అమెజాన్‌లో జాబ్స్ సునామీ – 3 లక్షలకుపైగా కొత్త ఉద్యోగాలు

Amazon Jobs Sunami
  • పండగ సీజన్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు
  • గంటకు 1700 రూపాయల వేతనం
  • లాజిస్టిక్స్ రంగంలో తీవ్ర పోటీ
  • తాత్కాలిక సిబ్బందికి శాశ్వత అవకాశాలు

సహనం వందే, హైదరాబాద్:

ఉపాధి కల్పనలో అమెజాన్ సంచలనం సృష్టిస్తోంది. రాబోయే పండగ సీజన్ కోసం ఏకంగా మూడు లక్షలకు పైగా ఉద్యోగాల భర్తీకి ప్రణాళిక సిద్ధం చేసింది. గతేడాయితో పోలిస్తే ఈసారి నియామకాలు 20 శాతం పెరిగాయి. మిగతా రిటైల్, లాజిస్టిక్స్ మార్కెట్లు మందకొడిగా సాగుతున్న వేళ… బ్లూమ్‌బెర్గ్ నివేదికల ప్రకారం ఈ స్థాయిలో ఉద్యోగాలు ప్రకటిస్తున్న ఏకైక దిగ్గజం అమెజాన్ మాత్రమే కావడం విశేషం.

ఆన్‌లైన్ షాపింగ్ యాప్‌లలో ఆఫర్ల మోత…
పండగ సీజన్ వస్తోందంటే చాలు ఆన్‌లైన్ షాపింగ్ యాప్‌లలో ఆఫర్ల మోత మోగిపోతుంటుంది కదా. మరి మనకి నచ్చిన వస్తువులను ఆర్డర్ చేస్తే గడప ముందుకు గంటల వ్యవధిలో తెచ్చిచ్చే డెలివరీ బాయ్స్ వెనుక ఎంత పెద్ద సామ్రాజ్యం ఉంటుందో ఎప్పుడైనా ఆలోచించారా? ఇప్పుడు ఏకంగా మూడు లక్షలకు పైగా ఉద్యోగాలను భర్తీ చేయడానికి ప్రపంచ దిగ్గజ సంస్థ సిద్ధమైంది. మిగతా కంపెనీలన్నీ ఖర్చులకు వెనకాడితే, ఈ ఈకామర్స్ రారాజు మాత్రం కొలువుల జాతర మొదలుపెట్టింది.

Amazon Job Offers

ఉద్యోగులకు భారీ వేతనాల ఆఫర్
అమెరికాలోని సియాటిల్ ప్రధాన కార్యాలయం నుంచి వెలువడిన ప్రకటన ప్రకారం ఇందులో శాశ్వత, పార్ట్‌టైమ్, సీజనల్ కొలువులు అందుబాటులో ఉన్నాయి. ఈ తాత్కాలిక ఉద్యోగులకు భారతీయ కరెన్సీ లెక్కన గంటకు దాదాపు 1700 రూపాయల వరకు చెల్లించనున్నారు. పండగ రద్దీని తట్టుకోవడానికి, డెలివరీ నెట్‌వర్క్‌ను వేగవంతం చేయడానికే ఈ ఆకర్షణీయ వేతనాలు ఇస్తున్నారు. జనవరి వరకు వారానికి కనీసం 30 గంటలు పనిచేసే వారికి వైద్య సదుపాయాలు కల్పిస్తారు. అంతేకాదు శాశ్వత ఉద్యోగులుగా మారే అవకాశాన్ని కూడా కల్పిస్తున్నారు.

రిటైల్ రంగంలో భిన్న పరిస్థితులు
అమెజాన్ దూకుడుగా ముందుకు వెళ్తుంటే వాల్‌మార్ట్, టార్గెట్ కార్పొరేషన్ వంటి రిటైల్ దిగ్గజాలు తమ వివరాలను వెల్లడించడానికి వెనుకాడాయి. ఛాలెంజర్ గ్రే అండ్ క్రిస్మస్ అంచనాల ప్రకారం, మొత్తం రిటైల్ రంగంలో సీజనల్ రిక్రూట్‌మెంట్ గతేడాది ఉన్న 4.5 లక్షల కంటే చాలా తక్కువగా ఉండనుంది. ఆర్థిక మాంద్యం భయాలతో మిగతా కంపెనీలు వెనకడుగు వేస్తుంటే, ఈకామర్స్ రారాజు మాత్రం 3 లక్షల నియామకాలతో తన ఆధిపత్యాన్ని చాటుకుంటూ సాహసోపేతమైన అడుగు వేసింది.

నియామకాల వెనుక ముఖ్య కారణాలు
ఈకామర్స్ ప్లాట్‌ఫారమ్‌లపై వస్తున్న భారీ ఆర్డర్ల ఒత్తిడిని తట్టుకునేందుకే ఈ మానవ వనరులు అవసరమవుతున్నాయి. ఐఫోన్ వంటి ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌లు మొదలుకుని ప్రతి చిన్న వస్తువుపై ఇస్తున్న భారీ తగ్గింపుల వల్ల భారత్, అమెరికా సహా గ్లోబల్ మార్కెట్లలో కొనుగోలుదారులు ఎగబడుతున్నారు. గోడౌన్లలో సరుకులు సర్దడం, ప్యాకింగ్, డెలివరీ విభాగాల్లో ఏ చిన్న పొరపాటు జరగకుండా ఉండేందుకు కొత్త, అనుభవజ్ఞులైన సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇచ్చి రంగంలోకి దింపుతున్నారు.

మార్కెట్ పోకడలు… ప్రభావం
అమెజాన్ అనుసరిస్తున్న ఈ సరికొత్త రిక్రూట్‌మెంట్ విధానం చిన్న స్థాయి కంపెనీలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. మార్కెట్‌లో పోటీని తట్టుకోవాలంటే మిగతా సంస్థలు కూడా తమ వేతనాల తీరును మార్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. లేదంటే సిబ్బంది అమెజాన్ వైపే మొగ్గు చూపే ప్రమాదం ఉంది. ఫలితంగా ఇది రాబోయే రోజుల్లో ఇతర రిటైల్ రంగాల్లో కూడా ఉపాధి అవకాశాలు పెరగడానికి, వేతనాల పెరుగుదలకు దారితీస్తుందని మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

సాంకేతికత… మానవ వనరులు
టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ ఉద్యోగాలు కనుమరుగవుతున్నాయని భావిస్తున్న తరుణంలో ఈ భారీ నియామకాలు నిరుద్యోగ యువతకు ఎంతో కొండంత ఆసరాగా నిలుస్తున్నాయి. అయితే వ్యాపార సంస్థల లాభాల కోసం చేసే ఈ ఏర్పాట్లు సాధారణ కార్మికుల జీవితాల్లో ఎంతవరకు వెలుగులు నింపుతాయనేది ఆలోచించాల్సిన విషయమే. ఈ పండగ సీజన్ ముగిసేసరికి ఈకామర్స్ దిగ్గజం సాధించబోయే లాభాలు ఏ స్థాయిలో ఉంటాయో కాలమే నిర్ణయిస్తుంది.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *