మరింత తగ్గేలోపే పాత బంగారాన్ని వదిలించుకోవాలని జనం నిర్ణయించుకున్నారు. బంగారాన్ని అలంకారంగా చూడటం మానేసి దానిని ఒక ఆర్థిక సాధనంగా మాత్రమే చూస్తున్నారు.

రికార్డు స్థాయి అమ్మకాలు
భారతీయ బులియన్ అండ్ జువెలర్స్ అసోసియేషన్ డేటా ప్రకంపనలు రేపుతోంది. ఏప్రిల్ నుండి జూన్ మధ్య కాలంలో ఏకంగా 50 టన్నుల పాత బంగారం మార్కెట్లోకి వచ్చింది. గతేడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 43 శాతం ఎక్కువ. కొత్త నగలు కొనే బదులు ఉన్న బంగారాన్ని అమ్మేసి లాభాలు పొందడానికే జనం ఆసక్తి చూపిస్తున్నారు. ఈ అమ్మకాల విలువ సుమారు 6 లక్షల కోట్ల రూపాయలుగా అంచనా.

దిగుమతుల భారం తగ్గించే రీసైక్లింగ్
భారతదేశం ఇప్పటికీ విదేశీ బంగారంపైనే ఎక్కువగా ఆధారపడుతోంది. 2026 ఆర్థిక సంవత్సరంలో 6.05 లక్షల కోట్ల రూపాయల విలువైన బంగారాన్ని భారత్ దిగుమతి చేసుకుంది. 2025లో 125 నుండి 150 టన్నుల పాత బంగారం రీసైక్లింగ్ అయ్యింది. ఇప్పుడున్న వేగం చూస్తుంటే 2026లో ఇది 200 నుండి 250 టన్నులకు చేరుకోవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.

ముత్తూట్ ఎగ్జిమ్ జోరు
ముత్తూట్ ఎగ్జిమ్ వంటి సంస్థలకు ఇప్పుడు లాభాల పంట పండుతోంది. దేశవ్యాప్తంగా ఉన్న 100 గోల్డ్ పాయింట్స్ ద్వారా బంగారాన్ని సేకరించే పనిలో ఈ సంస్థ ఉంది. ఆ సంస్థ సేకరణ గతేడాది కంటే 40 శాతం పెరిగింది. కష్టాల్లో ఉన్నప్పుడు మాత్రమే కాకుండా ధరలు అనుకూలంగా ఉన్నప్పుడు బంగారాన్ని నగదుగా మార్చుకోవడం కొత్త అలవాటుగా మారింది.

అంతర్జాతీయ మార్కెట్ ప్రభావం
బంగారం ధరల హెచ్చుతగ్గుల వెనుక అంతర్జాతీయ కారణాలు ఉన్నాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల తీరు ఇక్కడ ప్రభావం చూపుతోంది. భౌగోళిక రాజకీయ అనిశ్చితులు, క్రూడ్ ఆయిల్ ధరలు బంగారం రేటును శాసిస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో కామెక్స్ గోల్డ్ ఫ్యూచర్స్ 4044.80 డాలర్లు అంటే సుమారు 3.37 లక్షల రూపాయలకు చేరాయి.

ఆర్థిక దృక్పథంలో కీలక మలుపు
ప్రజలు బంగారం పట్ల తమ దృక్పథాన్ని మార్చుకున్నారు. అది ఇప్పుడు కేవలం ఆభరణం కాదు, అత్యవసర సమయాల్లో ఆదుకునే ఆస్తి. ప్రజల ఈ నిర్ణయం దేశం విదేశీ మారక నిల్వలను కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తోంది. పసిడి వేట నుండి విక్రయాల వైపు భారతీయుల ప్రయాణం వేగంగా సాగుతోంది.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *