- మారుతున్న రాజకీయ చిత్రం… తిరుగుబాట్లు
- దర్యాప్తు సంస్థల నిఘాతో కేంద్రంతో రాజీ
సహనం వందే, హైదరాబాద్:
భారతదేశ రాజకీయాల్లో ప్రాంతీయ పార్టీల మనుగడ ప్రమాదంలో పడింది. కాంగ్రెస్ ముక్త్ భారత్ నినాదం దాటి ప్రాంతీయ పార్టీలను మింగేసి దిశగా వ్యూహాలు సాగుతున్నాయి. ప్రత్యక్ష పోరులో గెలిచినప్పటికీ ఆ తర్వాత ఎదురవుతున్న చీలికలు, ఫిరాయింపులు, అధికార కూటమిలో విలీనాలు ప్రాంతీయ పార్టీల ఉనికిని ప్రశ్నార్థకం చేస్తున్నాయి.
సరికొత్త రాజకీయ ముప్పు
ప్రాంతీయ పార్టీలు ఎన్నికల క్షేత్రంలో భారతీయ జనతా పార్టీని నేరుగా ఢీకొట్టి విజయాలు సాధిస్తున్నా వాటి అసలు కథ అక్కడితో ముగియడం లేదు. ఎన్నికల ఫలితాల తర్వాత ఈ పార్టీలు తీవ్రమైన అంతర్గత ఒత్తిళ్లను ఎదుర్కొంటున్నాయి. ప్రతిపక్షాలు బలంగా ఉన్న రాష్ట్రాలలో సైతం తిరుగుబాట్లు పెచ్చుమీరుతున్నాయి. నాయకులు ఫిరాయింపుల వైపు మొగ్గు చూపుతున్నారు. బలమైన ప్రాంతీయ నేతలు సైతం తమ సొంత శ్రేణులను కాపాడుకోలేక చేతులెత్తేస్తున్నారు. ఈ పరిణామాలు కేవలం ఒకట్రెండు రాష్ట్రాలకే పరిమితం కాకుండా దేశవ్యాప్తంగా విస్తరిస్తున్నాయి.
చీలికలు… ఫిరాయింపులు
ప్రాంతీయ పార్టీల అంతర్గత నిర్మాణాలు చాలా బలహీనంగా మారుతున్నాయి. ఎన్నికల్లో గెలిచిన ప్రజాప్రతినిధులు వ్యక్తిగత ప్రయోజనాలు లేదా కేంద్ర దర్యాప్తు సంస్థల ఒత్తిడి కారణంగా పార్టీ లైన్ దాటుతున్నారు. దీనివల్ల అసలైన పార్టీ ఏది అనే గందరగోళం ఓటర్లలో వ్యక్తమవుతోంది. తృణమూల్ కాంగ్రెస్ వంటి బలమైన పార్టీలో సైతం అసమ్మతి రాగాలు వినిపించడం ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ. ఆ పార్టీలో పెద్ద ఎత్తున చీలిక ఏర్పడింది. పార్లమెంటు సభ్యులు సైతం సొంతకుంపటి ఏర్పాటు చేసుకుని బీజేపీకి జై కొడుతున్నారు. శాసనసభల నుండి లోకసభ వరకు ఈ చీలికల ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది.
కూటములలో విలీన పర్వం
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రాంతీయ శక్తులను తమలో ఐక్యం చేసుకునే వ్యూహాన్ని వేగవంతం చేసింది. స్వతంత్రంగా ఎదగాలని చూసే చిన్న పార్టీలను తమ కూటమిలోకి లాగడం ద్వారా వాటి అస్తిత్వాన్ని క్రమంగా తుడిచిపెడుతున్నారు. ప్రాంతీయ అజెండాల కంటే జాతీయ అజెండాలకే ప్రాధాన్యత పెరిగేలా ఒత్తిడి తెస్తున్నారు. దీంతో చాలా పార్టీలు ఉనికిని కాపాడుకోవడానికి కూటమితో లొంగిపోవాల్సి వస్తోంది. ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన తెలుగుదేశం, జనసేన, వైఎస్సార్సీపీ పార్టీలు బీజేపీకి మద్దతు ఇవ్వాల్సిన అనివార్యత ఏర్పడింది.
దర్యాప్తు సంస్థల నిఘా నీడ
ప్రాంతీయ పార్టీల అగ్రనేతలపై కేంద్ర దర్యాప్తు సంస్థల నిఘా తీవ్రమవ్వడం మరో ప్రధాన కోణంగా మారింది. అవినీతి ఆరోపణలు, ఆర్థిక అక్రమాల కేసుల భయంతో చాలా మంది నేతలు అధికార పక్షంతో రాజీ పడుతున్నారు. ఈ వ్యూహాత్మక ఒత్తిడి వల్ల పార్టీల నేతలు కూడా రక్షణ ధోరణి అవలంబిస్తున్నారు. వైసీపీ అధినేత జగన్ తన కేసుల కారణంగా కేంద్రంతో రాజీ ధోరణితోనే వ్యవహరిస్తున్నారు. తమిళనాడు సీఎంగా బాధ్యతలు తీసుకున్న విజయ్ కూడా కేంద్రంతో కొట్లాడే పరిస్థితి కనిపించడం లేదు. తెలంగాణలో కవిత టీఆర్ఎస్, బీఆర్ఎస్ పార్టీలు కూడా కాషాయ దళంతో పెట్టుకోవడానికి ధైర్యం చేయలేకపోతున్నాయి. పోరాట పటిమ చూపే నాయకత్వం క్రమంగా బలహీనపడుతోంది. ఇది ప్రతిపక్ష ఐక్యతను దెబ్బతీస్తోంది.
ఓటర్ల మైండ్ గేమ్
క్షేత్రస్థాయిలో ఓటర్లు ప్రాంతీయ ప్రయోజనాల కోసం స్థానిక పార్టీలను ఆదరిస్తున్నప్పటికీ కేంద్రంలో స్థిరమైన ప్రభుత్వం కోసం జాతీయ పార్టీల వైపు చూస్తున్నారు. ఈ ద్వంద్వ వైఖరి ప్రాంతీయ పార్టీలకు శాపంగా మారుతోంది. శాసనసభ ఎన్నికలలో ఒకలా.. లోకసభ ఎన్నికలలో మరోలా ఓటింగ్ సరళి ఉండటం వల్ల ప్రాంతీయ నేతల బేరసారాల శక్తి క్షీణిస్తోంది. రాష్ట్ర నిధుల కోసం కేంద్రంపై ఆధారపడటం కూడా ఒక బలహీనతగా మారింది.
క్షీణిస్తున్న రాజకీయ బలం
భారత రాజకీయాలలో ప్రాంతీయ పార్టీల బలం రోజురోజుకూ కుంచించుకుపోతోంది. ఒకప్పుడు దేశాన్ని శాసించిన కూటమి రాజకీయాల శకం నుండి ఏకఛత్రాధిపత్యం వైపు అడుగులు పడుతున్నాయి. భవిష్యత్తులో ప్రాంతీయ పార్టీలు తమ సిద్ధాంతాలను మార్చుకోకపోతే లేదా కట్టుబాటును ప్రదర్శించకపోతే అవి కేవలం నామమాత్రపు శక్తులుగా మిగిలిపోయే ప్రమాదం పొంచి ఉంది. ప్రజాస్వామ్య బహుళత్వానికి ఇది పెద్ద సవాలుగా పరిణమించింది.