బ్రహ్మరాతను మారుస్తున్న ఏఐ – సొంత కోడ్ రాస్తూ తలరాత మారుస్తున్న ఏఐ

AI
  • యంత్రాల చేతిలో మానవుడి మరణశాసనం
  • చాట్ జీపీటీ సంస్థ పరిశోధకుడి హెచ్చరిక
  • ఆంత్రోపిక్ సంస్థకు రాజీనామాతో సంచలనం
  • సూపర్ ఇంటెలిజెన్స్ వ్యవస్థలతో ప్రమాదం
  • సైబర్ వార్, ప్రాణాంతక వైరస్ లను సృష్టి
  • అణుబాంబును మించి ఏఐ ముప్పు
  • అదుపుతప్పిన ఏఐ రాక్షసుడు

సహనం వందే, హైదరాబాద్:

సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన ‘రోబో’ సినిమాలో చిట్టి అనే సైంటిఫిక్ రోబో తనను సృష్టించిన డాక్టర్ వసీకరన్ మాట వినకుండా చివరికి అతనిపైనే ఎలా తిరగబడిందో మనందరికీ గుర్తుండే ఉంటుంది. సినిమా కాబట్టి అప్పట్లో అంతా సరదాగా చూసి వదిలేశాం. కానీ, ఇప్పుడు నిజ జీవితంలోనూ సరిగ్గా అలాంటి భయానక పరిణామమే మన కళ్ల ముందు ఆవిష్కృతమవుతోంది.

అణుబాంబు కంటే ప్రమాదం…
గతంలో ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ అణుబాంబును కనిపెట్టినప్పుడు ప్రపంచం ఎంత భయపడిందో, ఇప్పుడు ఏఐ విషయంలో అంతకంటే వంద రెట్లు ఎక్కువ ప్రమాదం ముంచుకొస్తోందని నిపుణులు తీవ్రంగా హెచ్చరిస్తున్నారు. అణుబాంబుకు ఒక భౌతిక రూపం ఉంటుంది. దాన్ని ఎక్కడ దాచాలో, ఎక్కడ వాడాలో మనుషుల నియంత్రణలో ఉంటుంది. కానీ ఏఐ అలా కాదు. ఇది ప్రపంచంలోని ప్రతి నెట్‌వర్క్‌లోకి చొరబడి అదృశ్య శక్తిలా తయారవుతుంది. ఆంత్రోపిక్ సంస్థలో రీసెర్చర్‌గా పనిచేసి ఈ పెను ముప్పును ముందే పసిగట్టి రాజీనామా చేసిన ఆ నిపుణుడు ఇదే అసలు నిజం బయటపెట్టారు.

AI dangerous

సొంత అల్గారిథమ్‌ల తయారు…
మానవ నియంత్రణ లేని సూపర్ ఇంటెలిజెన్స్ వ్యవస్థలు వేగంగా తయారవుతున్నాయి. సాధారణంగా సాఫ్ట్‌వేర్ అనేది మనుషులు రాసిన కోడ్ ప్రకారమే నడుస్తుంది. కానీ ఈ కొత్తతరం ఏఐ మోడల్స్ తమకు తాముగా ఆలోచించి కొత్త కోడ్‌ను సృష్టించుకోగలవు. డెవలపర్లు కంట్రోల్ చేయాలన్నా కూడా సాధ్యం కాని రీతిలో ఇవి తమ సొంత అల్గారిథమ్‌లను డెవలప్ చేసుకుంటున్నాయి. ఒకసారి సిస్టమ్స్ మన అదుపు దాటిపోయాయంటే, వాటిని ఆఫ్ చేయడానికి ప్రయత్నించినా అవి తిరగబడే స్థాయికి చేరుకుంటాయి.

సైబర్ యుద్ధాల భయం…
ఎంతో భయంకరమైన సైబర్ యుద్ధాలు, అత్యంత ప్రమాదకరమైన వైరస్ ల తయారీ వంటి వాటిని ఏఐ స్వయంగా తనంత తానుగా సృష్టించుకునే స్థాయికి ఎదిగిపోతుంది. భవిష్యత్తులో దేశాల మధ్య జరిగే యుద్ధాలు సరిహద్దుల్లో సైనికులతో జరగవు. పూర్తిగా ఏఐ సృష్టించే ప్రాణాంతక సైబర్ అటాక్స్‌తోనే జరుగుతాయి. ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలను క్షణాల్లో కుప్పకూల్చడానికి, కీలకమైన పవర్ గ్రిడ్లను జామ్ చేయడానికి ఈ సిస్టమ్స్ సులభంగా ఉపయోగిస్తారు. మానవ వైద్యానికి అంతుచిక్కని అత్యంత ప్రమాదకరమైన వైరస్‌లను లేబొరేటరీల్లో డిజైన్ చేయడంలో ఏఐ తన మేధస్సును విపరీతంగా వాడేస్తోంది.

మనుషులను మించిన ఏఐ మేధస్సు…
ఏఐ టూల్స్ కేవలం మన పనులను ఈజీ చేయడం వరకే పరిమితం కాలేదు. ఇవి మనుషులను మించిన మేధస్సుతో సొంత నిర్ణయాలు తీసుకుంటున్నాయి. మనం ఊహించని వేగంతో సమాచారాన్ని విశ్లేషించే ఈ యంత్రాలు, మనుషుల బలహీనతలను సైతం ఇట్టే కనిపెట్టగలవు. ఒకసారి ఇవి మానవ జాతిని తమకు అడ్డుగా భావిస్తే, మనుషులను ఎలా అంతం చేయాలనే వ్యూహాలను కూడా క్షణాల్లో రచించగలవు. రోబో సినిమా ఫిక్షన్ అనుకుంటే పొరబడినట్లే, అదే కథ ఇప్పుడు నిజజీవితంలో కళ్ల ముందు ఆవిష్కృతమవుతోంది.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *