- హెచ్చరించిన తెలంగాణ ప్రభుత్వం
- వర్గీకరణ ఆదేశాలు… మెమో జారీ
- ప్రమోషన్లు, నియామకాల్లో అమలు
- అధికారులకు, కలెక్టర్లకు సూచనలు
సహనం వందే, హైదరాబాద్:
తెలంగాణలో ఎస్సీ వర్గీకరణ అమలుపై అధికారుల్లో నెలకొన్న సందిగ్ధతకు ప్రభుత్వం తెరదించింది. చట్టాలు, జీవోలు ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో లబ్ధిదారులకు న్యాయం ఆలస్యం కావడంపై సర్కార్ తీవ్రంగా స్పందించింది. ఎస్సీ వర్గాల రిజర్వేషన్లు పక్కాగా, పారదర్శకంగా అమలు కావాలనే లక్ష్యంతో షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ 1828 నంబరుతో కీలకమైన మెమోను విడుదల చేసింది. చట్టం ఏ ఉద్దేశంతోనైతే రూపొందిందో, అదే స్ఫూర్తితో క్షేత్రస్థాయిలో అమలు జరగాలని స్పష్టం చేసింది.
చట్టపరమైన రక్షణలకు జీవోలు
ఈ వర్గీకరణ నిర్ణయం వెనుక బలమైన చట్టపరమైన పునాది ఉంది. 2025లో వచ్చిన యాక్ట్ దీనికి ప్రధాన ఆధారంగా నిలవగా, ఎస్సీ అభివృద్ధి శాఖ జారీ చేసిన జీవో నంబర్ 9, జీవో నంబర్ 10లు అత్యంత కీలక పాత్ర పోషిస్తున్నాయి. వీటితో పాటు సాధారణ పరిపాలనా శాఖ ఇచ్చిన జీవో నంబర్ 99, గత ఏడాది నవంబర్ 25న వచ్చిన మెమో నంబర్ 1762 వర్గీకరణకు చట్టబద్ధమైన రక్షణను అందిస్తున్నాయి. వర్గీకరణను ఎలా అమలు చేయాలో ఈ ఉత్తర్వులన్నీ పక్కాగా నిర్దేశిస్తున్నాయి.
వరుస విజ్ఞప్తులు… ప్రభుత్వ స్పందన
వర్గీకరణ అమలులో జరుగుతున్న ఆలస్యంపై మార్చి నెలలో వరుస విజ్ఞప్తులు వచ్చాయి. ఎస్సీ సంక్షేమం, గిరిజన అభివృద్ధి, దివ్యాంగుల శాఖ మంత్రుల నుంచి సచివాలయ సీఎస్ ఆఫీస్‌కు మార్చి 30న ఒక లేఖ వచ్చింది. అలాగే మార్చి 31న మాదిగ ఎంప్లాయీస్ కోఆర్డినేషన్ కమిటీ చైర్మన్ కూడా సీఎస్‌కు వినతిపత్రం అందజేశారు. అధికారులకు ఉన్న అనుమానాలను నివృత్తి చేసి, స్పష్టత ఇచ్చేందుకు ప్రభుత్వం తక్షణమే స్పందించి ఈ తాజా మెమోను జారీ చేయాల్సి వచ్చింది.
అధికారుల అస్పష్టత… ప్రమోషన్లలో ఆలస్యం
వివిధ శాఖల అధికారులు, జిల్లా కలెక్టర్ల మధ్య అమలు విషయంలో కొంత గందరగోళం నెలకొంది. 2025 నాటి యాక్ట్ 13 నిబంధనల ప్రకారం ఎస్సీ ఉపకులాల వర్గీకరణను ఏ విధంగా వర్తింపజేయాలో స్పష్టత లేక అధికారులు రకరకాల అభిప్రాయాలతో ఉండిపోయారు. దీనివల్ల ఉద్యోగాలు, ప్రమోషన్లలో వర్గీకరణ అమలు ఆలస్యమవుతూ వచ్చింది. ఈ క్రమంలో మాదిగ ఉద్యోగుల సంఘం, ఇతర ఎస్సీ సంఘాలు ప్రభుత్వ దృష్టికి తమ ఆవేదనను తీసుకెళ్లాయి. అన్ని నియామకాలు, ప్రమోషన్లు, విద్యా సంస్థల్లోని అడ్మిషన్లలో వర్గీకరణను పక్కాగా వర్తింపజేయాలని కోరాయి.
కఠిన ఆదేశాలు… బాధ్యులపై చర్యలు
ఈ విజ్ఞప్తులను క్షుణ్ణంగా పరిశీలించిన ప్రభుత్వం, గతంలో ఇచ్చిన ఐదో రిఫరెన్స్ మెమోను పునరుద్ఘాటిస్తూ ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ శాఖలు, హెచ్వోడీలు, జిల్లా కలెక్టర్లకు ఈ ఆదేశాలు వెళ్లాయి. చట్టంలో, జీవోల్లో ఏముందో దాన్ని తప్పకుండా పాటించాలని, నిబంధనలు అతిక్రమిస్తే ఊరుకునేది లేదని ప్రభుత్వం హెచ్చరించింది. ముఖ్యంగా ఉద్యోగోన్నతులు, కొత్త నియామకాలు, విద్యా సంస్థల్లో సీట్ల కేటాయింపులో ఈ రూల్స్ కచ్చితంగా అమలు కావాలని స్పష్టం చేసింది.
కార్పొరేషన్లు, వర్సిటీలకూ వర్తింపు
ప్రభుత్వ శాఖలతో పాటు కార్పొరేషన్లు, యూనివర్సిటీలు, స్వయంప్రతిపత్తి కలిగిన అన్ని సంస్థలు కూడా ఈ ఉత్తర్వులను కచ్చితంగా పాటించాలి. బదిలీల ద్వారా ఇచ్చే ఉద్యోగాలు లేదా ప్రమోషన్లలో కూడా ఎలాంటి మినహాయింపులు ఉండవు. ఈ ముఖ్యమైన మెమోపై ముఖ్య కార్యదర్శి విజేంద్ర బోయి అధికారికంగా సంతకం చేశారు. సచివాలయ పరిధిలోని కార్యదర్శులకు, ఎస్సీ అభివృద్ధి శాఖ కమిషనర్, సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ సొసైటీ కార్యదర్శి, టీజీఎస్సీసీడీసీ లిమిటెడ్ ఎండీతో పాటు అందరూ కలెక్టర్లకు ఈ సమాచారం పంపారు. ప్రభుత్వం స్పష్టత ఇచ్చినందున అధికారులు పారదర్శకంగా పనిచేసి అర్హులైన ప్రతి ఒక్కరికీ సామాజిక న్యాయం అందిస్తారని ఆశిద్దాం.