నిమ్స్‌లో వందల కోట్ల అవినీతి – డాక్టర్ల అక్రమాలపై ఏసీబీ పంజా

ACB Raids on NIMS
  • లంచాల భాగోతం బట్టబయలు!
  • 100 కోట్ల లక్ష్మీ భాస్కర్ వ్యవహారంతో…
  • క్యాంటీన్, మెడికల్ స్టోర్సులో దాడులు
  • ఏసీబీ సోదాలు… రికార్డుల స్వాధీనం
  • టాప్ 10 కీలక అధికారుల పాత్రపై అనుమానాలు

సహనం వందే, హైదరాబాద్:

హైదరాబాద్‌లోని ప్రముఖ నిమ్స్ ఆసుపత్రిలో భారీ అవినీతి అక్రమాలు వెలుగులోకి రావడం తీవ్ర కలకలం రేపుతోంది. నిమ్స్ పరిపాలనా విభాగంతో పాటు ప్రధాన విభాగాల్లో అవినీతి మూలాలు ఏ స్థాయిలో వేళ్లూనుకున్నాయో ఏసీబీ అధికారుల తనిఖీల్లో స్పష్టమవుతోంది. వైద్య సేవలు పొందడానికి వచ్చే పేద, మధ్యతరగతి రోగుల అవసరాలను ఆసరాగా చేసుకుని, అక్కడ జరుగుతున్న అక్రమాలపై ఏసీబీ అధికారులు ఉక్కుపాదం మోపారు.

డాక్టర్ లక్ష్మీ భాస్కర్ వ్యవహారంలో ముమ్మర సోదాలు
నిమ్స్ ఆసుపత్రికి చెందిన డాక్టర్ లక్ష్మీ భాస్కర్ వ్యవహారంలో ఏసీబీ అధికారులు తమ సోదాలను మరింత తీవ్రతరం చేశారు. గతంలో 100 కోట్లు అక్రమాలకు పాల్పడినట్లు వచ్చిన ఫిర్యాదులు, సేకరించిన ప్రాథమిక వివరాల ఆధారంగా అధికారులు గురువారం ఆసుపత్రి ఆవరణలో తనిఖీలు చేపట్టారు. నిమ్స్ అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ చేరుకున్న ఏసీబీ బృందం, అక్కడ కీలక రికార్డులను నిశితంగా పరిశీలిస్తోంది. ఆసుపత్రి నిర్వహణ, పలు కాంట్రాక్టుల కేటాయింపులు, అంతర్గత వ్యవహారాల్లో జరిగాయని భావిస్తున్న అక్రమాలపై అధికారులు లోతుగా విచారణ జరుపుతున్నారు.

ప్రతి నెలా 50 లక్షల లంచాలు
ఆసుపత్రి పరిధిలోని క్యాంటీన్లతో పాటు మెడికల్ స్టోర్ల నిర్వాహకుల నుంచి ప్రతి నెలా పెద్ద ఎత్తున లంచాలు వసూలు చేస్తున్నట్లు ఏసీబీ ప్రాథమిక విచారణలో తేలింది. దాదాపు 50 లక్షల రూపాయల వరకు లంచాల రూపంలో కీలక స్థానాల్లో ఉన్న కొంతమంది అధికారులకు చేరుతున్నట్లు తెలుస్తోంది. రోగులకు, వారి సహాయకులకు సేవలు అందించాల్సిన క్యాంటీన్లు, మెడికల్ స్టోర్ల నుంచి ఈ స్థాయిలో అక్రమంగా డబ్బులు వసూలు చేయడం అధికారులను సైతం విస్మయానికి గురిచేసింది.

ఏకకాలంలో మూడంచెల సోదాలు
ఈ తనిఖీల్లో కేవలం ఏసీబీ మాత్రమే కాకుండా ఇతర ప్రభుత్వ విభాగాలు కూడా భాగస్వామ్యమయ్యాయి. ఏకకాలంలో ఏసీబీ, ఫుడ్ సేఫ్టీ, డ్రగ్ కంట్రోల్ విభాగానికి చెందిన అధికారులు సంయుక్తంగా రంగంలోకి దిగి సోదాలు నిర్వహించారు. ఒకవైపు ఏసీబీ అధికారులు అడ్మినిస్ట్రేటివ్ రికార్డులు పరిశీలిస్తుండగా, మరోవైపు నలుగురు సభ్యులతో కూడిన ఏసీబీ అధికారుల బృందం నిమ్స్ క్యాంటీన్‌లో ముమ్మరంగా తనిఖీలు చేపట్టింది. ఫుడ్ సేఫ్టీ అధికారులు క్యాంటీన్ ఆహార ప్రమాణాలను కూడా పరిశీలించారు.

సర్జికల్, మెడికల్ స్టోర్లలో దాడులు
మరొకవైపు, సర్జికల్ స్టోర్‌లో నలుగురు డ్రగ్ ఇన్‌స్పెక్టర్ల బృందం విస్తృతంగా తనిఖీలు చేపట్టింది. అక్కడ నిల్వ ఉంచిన మందులు, వైద్య పరికరాల నాణ్యత, స్టాక్ రిజిస్టర్లు, సరఫరా నివేదికలను అధికారులు క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని కీలక స్థానాల్లో పనిచేస్తున్న కొంతమంది అధికారులకు మెడికల్ స్టోర్స్, సర్జికల్ స్టోర్స్, క్యాంటీన్ల నుంచి క్రమం తప్పకుండా లంచాలు అందుతున్నట్లు ఆరోపణలు రావడంతో వాటికి సంబంధించిన అన్ని ఆధారాలను, కీలక రికార్డులను అధికారులు స్వాధీనం చేసుకుంటున్నారు.

ఆసుపత్రి వర్గాల్లో వణుకు…
ప్రభుత్వ ఆసుపత్రుల్లో కీలక బాధ్యతల్లో ఉంటూ కాంట్రాక్టర్లు, స్టోర్ నిర్వాహకుల నుంచి లంచాలు తీసుకోవడంపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది. ఏసీబీ, డ్రగ్ కంట్రోల్, ఫుడ్ సేఫ్టీ అధికారుల ఏకకాల దాడులతో నిమ్స్‌లోని అవినీతి అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. స్వాధీనం చేసుకున్న రికార్డుల ఆధారంగా రాబోయే రోజుల్లో లంచాల బాగోతంలో ప్రమేయం ఉన్న మరికొందరు అధికారులపై కఠిన చర్యలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.

టాప్ 10 అధికారుల పాత్ర ఎంత?
నిమ్స్ ఆసుపత్రిలో కీలకమైన హెచ్ఓడీలు, వివిధ ముఖ్యమైన విభాగాలను పర్యవేక్షించే కొందరు వైద్య అధికారుల పాత్రపై తీవ్రమైన అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆసుపత్రిలో ఏ చిన్న పని జరగాలన్నా వీరు చక్రం తిప్పుతారనే ప్రచారం ఉంది. ఈ అక్రమాల పరంపరలో నిమ్స్ ఉన్నత స్థానాల్లో ఉన్న టాప్ 10 అధికారులలో కొందరి పాత్ర కూడా ఉందనే చర్చ గట్టిగా నడుస్తోంది. వారి అండదండలు లేనిదే ఇంత పెద్ద స్థాయిలో అవినీతి జరిగే అవకాశమే లేదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. కీలక స్థానాల్లో కూర్చుని వ్యవస్థను శాసిస్తున్న ఈ పెద్దలు, తమ పదవులను అడ్డం పెట్టుకుని కోట్ల రూపాయలకు పడగలెత్తారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *