- సీబీఐ ఆదేశంతో ఐదుగురు సభ్యులతో కమిటీ!
- కళ్లు చెదిరే కోట్ల అక్రమాస్తులతో హైదరాబాదులో లగ్జరీ లైఫ్
- గేటెడ్ కమ్యూనిటీలో 15 కోట్ల విలువైన మూడు ఫ్లాట్లు
- పది ఎకరాల విస్తీర్ణంలో 30 కోట్ల విలువైన ఫామ్‌హౌస్
- సొంత జిల్లాలో కోట్ల విలువైన 30 ఎకరాల భూమి
- వివిధ వ్యాపారాల్లో దాదాపు పది కోట్ల పెట్టుబడులు
- జేఎన్టీయూలో రూ. 52 కోట్ల గల్లంతు సూత్రధారి అతడే
- కేంద్ర పరిశోధన సంస్థల కోట్ల నిధుల గోల్మాల్ పాత్రధారి
సహనం వందే, హైదరాబాద్:
హైదరాబాద్ జేఎన్టీయూలో గత ప్రభుత్వ హయాంలో చక్రం తిప్పిన ఓ మాజీ అధికారి బండారం ఇప్పుడు బట్టబయలవుతోంది. యూనివర్సిటీని ఆయన అక్రమాస్తులు కూడబెట్టే ఏటీఎంలా మార్చేశారనే విమర్శలు గట్టిగా వినిపిస్తున్నాయి. కోట్ల రూపాయల అవినీతి జరిగిందంటూ సీబీఐకి అందిన ఫిర్యాదు ఇప్పుడు వర్సిటీ వర్గాల్లో తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తోంది. అసలు ఆ మాజీ అధికారి ఎవరు? ఆయన హయాంలో తెరవెనుక ఏం జరిగింది? ప్రభుత్వ నిధులను ఎలా స్వాహా చేశారు? అనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు చూద్దాం.
కళ్లు చెదిరే ఆస్తులు…
హైటెక్ సిటీకి కొద్ది దూరంలో అత్యంత ఖరీదైన గేటెడ్ కమ్యూనిటీలో మూడు ప్లాట్లు. ఒక్కో ప్లాట్ విలువ ఐదు కోట్లు. మూడింటి విలువ కలిపి పదిహేను కోట్లు. నగర శివారులో దాదాపు పది ఎకరాల విస్తీర్ణంలో ఫామ్‌హౌస్. దాని విలువ సుమారు ముప్పై కోట్లు. హైదరాబాద్‌లో మరో ఆరు చోట్ల ఖరీదైన ప్లాట్లు. ఒక్కోటి మూడు వందల గజాలు. ఒక్కో ప్లాట్ విలువ రెండు నుంచి మూడు కోట్లు. ఇక వ్యాపారాల్లో పెట్టుబడులు దాదాపు పది కోట్లు. సొంత జిల్లాలో మరో 30 ఎకరాల భూమి. ఈ ఆస్తుల వివరాలు వింటే ఏమనిపిస్తుంది? ఆయన ఒక బడా వ్యాపారవేత్త అనుకుంటారు కదా. కానీ ఆయన హైదరాబాద్ జేఎన్టీయూ ప్రొఫెసర్. ఆ యూనివర్సిటీకి మాజీ అధికారి. ఒక ప్రొఫెసర్ జీవితాంతం కష్టపడినా ఈ స్థాయిలో ఇన్ని కోట్ల రూపాయల విలువైన ఆస్తులు సంపాదించగలరా? కానీ ఇక్కడ పేర్కొన్న ఆస్తులు ఆయనవేనంటే నమ్మగలరా?

గత ప్రభుత్వ హయాంలో అడ్డగోలు దోపిడీ…
గత ప్రభుత్వ హయాంలో నియమితుడైన జేఎన్టీయూ టాప్ ఫైవ్ అధికారుల్లో ఆయన ఒకరు. ఇంకా చాలా సర్వీసు ఉండగానే ఇన్ని కోట్ల విలువైన ఆస్తులు ఎలా సమకూరాయి? ఆయన ఆదాయ వనరులేమిటి? పదవిలోకి రాకముందు ఉన్న ఆస్తులెన్ని? ఆ తర్వాత కొనుగోలు చేసినవెన్ని? ఇవే ఇప్పుడు ప్రధాన ప్రశ్నలు. ఇంతకీ ఈ వ్యవహారం వెలుగులోకి ఎలా వచ్చింది? జేఎన్టీయూలో ఆర్థిక అవకతవకలు జరిగాయంటూ కే.పీ. భాగ్య వెంకట కుమార్ అనే వ్యక్తి నేరుగా కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐకి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన సీబీఐ… జేఎన్టీయూ చీఫ్ విజిలెన్స్ అధికారికి, రిజిస్ట్రార్‌కు లేఖ రాసింది. ఫిర్యాదులో పేర్కొన్న అంశాలను క్షుణ్ణంగా పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని, సమగ్ర విచారణ అనంతరం నివేదిక అందించాలని కోరినట్లు సమాచారం.
ఐదుగురు సభ్యులతో ఉన్నతస్థాయి కమిటీ?
సీబీఐ నుంచి వచ్చిన ఆదేశాలతో జేఎన్టీయూ యంత్రాంగం అప్రమత్తమైంది. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపేందుకు ఐదుగురు సభ్యులతో ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. అయితే ఈ కమిటీలో అదే యూనివర్సిటీకి చెందిన అధికారులను నియమిస్తే పారదర్శకతపై సందేహాలు తలెత్తవచ్చని యంత్రాంగం భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే యూనివర్సిటీకి సంబంధం లేని బయటి ప్రముఖులు, నిపుణులతో కమిటీని ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. ఆర్థిక వ్యవహారాలు, పరిపాలన, పరిశోధన ప్రాజెక్టులు, పదోన్నతులు, టెండర్లకు సంబంధించిన అంశాలను ఈ కమిటీ పరిశీలించాల్సి ఉంటుంది. ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ అధికారి పాత్రతోపాటు, ఆయనకు సహకరించినట్లు ఆరోపణలు ఉన్న ఇతరుల వ్యవహారాలనూ పరిశీలించాల్సి ఉంటుంది. కమిటీ సమర్పించే నివేదికను తిరిగి సీబీఐకి పంపించనున్నారు. ఈ విచారణలో ఎలాంటి ఆధారాలు బయటపడతాయి? ఎవరి పాత్ర ఎంతవరకు ఉందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
ఆడిట్లో అనేక అభ్యంతరాలు…
గత ప్రభుత్వ హయాంలో, అంటే 2023-24 వరకు జరిగిన ఆర్థిక లావాదేవీలపై నిర్వహించిన ఆడిట్లో అనేక అభ్యంతరాలు నమోదయ్యాయి. సరైన ఆధారాలు, బిల్లులు, వోచర్లు లేకుండా ఖర్చు చేసినట్లు గుర్తించిన మొత్తం అక్షరాలా 52 కోట్లు. ఇక మరో తీవ్రమైన ఆరోపణ పరిశోధన ప్రాజెక్టుల నిధుల వినియోగానికి సంబంధించింది. పరిశోధన పరికరాలు కొనుగోలు చేసినట్లు రికార్డుల్లో చూపించి, వాస్తవంగా వాటిని కొనుగోలు చేయలేదన్నది ప్రధాన ఆరోపణ. కొంతమందికి ప్రొఫెసర్ హోదాలు కల్పించడంలో నిబంధనలు పాటించలేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. అలాగే యూనివర్సిటీలో భారీ నిర్మాణ పనులు, వివిధ కాంట్రాక్టుల కేటాయింపుల్లోనూ గోల్మాల్ జరిగిందన్న ఆరోపణలు ఉన్నాయి. అంతేకాదు, ఆ మాజీ అధికారి కార్యాలయ సుందరీకరణ, పునరుద్ధరణ పేరుతో లక్షలాది రూపాయలు ఖర్చు చేశారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి.
సహకరించినవారెవరు?
ఈ వ్యవహారంలో మరో ఆసక్తికరమైన కోణం ఆ మాజీ అధికారికి సహకరించిన వ్యక్తుల పాత్ర. ఒక కీలక అధికారి ఒక్కడే ఇన్ని వ్యవహారాలను నిర్వహించడం సాధ్యమేనా? టెండర్ల ప్రక్రియలో సహకరించినవారెవరు? అక్రమాలు బయటపడకుండా అడ్డుకున్నవారు ఎవరు? మాజీ అధికారికి కొంతమంది అధికారులు అండగా నిలిచారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అంతేకాదు, అక్రమాలు బయటకు రాకుండా చూసేందుకు కొంతమందికి ఖరీదైన ఫ్లాట్లు, కార్లు బహుమతులుగా ఇచ్చారన్న సంచలన ఆరోపణలు కూడా ఉన్నాయి. ప్రత్యేక కమిటీ విచారణలో ప్రభుత్వ నిధుల దుర్వినియోగంపై ఆధారాలు లభిస్తే తదుపరి దర్యాప్తు మరింత కీలకంగా మారుతుంది. అవసరాన్ని బట్టి సీబీఐతోపాటు ఆదాయపు పన్ను శాఖ, అవినీతి నిరోధక శాఖ వంటి సంస్థలు కూడా రంగంలోకి వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు అందరి దృష్టి ఐదుగురు సభ్యుల కమిటీపై ఉంది. విచారణ నిష్పక్షపాతంగా జరుగుతుందా? ఆస్తుల వెనుక ఉన్న ఆదాయ వనరులు తేలుతాయా? తెరవెనుక సహకరించిన అధికారుల పాత్ర బయటపడుతుందా? అక్రమాలు బయట పడితే జైలు శిక్ష తప్పదని అంటున్నారు… ఏమి జరుగుతుందో చూడాలి.