- ఎన్‌హెచ్‌ఆర్‌సీకి అడ్వకేట్ శివ ఫిర్యాదు
- రిటైర్డ్ జడ్జితో విచారణ జరిపాలని డిమాండ్
- తెనాలి సంఘటనపై నిరసన వెలువ
సహనం వందే, ఢిల్లీ:
తెనాలిలో దళితులపై పోలీసుల దాష్టీకానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. తెనాలిలో ముగ్గురు దళితులను లాఠీలతో దారుణంగా హింసించి, బూటు కాలుతో తన్ని దాడి చేయడంపై హైదరాబాద్‌కు చెందిన హైకోర్ట్ న్యాయవాది సీలోజు శివకుమార్ జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్‌హెచ్‌ఆర్‌సీ)కు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఆయన బుధవారం ఢిల్లీలో కమిషన్ సభ్యురాలు విజయభారతికి వినతిపత్రం అందజేశారు. ఆర్టికల్ 21 ప్రకారం జీవించే హక్కు, వ్యక్తిగత స్వేచ్ఛ, ఆర్టికల్ 14 ప్రకారం సమానత్వం, ఆర్టికల్ 22(1) ప్రకారం కస్టడీలో రక్షణ చర్యలను ఉల్లంఘించినట్లు శివకుమార్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఇంతకీ ఏం జరిగిందంటే..?
గత నెల 27న జాన్ విక్టర్, రాకేష్, బాబూలాల్ అనే ముగ్గురు వ్యక్తులు వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న చిరంజీవిపై దాడి చేశారని ఆరోపిస్తూ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ క్రమంలోనే వారిని ఐతానగర్ ప్రాంతానికి తీసుకెళ్లి శారీరకంగా శిక్షించినట్లు తెలుస్తోంది.

టూ టౌన్ సీఐ రాములు నాయక్, త్రీ టౌన్ సీఐ ఎస్ రమేష్ బాబు నడిరోడ్డు మీద వారిని అరికాళ్లపై లాఠీలతో అమానుషంగా కొట్టిన వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. అయితే వారిలో ఒకరు దెబ్బలకు తాళలేక కాళ్లు ముడుచుకోగా… సీఐ రాముల నాయక్ బూటు కాళ్లతో తొక్కిపట్టుకున్నారు.
నిందితుల్లో ఇరువురు ఎస్సీ సామాజిక వర్గానికి, మరొకరు మైనార్టీ వర్గానికి చెందిన వారుగా గుర్తించారు. నిందితులను అదుపులోకి తీసుకొని కోర్టు ముందు హాజరు పరిచి శిక్ష అమలయ్యేలా చర్య తీసుకోవాలి కానీ… ఈ రకంగా దాడికి దిగడం ఏంటని సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. ‘తప్పు చేసినా వారిని కొట్టే హక్కు పోలీసులకు లేదంటూ’ విమర్శలు వస్తున్నాయి.
శివకుమార్ వినతి…
న్యాయవాది సీలోజు శివ కుమార్ తన ఫిర్యాదులో జాతీయ మానవ హక్కుల కమిషన్‌ను ఈ కింది చర్యలు తీసుకోవాలని కోరారు.
- ఘటనపై ఆంధ్రప్రదేశ్ డీజీపీ నుంచి నివేదికను కోరాలి.
- స్వతంత్ర దర్యాప్తు సంస్థ లేదా రిటైర్డ్ జడ్జితో విచారణ జరిపించాలి.
- తప్పు చేసిన పోలీసు అధికారులను సస్పెండ్ చేసి, ఐపీసీ నిబంధనల ప్రకారం ప్రాసిక్యూట్ చేయాలి.
- బాధితులకు రాజ్యాంగ హక్కుల ఉల్లంఘన కింద పరిహారం అందించాలి.
- అన్ని పోలీస్ స్టేషన్‌లలో సీసీటీవీ నిఘా ఏర్పాటు చేయాలి.