లక్షల వెల.. కెమెరా వెలవెల – యాపిల్ “మడత” పేచీ

iphone Portable fail
  • ఫోల్డబుల్ రేసులో వెనుకడుగు!
  • టెలీఫోటో లేని ఐఫోన్ డ్యూయో
  • కొనుగోలుదారుల తీవ్ర అసంతృప్తి
  • ఆండ్రాయిడ్ గెలిచింది.. యాపిల్ ఓడింది!

సహనం వందే, హైదరాబాద్:

టెక్ ప్రపంచంలో విప్లవాత్మక మార్పులు తెస్తామంటూ గొప్పలు చెప్పుకునే యాపిల్ సంస్థ, ఎంతో ఆర్భాటంగా మార్కెట్లోకి తీసుకొచ్చిన తొలి ఫోల్డబుల్ ఫోన్ ఐఫోన్ డ్యూయో ఇప్పుడు తీవ్ర విమర్శలను ఎదుర్కొంటోంది. సామ్‌సంగ్, గూగుల్ లాంటి ఆండ్రాయిడ్ దిగ్గజాలు మార్కెట్లో ఏడేళ్లుగా ఫోల్డబుల్ ఫోన్ల టెక్నాలజీలో దూసుకుపోతుంటే, యాపిల్ మాత్రం ఏడేళ్లపాటు హోమ్‌వర్క్ చేసి మరీ తీసుకొచ్చిన ఈ డివైస్‌లో కనీస హంగులు కూడా లేకపోవడం టెక్‌ నిపుణులను విస్మరిస్తోంది. ముఖ్యంగా కెమెరా సెటప్, గుండెలు గుబేలుమనిపించే భారీ ధర విషయాల్లో వినియోగదారులకు తీవ్ర నిరాశే మిగులుస్తోంది.

కెమెరాలో కొరవడిన మ్యాజిక్…
కెమెరా సెటప్ దగ్గరికి వచ్చేసరికి, యాపిల్ ఈసారి పూర్తిగా నిరాశపరిచిందనే చెప్పాలి. ఇందులో కేవలం రెండు 48-మెగాపిక్సెల్ సెన్సార్లు మాత్రమే ఇవ్వడం గమసార్హం. మార్కెట్లో ఇదే రేంజ్‌లో, అంతకంటే తక్కువ ధరలో లభిస్తున్న చాలా ఆండ్రాయిడ్ ఫోన్లలో అద్భుతమైన టెలీఫోటో జూమ్ లెన్సులు ఉంటున్నాయి. కానీ ఐఫోన్ డ్యూయోలో డెడికేటెడ్ టెలీఫోటో కెమెరా లేకపోవడం టెక్ ప్రియులకు పెద్ద మైనస్‌గా మారింది. అయితే, ఫోల్డబుల్ డిజైన్‌ను బేస్ చేసుకుని డ్యూయో ప్రివ్యూ లాంటి ఫీచర్ల ద్వారా ఫోటోలు తీసుకునే విధానంలో కొన్ని మ్యాజిక్‌లను యాపిల్ చూపించడానికి ప్రయత్నించినా, అసలైన జూమ్ కెమెరా లోటును మాత్రం అది ఏమాత్రం భర్తీ చేయలేకపోయింది.

ధర చూస్తే గుండె గుబేలు
ఇక పెర్ఫార్మెన్స్ పరంగా చూస్తే, ఇందులో వాడిన ఏ20 ప్రొ చిప్ తన శక్తి ఏంటో నిరూపించుకుంటుందనే మాట వాస్తవమే. వేపర్ ఛాంబర్ కూలింగ్ సిస్టమ్ ఉండటం వల్ల ఎంత పెద్ద గేమింగ్ సెషన్స్ ఆడినా, భారీ ఏఐ వర్క్‌లోడ్స్ రన్ చేసినా ఫోన్ అసలు వేడెక్కదు. బ్యాటరీ లైఫ్ కూడా రోజంతా ఎటువంటి ఇబ్బంది లేకుండా సాగిపోతుంది. కానీ, ధర విషయానికి వస్తేనే అసలు షాక్ తగులుతుంది! అమెరికాలో దీని ధర సుమారు రెండు వేల డాలర్లు ఉండగా, మన దేశంలో దీని అధికారిక ప్రారంభ ధర ఏకంగా రూ. 2,99,900 నుంచి షురూ అవుతుంది. ఒకవేళ ఎక్కువ స్టోరేజ్ వేరియంట్ కావాలనుకుంటే ధర నాలుగున్నర లక్షల రూపాయల వరకు వెళ్తుంది. సామ్‌సంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ సిరీస్ మన దేశంలో చాలా తక్కువ ధరకే అందుబాటులో ఉన్నప్పుడు, కేవలం బ్రాండ్ పేరు చూపిస్తూ యాపిల్ పెట్టిన ఈ భారీ ధర ఎవరికి నప్పుతుందనేది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది.

ఆండ్రాయిడ్ కంటే యాపిల్ లేట్ ఎంట్రీ
సామ్‌సంగ్, ఇతర ఆండ్రాయిడ్ ఫోల్డబుల్ ఫోన్లతో పోలిస్తే, యాపిల్ డిజైన్ పరంగా కొంత పాలిష్ తెచ్చినప్పటికీ ఫ్రీడమ్ విషయంలో మాత్రం చాలా వెనుకబడి ఉంది. ఆండ్రాయిడ్ ఫోల్డబుల్ ఫోన్లలో ఉన్నట్లుగా దీన్ని పెద్ద స్క్రీన్‌పై డెస్క్‌టాప్ మోడ్‌లా వాడుకునే ఫుల్ విండోయింగ్ ఫ్రీడమ్ లేదా మినీ-మ్యాక్ లాంటి అనుభూతిని యాపిల్ ఇవ్వలేకపోయింది. కేవలం ఒక పెద్ద ఐఫోన్‌ను మడతపెట్టే సౌలభ్యం ఇచ్చారే తప్ప, ఐప్యాడ్ లాగా దీన్ని పూర్తిగా ప్రొడక్టివిటీ టూల్‌లా మార్చలేకపోయారు. ఎనిమిదేళ్ల హోమ్‌వర్క్ తర్వాత తెచ్చినప్పటికీ, ఫోల్డబుల్ స్క్రీన్‌లు సాధారణ గ్లాస్ కంటే సున్నితంగా ఉండటం, అనుకోకుండా కింద పడితే స్క్రీన్ దెబ్బతినే ముప్పు అలాగే ఉండటం దీని మన్నికపై నీలినీడలు కమ్ముకునేలా చేస్తోంది.

ఖరీదైన ప్రయోగం
మొత్తంగా చెప్పాలంటే, ఐఫోన్ డ్యూయో అనేది యాపిల్ చేసిన ఒక ఖరీదైన ప్రయోగం మాత్రమే. కెమెరాలో టెలీఫోటో లెన్స్ లేకపోవడం, ఆండ్రాయిడ్ ఇస్తున్న ఫ్రీడమ్ లేకపోవడం, సామాన్యులను గజగజలాడించే మూడు లక్షల రూపాయల భారీ ధర వంటి అంశాలు ఈ ఫోన్‌ను కింది స్థాయికి నెట్టేస్తున్నాయి. టెక్నాలజీ ఎంత మారినా, ఫీచర్లు పరిమితంగా ఉన్నప్పటికీ కేవలం స్టేటస్ సింబల్ కోసం మాత్రమే మూడు లక్షలు వెచ్చించడం ఎంతవరకు సమంజసం అనేది వినియోగదారులే బేరీజు వేసుకోవాలి.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *