- కొనుగోలు ధరే ప్రధాన అడ్డంకి
- ఛార్జింగ్ కేంద్రాల కొరత
- చైనా దూకుడు.. ప్రపంచానికి పోటీ
సహనం వందే, హైదరాబాద్:
ఒకప్పుడు కారు కొనాలంటే మైలేజీ ఎంత వస్తుంది? పెట్రోల్ ఖర్చు ఎంత? అని ఆలోచించేవాళ్లం. ఇప్పుడు మరో ప్రశ్న వచ్చి చేరింది. ఎలక్ట్రిక్ కారు కొనాలా? లేక పెట్రోల్ కారే మంచిదా? ఎలక్ట్రిక్ కార్లకు శబ్దం తక్కువ. పొగ కాలుష్యం తక్కువ. నిర్వహణ ఖర్చులు కూడా తక్కువగా ఉండే అవకాశం ఉంది. అయినా ప్రపంచవ్యాప్తంగా వీటి వినియోగం అనుకున్నంత వేగంగా పెరగడం లేదు. అసలు సమస్య ఎక్కడుంది? సాంకేతికతలోనా? ధరలోనా? ఛార్జింగ్ సదుపాయాల్లోనా? లేక వినియోగదారుల ఆలోచనా విధానంలోనా?
కొత్త కార్లలో 25 శాతం వాటా!
ఎలక్ట్రిక్ కార్లు పర్యావరణానికి మేలు చేయడంతోపాటు నిర్వహణ ఖర్చులను తగ్గించే ప్రత్యామ్నాయంగా మారుతున్నాయి. అయినా వీటి వినియోగం ఆశించిన స్థాయిలో పెరగడం లేదు. ప్రపంచ ఆర్థిక వేదిక గణాంకాల ప్రకారం, 2025లో ప్రపంచవ్యాప్తంగా అమ్ముడైన కొత్త కార్లలో నాలుగింట ఒక వంతు విద్యుత్, హైబ్రిడ్ వాహనాలే. అయితే రోడ్లపై తిరుగుతున్న మొత్తం కార్లలో వీటి వాటా కేవలం ఐదు శాతమే. పాత కార్ల స్థానంలో కొత్తవి రావడానికి సమయం పడుతుండటంతో రవాణా వ్యవస్థలో మార్పునకు దాదాపు రెండు దశాబ్దాలు పట్టవచ్చని నిపుణుల అంచనా.
ధర.. కొనుగోలుదారులకు భారమే!
ఎలక్ట్రిక్ కార్ల కొనుగోలులో ప్రధాన అడ్డంకి ధర. పెట్రోల్ కార్లతో పోలిస్తే వీటి ప్రారంభ ధర ఎక్కువగా ఉండటం వినియోగదారులను వెనక్కి లాగుతోంది. అయితే ఇంట్లో ఛార్జింగ్ చేసుకునే అవకాశం ఉంటే ప్రయాణ ఖర్చు, నిర్వహణ వ్యయాలు తగ్గుతాయి. మరోవైపు ఛార్జింగ్ కేంద్రాల కొరత కూడా సమస్యగా మారింది. ముఖ్యంగా సుదూర ప్రయాణాల్లో కేంద్రాలు అందుబాటులో ఉంటాయా? ఎంతసేపు వేచి చూడాలి? అనే సందేహాలు వినియోగదారులను వెంటాడుతున్నాయి. అపార్ట్మెంట్లలో ప్రత్యేక ఛార్జింగ్ సదుపాయాలు ఏర్పాటు చేసుకోవడం కూడా సవాలుగా మారుతోంది.
బ్యాటరీ సాంకేతికతలో కొత్త మార్పులు!
ఎలక్ట్రిక్ కార్ల భవిష్యత్తును నిర్ణయించేది బ్యాటరీ సాంకేతికతే. తక్కువ సమయంలో ఎక్కువ ఛార్జింగ్, ఎక్కువ ప్రయాణ దూరం అందించే బ్యాటరీల అభివృద్ధిపై పరిశోధనలు సాగుతున్నాయి. హార్వర్డ్ విశ్వవిద్యాలయ నిపుణురాలు ఎలైన్ బక్బర్గ్ వివరాల ప్రకారం, చైనాలోని కొన్ని అత్యాధునిక వాహనాల్లో పది నుంచి తొంభై ఐదు శాతానికి పైగా ఛార్జింగ్‌ను ఐదు నుంచి పది నిమిషాల్లో పూర్తిచేసే సాంకేతికత అందుబాటులోకి వస్తోంది.
చైనా.. నార్వే ప్రత్యేక నమూనాలు!
విద్యుత్ కార్ల వినియోగంలో చైనా దూసుకెళ్తోంది. ప్రభుత్వ ప్రోత్సాహకాలు, తక్కువ ధరల మోడళ్లు, బ్యాటరీ తయారీలో పెట్టుబడులు అక్కడి మార్కెట్‌ను విస్తరిస్తున్నాయి. కొత్త కార్ల అమ్మకాల్లో విద్యుత్, హైబ్రిడ్ వాహనాల వాటా దాదాపు సగానికి చేరిందని నిపుణులు పేర్కొన్నారు. మరోవైపు నార్వేలో కొత్త కార్ల అమ్మకాల్లో పూర్తిగా బ్యాటరీతో నడిచే వాహనాల వాటా తొంభై ఐదు శాతాన్ని మించింది. ఛార్జింగ్ సదుపాయాలు, ప్రభుత్వ ప్రోత్సాహకాలు, ప్రజల్లో పెరిగిన నమ్మకం ఇందుకు కారణాలు. ఈ దేశాల అనుభవాలు ఇతర ప్రభుత్వాలకు మార్గదర్శకంగా నిలుస్తున్నాయి.
ప్రభుత్వ విధానాలే భవిష్యత్తును నిర్ణయిస్తాయా?
విద్యుత్ కార్ల విస్తరణకు ప్రభుత్వ విధానాలు, మెరుగైన విద్యుత్ సరఫరా, ఛార్జింగ్ కేంద్రాలు అవసరం. పెట్రోల్ ధరలు పెరిగినప్పుడు ప్రత్యామ్నాయంగా వీటిపై ఆసక్తి పెరుగుతోందని నిపుణులు చెబుతున్నారు. అయితే ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే 130 నుంచి 140 కోట్ల కార్లు రోడ్లపై ఉన్నాయి. వాటన్నింటినీ వెంటనే విద్యుత్ వాహనాలతో భర్తీ చేయడం సాధ్యం కాదని బోర్గ్‌వార్నర్ సంస్థకు చెందిన పాల్ ఫారెల్ అభిప్రాయపడ్డారు. మొత్తంగా ధరలు తగ్గడం, బ్యాటరీ సామర్థ్యం పెరగడం, ఛార్జింగ్ సదుపాయాలు విస్తరించడం కీలకం. పెట్రోల్, డీజిల్ కార్లు పూర్తిగా కనుమరుగవుతాయా? లేక విద్యుత్ కార్లతోపాటు కొనసాగుతాయా? అన్నది కాలమే తేల్చాలి.