- ఒక్క సంవత్సరం ఉంటే చాలు
- సుప్రీంకోర్టు సంచలన తీర్పు
- లా విద్యార్థులకు భారీ శుభవార్త
సహనం వందే, న్యూఢిల్లీ:
న్యాయమూర్తి కావాలని కలలు కనే యువ లా గ్రాడ్యుయేట్లకు సుప్రీంకోర్టు ఊరటనిచ్చింది. గతంలో ఉన్న మూడేళ్ల లీగల్ ప్రాక్టీస్ నిబంధనను ఒక సంవత్సరానికి తగ్గిస్తూ శుక్రవారం సంచలన తీర్పు వెలువరించింది. ఈ నిర్ణయంతో న్యాయ విద్య పూర్తి చేసిన వెంటనే సివిల్ జడ్జి పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులకు పెద్ద ఉపశమనం లభించింది.
2025 నాటి తీర్పుకు సవరణ…
సుప్రీంకోర్టు ప్రధాన జ్యుడీషియరీ పరీక్షల అర్హతకు సంబంధించి గతంలో ఇచ్చిన మే 2025 నాటి తీర్పును ఇప్పుడు అధికారికంగా సవరించింది. లా గ్రాడ్యుయేట్లు సివిల్ జడ్జి పరీక్షలు రాయాలంటే తప్పనిసరిగా ఉండాల్సిన మూడేళ్ల లీగల్ ప్రాక్టీస్ నిబంధనను కేవలం ఒక్క సంవత్సరానికి కుదించింది. చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం… ఈ నిర్ణయాన్ని ఇద్దరు వ్యతిరేకించినా మెజారిటీ తీర్పుగా వెలువరించింది. రివ్యూ పిటిషన్లను విచారించిన కోర్టు ఈ మేరకు యువ న్యాయవాదులకు ఊరటనిచ్చేలా మార్గదర్శకాలను విడుదల చేసింది.
యువతకు పెద్ద ఉపశమనం
లా చదువు పూర్తి చేసిన వెంటనే నేరుగా జ్యుడీషియరీ పరీక్షలకు సిద్ధమయ్యే యువతకు ఈ మార్పు పెద్ద ఉపశమనం కలిగిస్తుందని నిపుణులు భావిస్తున్నారు. అయితే ప్రాక్టీస్ అనుభవం పూర్తిగా లేకుండా నేరుగా న్యాయపీఠంపై కూర్చోవడం సరైనది కాదనే వాదనను కూడా కోర్టు పూర్తిగా కొట్టివేయలేదు. అనుభవం ప్రాముఖ్యతను అలాగే ఉంచుతూనే, ఆ నిబంధన వల్ల యువ న్యాయవాదులపై పడుతున్న ఆర్థిక, మానసిక భారాన్ని తగ్గించడమే ఈ సవరణ ప్రధాన ఉద్దేశమని స్పష్టం చేసింది.
ఏడాది క్లర్క్‌షిప్ తప్పనిసరి…
ఈ కొత్త ఫ్రేమ్‌వర్క్ ప్రకారం ఎంపికైన అభ్యర్థులు నేరుగా జడ్జిగా బాధ్యతలు చేపట్టడానికి వీలుండదు. వీరు ముందుగా జ్యుడీషియరీ అకాడమీలో ప్రత్యేక శిక్షణ పొందాల్సి ఉంటుంది. అకాడమీ శిక్షణ పూర్తి చేసుకున్న తర్వాత అదనంగా ఒక సంవత్సరం పాటు క్లర్క్‌షిప్ తప్పనిసరి చేశారు. ఈ అదనపు శిక్షణ, క్లర్క్‌షిప్ విధానం వల్ల కొత్త జడ్జిలకు కోర్టు నిర్వహణపై ఆచరణాత్మక జ్ఞానం వస్తుందని సుప్రీంకోర్టు తన తీర్పులో అభిప్రాయపడింది.
తాత్కాలిక మినహాయింపులు…
తాజా తీర్పు ప్రకారం… 2025 మే 25 నుండి 2027 మార్చి 31 మధ్య కాలంలో నోటిఫికేషన్ వచ్చే జ్యుడీషియరీ పరీక్షలకు దరఖాస్తు చేసే అభ్యర్థులకు ఈ ప్రాక్టీస్ నిబంధన వర్తించదు. ఈ మధ్యకాలంలో దరఖాస్తు చేసుకునే ఏ లా గ్రాడ్యుయేట్ అయినా ముందస్తు ప్రాక్టీస్ సర్టిఫికేట్లు ఏవీ చూపించాల్సిన అవసరం లేదు. వీరందరూ ఎలాంటి ఆటంకాలు లేకుండా నేరుగా పరీక్షలకు హాజరు కావడానికి పూర్తి అర్హులుగా పరిగణించబడతారని కోర్టు స్పష్టమైన వెసులుబాటు కల్పించింది.
ఇటువంటి అభ్యర్థులు తమ దరఖాస్తుల నిమిత్తం ఇప్పటికే ఒక సంవత్సరం పాటు ప్రాక్టీస్ పూర్తి చేసినట్లుగా పరిగణిస్తామని కోర్టు పేర్కొంది. యువత కోర్టుల చుట్టూ తిరుగుతూ సర్టిఫికేట్ల కోసం పడే ఇబ్బందులను నివారించేందుకే ఈ తాత్కాలిక మినహాయింపులను అమలు చేస్తున్నట్లు న్యాయస్థానం వెల్లడించింది.
ఎంపికైన వారికి శిక్షణ ఎక్కడెక్కడ…?
పరీక్షల్లో విజయం సాధించి ఎంపికైన అభ్యర్థులను మొదట ఒక సంవత్సరం పాటు ట్రైనీ జ్యుడీషియరీ ఆఫీసర్లుగా నియమిస్తారు. ఈ శిక్షణా కాలంలో తొలి ఆరు నెలల పాటు ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జి లేదా హయ్యర్ జ్యుడీషియరీ సర్వీస్ సభ్యుల పర్యవేక్షణలో లా క్లర్క్‌గా విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. ఆ తర్వాత మిగిలిన ఆరు నెలల పాటు సంబంధిత హైకోర్టు సిట్టింగ్ జడ్జిల ప్రత్యక్ష పర్యవేక్షణలో శిక్షణ పొందాలి. ఈ పద్ధతి ద్వారా న్యాయమూర్తులుగా మారబోయే వారికి కిందిస్థాయి నుంచి పైస్థాయి వరకు అనుభవం గడించే అవకాశం లభిస్తుంది.