సోషల్ మీడియాకు కిరీటం – ప్రపంచంలో టీవీలు బంద్… మొబైల్స్ ఆన్….

TVs Vs Mobile
  • మెయిన్ స్ట్రీమ్ వార్తలపై జనంలో అపనమ్మకం
  • వాటి వార్తల విశ్వసనీయతకు ఘోరమైన దెబ్బ
  • సాంప్రదాయక ప్రధాన మీడియాలో సంక్షోభం
  • డిజిటల్ వైపు వలసలు… వీడియో వార్తలకే జై
  • టెలివిజన్‌ను దాటేసిన ఆన్‌లైన్ వీడియోలు
  • వరల్డ్ న్యూస్ ఏజెన్సీ ‘రాయిటర్స్’ పరిశోధన

సహనం వందే, హైదరాబాద్:

ప్రపంచవ్యాప్తంగా సమాచార విప్లవం ముంచెత్తుతున్న వేళ అసలు వార్తలపై జనాల్లో నమ్మకం పూర్తిగా సన్నగిల్లుతోంది. నిత్యం మనం చూసే, చదివే వార్తల వెనుక నిజమెంత అనే ప్రశ్న అందరినీ వేధిస్తోంది. అంతర్జాతీయ న్యూస్ ఏజెన్సీ రాయిటర్స్ తాజా పరిశోధనలో తేలిన చేదు నిజం ఇదే. మీడియా చరిత్రలోనే మునుపెన్నడూ లేని విధంగా వార్తా రంగం తీవ్ర విశ్వసనీయత సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది.

పాత మీడియాకు పెద్ద దెబ్బ
ప్రపంచవ్యాప్తంగా ప్రధాన వార్తా సంస్థలపై ప్రజా నమ్మకం ఎన్నడూ లేనంతగా పడిపోయింది. 2015 సంవత్సరం నుండి ఇదే దారుణమైన స్థితి. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కేవలం 37 శాతం మందే వార్తలను నమ్ముతున్నారు. గత ఏడాదితో పోలిస్తే ఇది 3 శాతం తగ్గింది. బ్రిటన్‌లో పరిస్థితి మరింత ఘోరంగా మారింది. అక్కడ నమ్మకం 30 శాతానికి పడిపోయింది. ఇది 10 ఏళ్ల క్రితం నాటి కంటే 20 శాతం తక్కువ కావడం గమనార్హం. జనం సాంప్రదాయక మీడియాను వదిలేస్తున్నారని చెప్పడానికి ఈ పతనమే పెద్ద ఉదాహరణ.

సోషల్ మీడియా వైపు పరుగు
సాంప్రదాయక వార్తా పద్ధతులపై విరక్తి చెందిన జనం ఇప్పుడు సరికొత్త వేదికల వైపు మొగ్గు చూపుతున్నారు. సగానికి పైగా ప్రజలు సోషల్ మీడియా, వీడియో నెట్‌వర్క్‌ల వంటి థర్డ్ పార్టీ ప్లాట్‌ఫారమ్‌ల నుండే వార్తలను పొందుతున్నారు. ముఖ్యంగా వలసలు, ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ యుద్ధాల వంటి దీర్ఘకాలిక కథనాలను పాత మీడియా సంస్థలు కవర్ చేస్తున్న విధానం నచ్చక జనం ఆందోళన, నిరాసక్తతతో ఈ కొత్త డిజిటల్ వేదికల వైపు వలసపోతున్నారు.

వాడుతున్నారు కానీ నమ్మడం లేదు
ఇక్కడో ఆసక్తికరమైన తిరోగమన ట్రెండ్ కనిపిస్తోంది. జనం వార్తల కోసం సోషల్ మీడియాను ఎక్కువగా వాడుతున్నప్పటికీ దానిపై నమ్మకం మాత్రం చాలా తక్కువగా ఉంది. కేవలం 22 శాతం మంది మాత్రమే సోషల్ మీడియా వార్తలను నమ్ముతున్నారు. అలాగే క్రియేటర్లు, ఇన్‌ఫ్లుయెన్సర్ల వల్ల తమ వార్తా అవసరాలు తీరుతున్నాయని చెప్పింది కేవలం 10 శాతం మందే. అంటే జనం వీరిని పాత మీడియాకు పూర్తి ప్రత్యామ్నాయంగా చూడటం లేదు.. కేవలం అదనపు టైమ్‌పాస్ వనరులుగానే వాడుతున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాట్‌బాట్ల సమాధానాలపై కూడా 20 శాతమే నమ్మకం ఉంది. కానీ వాటి వాడకం మాత్రం 7 శాతం నుండి 10 శాతానికి పెరిగింది. యువతలో ఇది 16 శాతంగా ఉంది. అంటే నమ్మకం లేకపోయినా వాడకం పెరగడం గమనార్హం.

టెలివిజన్‌ను దాటేసిన ఆన్‌లైన్
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వార్తా రంగంలో అతిపెద్ద ట్రెండ్ ఆన్‌లైన్ వీడియో. ప్రపంచవ్యాప్తంగా 77 శాతం మంది ప్రతి వారం ఆన్‌లైన్ వార్తా వీడియోలనే చూస్తున్నారు. జర్మనీ, డెన్మార్క్, నెదర్లాండ్స్ మినహా మిగిలిన అన్ని దేశాల్లో సాంప్రదాయక బ్రాడ్‌కాస్ట్ టెలివిజన్ వార్తల కంటే ఈ ఆన్‌లైన్ వీడియోలే ముందంజలోకి వచ్చాయి. జనం టీవీల ముందు కూర్చోవడం మానేసి మొబైల్స్‌లో వీడియోలు చూస్తున్నారు. జనం వార్తలను పూర్తిగా వద్దనుకోవడం లేదు.. కానీ పాత పద్ధతిలో కాకుండా తమ జీవితాలకు సులువుగా అర్థమయ్యేలా, అందుబాటులో ఉండేలా డిజిటల్ రూపంలో కోరుకుంటున్నారు. 48 దేశాల్లోని లక్ష మంది అభిప్రాయం ఇది.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *