- ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ఏర్పాటులో ముగ్గురు
- గత ప్రభుత్వంలో అక్రమాలకు తెరలేపారు
- రూ. 247 కోట్లతో ఫ్యాక్టరీకి ఒప్పించారు
- సాధ్యాసాధ్యాలను చూడకుండా ఆమోదం
- కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటికీ కొనసాగింపు
- ప్రతి జిల్లాకు ఫ్యాక్టరీ వస్తే ఇంత ఖర్చెందుకు?
- ప్రీ యూనిక్ కంపెనీతో అధికారుల చెట్టపెట్టాల్
- మండిపడుతున్న ఆయిల్ పామ్ రైతు నేతలు
సహనం వందే, హైదరాబాద్: సిద్దిపేట జిల్లా నర్మెట్ట లో నిర్మిస్తున్న ఆయిల్ పామ్ మెగా ఫ్యాక్టరీ వెనుక ఘరానా దోపిడి జరుగుతుందని ఆయిల్ పామ్ గ్రోయర్స్ అసోసియేషన్ మండిపడుతుంది. ఏమీ లేకుండా ఆయిల్ ఫెడ్ అక్కడ అంత పెద్ద ఫ్యాక్టరీ ఎందుకు కడుతుందని అసోసియేషన్ నాయకులు నిలదీస్తున్నారు. దాని వల్ల ఆ ప్రాంత ఆయిల్ పామ్ రైతులకు

ఏమైనా ఉపయోగం ఉందా? లేక ఆయిల్ ఫెడ్ కేవలం రాజకీయ నాయకులకు, కాంట్రాక్టర్లకు దోచి పెట్టటానికి ఇదంతా చేస్తుందా? అని అసోసియేషన్ అధ్యక్షులు ఉమామహేశ్వర్ రెడ్డి నిలదీస్తున్నారు. ఈ మేరకు ఆయన సమగ్ర వివరాలతో ఒక నివేదిక తయారు చేశారు. ఆ నివేదికలో అనేక విస్తుపోయే అంశాలు ఉన్నాయి.
‘ఎస్’ క్యూబ్ స్కెచ్…
సిద్ధిపేట జిల్లాలో నర్మెట్ట ఉంది. గత ప్రభుత్వంలో అత్యంత కీలకమైన స్థానంలో హరీష్ రావు ఉన్నారు. ఆయన సిద్దిపేట జిల్లాకు చెందినవారు కాబట్టి నర్మెట్ట ప్రాంతంలో ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ నిర్మించాలని నిర్ణయించారు. ఇందులో హరీష్ రావు పాత్ర ఎంత అనే విషయం కంటే… ఫ్యాక్టరీ రావడం వల్ల ఆ ప్రాంతానికి ఎంతో ఉపయోగం జరుగుతుందని చెప్పి అప్పటి కీలకమైన ముగ్గురు అధికారులు స్కెచ్ వేశారు. ప్రీ యూనిక్ కంపెనీతో కుమ్మక్కై ఇవన్నీ చేసినట్లు అసోసియేషన్ చెబుతోంది. అప్పటి ఎండీ సురేందర్, జనరల్ మేనేజర్ సుధాకర్ రెడ్డి, ప్రాజెక్ట్స్ మేనేజర్ శ్రీకాంత్ రెడ్డి… వీరు ముగ్గురు (త్రిబుల్ ‘ఎస్’) ఫ్యాక్టరీ ఏర్పాటు చేసేందుకు అవసరమైన వ్యూహాన్ని సిద్ధం చేశారు. ప్రతి జిల్లాకు ఒక ఆయిల్ పామ్ ఫ్యాక్టరీని నిర్మించాలని అనుకున్నప్పుడు… నర్మెట్టలో మెగా ఫ్యాక్టరీ అవసరం ఏంటని అసోసియేషన్ నాయకులు నిలదీస్తున్నారు. మెగా దోపిడీ చేయడం కోసమే ఇంత పెద్ద మొత్తంలో ఫ్యాక్టరీ నిర్మిస్తున్నారని వారు అంటున్నారు.
అసోసియేషన్ నివేదికలోని అంశాలు…
- గత సంవత్సరం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తప్ప మిగతా అన్ని తెలంగాణ జిల్లాల్లో పండిన ఆయిల్ పామ్ గెలలు 1600 టన్నులు. ఈ సంవత్సరం ఒక 15,000 టన్నులు రావచ్చు. అంటే ఆ ఫ్రూట్ తో సిద్దిపేట ఫ్యాక్టరీ ఒక వారం మాత్రమే నడిపించే పరిస్థితి ఉంటుంది. ఆ తర్వాత అది ఏమవుతుంది? అధికారులు మాత్రం చాలా రోజులు నడుస్తుందని గొప్పలు చెప్పుకోవటానికి రంగం సిద్ధం చేస్తున్నారు.
- అక్కడ ఏమాత్రం అవసరం లేకపోయినప్పటికీ రూ. 33 కోట్లతో మల్టిపుల్ ఎఫెక్టివ్ ఎవాపరేటర్ (ఎంఈఈ)… అలాగే రూ. 50 కోట్లతో కో జనరేషన్ పవర్ ప్లాంట్ నిర్మిస్తున్నారు. అవసరం లేకపోయినప్పటికీ ఇవి కేవలం కమీషన్ల కోసమే నిర్మిస్తున్నారు. నెలరోజులు కూడా నడవని ఫ్యాక్టరీకి ఇన్ని కోట్లు ఎందుకు ఖర్చు పెడుతున్నారు.
- అక్కడ ఫ్యాక్టరీ పవర్ ప్లాంట్ నడవటానికి ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం నుండి 1600 టన్నుల చెత్త తోలడానికి టెండర్లు పిలిచారు. అక్కడ ఫ్రూట్ చాలదు కాబట్టి అప్పారావుపేట, అశ్వారావుపేట ఫ్యాక్టరీలలో ఏదో సమస్య ఉందని సాకుగా చూపి ఈ ఫ్యాక్టరీలను మూసి వేసే కుట్ర జరుగుతుంది. ఇక్కడి ఫ్రూట్ అంతా టెండర్లు పిలిచి సిద్దిపేటకు తీసుకు వెళ్ళి అక్కడ ఆడించి… సిద్దిపేట మెగా ఫ్యాక్టరీ బ్రహ్మాండం అని ప్రచారం చేసుకుంటారు.
- అశ్వరావుపేట, అప్పారావుపేట నుంచి క్రూడ్ ఆయిల్ అంతా సిద్దిపేటకే తీసుకువెళ్లి అక్కడ రిఫైనరీ పెడతారు. దీనివల్ల అనవసర ఖర్చు తప్ప ఏం లాభం? పరిస్థితులను బట్టి అక్కడక్కడ చిన్న ఫ్యాక్టరీలను పెట్టుకోవచ్చు కదా? మెగా ఫ్యాక్టరీ అని చెప్పి మెగా దోపిడి కోసమా?
- చివరకు అశ్వారావుపేట, అప్పారావుపేట ఫ్యాక్టరీలను నష్టాలతో మూసివేస్తారు. సిద్దిపేట ఫ్యాక్టరీని ప్లాన్ ప్రకారం బినామీ ప్రైవేట్ కంపెనీ పరం చేస్తారు. రాబోయే రోజుల్లో జరిగేది ఇదే.
- మరింత దారుణమైన విషయమేంటంటే తెలంగాణలో (సిద్దిపేట కూడా కలిపి) అన్ని ఆయిల్ ఫెడ్ నర్సరీలలో 7 లక్షల ఆయిల్ పామ్ మొక్కలు ఉన్నాయి. అక్కడి రైతులు తోటలు వేయటం లేదని... వాటినన్నిటినీ భద్రాద్రి కొత్తగూడెంకు తరలించడానికి టెండర్లు పిలిచారంటే విషయం అర్థం చేసుకోవచ్చు. చివరకు అధికారులందరూ కలిసి ఆయిల్ ఫెడ్ ను ఏమి చేస్తారో చూడాలి?
- సిద్దిపేట ఫ్యాక్టరీ ప్రస్తుత కెపాసిటీ 30 టీపీహెచ్. దీన్ని భవిష్యత్ లో 120 టీపీహెచ్ కు పెంచాలనే ఉద్దేశంతో వందల కోట్లు ఖర్చు చేస్తున్నారు. టీపీహెచ్ అంటే ఫ్యాక్టరీ ఒక గంటకు ఒక టన్ను ఆయిల్ పామ్ గెలలు క్రష్ చేసే సామర్థ్యం. అంటే 30 టీపీహెచ్ × 24 గంటలు… అంటే ఒక రోజుకు 720 టన్నులు ప్రాసెస్ చెయ్యగలదు. దీని అంతరాయాలు పోను రోజుకి 20 గంటలకు లెక్కించినా 600 టన్నులు ప్రాసెస్ చేస్తుంది.
- ఇంతకన్నా తక్కువ సామర్ధ్యం అనగా రోజుకు 300 టన్నుల వరకే మిల్లు నడిస్తే… పవర్, లేబర్, మెషినరీ అరుగుదల తదితర విషయాల్లో నష్టం వస్తుంది. సామర్థ్యం కన్నా తక్కువ గెలలు ఆడితే ఓఈఆర్ మీద ప్రభావం పడుతుందని గతంలో హైకోర్టులో వేసిన అఫిడవిట్ లో స్వయంగా ఆయిల్ ఫెడ్ ఎండీనే స్పష్టం చేశారు.
- వాస్తవంగా నర్మెట్టలో 30 టీపీహెచ్ కాకుండా 5 లేదా 10 టీపీహెచ్ మిల్లు కట్టి… గద్వాల్ జిల్లా బీచుపల్లిలో కూడా మరొకటి కట్టడం జరగాలి. నర్మెట్టలో నిర్మించడం వల్ల చాలా పెద్ద తప్పిదం జరిగింది. దానిని కప్పిపుచ్చడానికే పెద్ద డ్రామా నడుస్తోంది. ఈ పెద్ద సినిమాకు డైరెక్టర్, కథ, స్క్రీన్ ప్లే (ఒక్క నిర్మాత తప్ప) అన్నీ ఒక ప్రవేట్ కంపెనీ, దానికి అప్రకటిత సీఈఓగా ఆయిల్ ఫెడ్ అధికారి శ్రీకాంత్ రెడ్డి మొత్తం వ్యవహారం నడిపించారు.
- అశ్వారావుపేటలో 2005లో మొదటిగా కట్టిన మిల్లు 5 టీపీహెచ్ నే. మరో ముఖ్య విషయం హారిజంటాల్ టెక్నాలజీ కన్నా ఇప్పుడు కట్టే వర్టికల్ పద్దతిలో తక్కువ సామర్థ్యం మిల్లు కట్టడం చాలా సులభం. 5 ఎకరాలు… 30 కోట్లు ఉంటే చాలు. మనకు నర్మెట్ట లాంటి 300 కోట్ల ఆయిల్ పామ్ ఫ్యాక్టరీలు అవసరం లేదు.