దసరాకు ఎలక్ట్రిక్ కారు – పండుగ సీజన్‌లో ఈవీల సంచలనం

Dasara Offers more on Electrical Vehicles
  • పండుగ వేళ ఎలక్ట్రిక్ వాహనాల జోరు
  • రికార్డు స్థాయి అమ్మకాలతో ధూం ధాం
  • వెనకబడిన పెట్రోల్, డీజిల్ వాహనాలు
  • పర్యావరణ స్పృహతో మొదలైన మార్పు

సహనం వందే, హైదరాబాద్:

పండుగ సీజన్లో ఈసారి రోడ్లపై ఏ వాహనాల సందడి ఎక్కువగా కనిపించిందో తెలుసా? మరేవో కాదండి.. అచ్చంగా ఎలక్ట్రిక్ వాహనాలే! పెట్రోల్ బంకుల చుట్టూ తిరిగే రోజులకు స్వస్తి చెప్పి, జనాలు ఇప్పుడు ఈవీల వైపు ఎలా పరుగులు తీస్తున్నారో చూస్తే నిజంగా ఆశ్చర్యపోవాల్సిందే.

సంప్రదాయ వాహనాల మార్కెట్ ఔట్…
ఈ దసరా పండుగ సీజన్‌లో ఆటోమొబైల్ రంగానికి సంబంధించి ఫాడా విడుదల చేసిన గణాంకాల్లో ఎలక్ట్రిక్ వాహనాలే అసలైన ట్రెండ్ సెట్టర్‌గా నిలిచాయి. సంప్రదాయ వాహనాల మార్కెట్ నెమ్మదించినప్పటికీ, ఈవీల రిటైల్ అమ్మకాలు ఏకంగా 26.78 శాతం దూసుకెళ్లాయి. ఈ నవరాత్రి సమయంలో దేశవ్యాప్తంగా మొత్తం 1.17 లక్షల ఎలక్ట్రిక్ వాహనాలు అమ్ముడయ్యాయి. గత ఏడాది ఇదే సమయంలో ఈ సంఖ్య 92,628 యూనిట్లు మాత్రమే. దీంతో మొత్తం పండుగ సేల్స్‌లో ఈవీల వాటా సుమారు 10.5 శాతానికి ఎగబాకింది.

25 శాతం పెరుగుదలతో ఎలక్ట్రిక్ కార్ల జోరు…
ముఖ్యంగా ఎలక్ట్రిక్ టూ-వీలర్ల విభాగం మార్కెట్‌ను పూర్తిగా శాసించింది. ఈ నవరాత్రుల్లో టూ-వీలర్లు ఏకంగా 33.41 శాతం వృద్ధితో 75,758 యూనిట్లకు చేరుకున్నాయి (గత ఏడాది 56,787 యూనిట్లు). పెట్రోల్ బైకుల నిర్వహణ ఖర్చుకు భయపడి యువత, ఉద్యోగులు ఈవీ స్కూటర్ల వైపే మొగ్గు చూపుతున్నారు. ఇక కుటుంబాలు ఇష్టపడే ఈవీ కార్ల విభాగం కూడా అద్భుత ప్రదర్శన కనబరిచింది. ఈ నవరాత్రుల్లో 12,305 ఎలక్ట్రిక్ కార్లు అమ్ముడయ్యాయి. ఇది గత ఏడాది నమోదైన 9,768 యూనిట్లతో పోలిస్తే 25.97 శాతం ఎక్కువ. మార్కెట్లో కొత్త మోడళ్లు రావడం, తక్కువ మెయింటెనెన్స్ ఉండటంతో కుటుంబాలు వీటి కొనుగోలుకు ముందుకు వస్తున్నాయి.

ఆటోలు… వాణిజ్య వాహనాలు
నగర వీధుల్లో తిరిగే త్రీ-వీలర్ల విభాగంలోనూ ఎలక్ట్రిక్ ఆటోలదే హవా నడిచింది. వీటి రిజిస్ట్రేషన్లు 10.51 శాతం పెరిగి 28,086 యూనిట్లకు చేరాయి. నగరాల్లోని ఆటోల్లో సగానికి పైగా ఇప్పుడు ఎలక్ట్రిక్‌గా మారుతున్నాయి. ఇంధన ఖర్చు తగ్గడం, ప్రభుత్వ సబ్సిడీలు కూడా దీనికి దోహదపడుతున్నాయి. ఇక కమర్షియల్ వెహికల్స్ విభాగంలోనూ ఈవీలు ఆధిపత్యం నిరూపించుకున్నాయి. వాణిజ్య వాహనాల విక్రయాలు ఏకంగా 96 శాతం వృద్ధిని నమోదు చేసి 1,288 యూనిట్లకు చేరడం విశేషం. లాజిస్టిక్స్, రవాణా సంస్థలు ఇంధన భారాన్ని తగ్గించుకోవడానికి ఎలక్ట్రిక్ ట్రక్కులు, వ్యాన్ల వైపు వేగంగా అడుగులు వేస్తున్నాయి.

ఈవీ షోరూమ్‌ల వద్ద కస్టమర్లు బారులు…
సాధారణ షోరూమ్‌లు మామూలుగా ఉన్నప్పటికీ, ఈవీ షోరూమ్‌ల వద్ద కస్టమర్లు బారులు తీరడం ఈ పండుగ ప్రత్యేకతగా నిలిచింది. పెట్రోల్ పై వేల రూపాయలు ఖర్చు చేయడం కంటే ఒక్కసారి ఛార్జ్ చేసుకుని వందల కిలోమీటర్లు ప్రయాణించవచ్చనే ఆలోచనతో మధ్యతరగతి కొనుగోలు ధోరణి మారాయి. డీలర్లు, తయారీదారులు సరికొత్త మోడళ్లను విడుదల చేయడం, సులువైన ఫైనాన్స్, తక్కువ ఈఎంఐ ఆప్షన్లు లభించడం ఈ కొనుగోళ్లకు ఊపునిచ్చాయి. భారతీయ రోడ్లపై పెట్రోల్ పొగలు వదిలే వాహనాల స్థానంలో నిశ్శబ్దంగా దూసుకెళ్లే ఈవీలే భవిష్యత్తు అని ఈ దసరా సేల్స్ నిరూపించాయి.

సంప్రదాయ వాహనాల విక్రయాల క్షీణత
అయితే, ఈవీల జోరు ఒక ఎత్తైతే.. మరోవైపు సంప్రదాయ వాహనాల పరిస్థితి మాత్రం భిన్నంగా కనిపించింది. దేశవ్యాప్తంగా ఓవరాల్ వెహికల్ రిజిస్ట్రేషన్లు గత ఏడాదితో పోలిస్తే 6.52 శాతం మేర తగ్గిపోయాయి. ముఖ్యంగా పెట్రోల్, డీజిల్ ప్యాసింజర్ కార్ల విక్రయాలు పడిపోయాయి. గత ఏడాది నవరాత్రి సమయంలో 2.34 లక్షల యూనిట్ల కార్లు అమ్ముడైతే, ఈసారి ఆ సంఖ్య 21.91 శాతం క్షీణించి 1.82 లక్షల యూనిట్లకు పరిమితమైంది.

పెట్రోల్ బైకులు, స్కూటర్ల అమ్మకాల క్షీణత
కేవలం కార్లే కాకుండా టూ-వీలర్లలో పెట్రోల్ బైకులు, స్కూటర్ల అమ్మకాలు 2.79 శాతం తగ్గి 8‌.34 లక్షల యూనిట్లకు పడిపోయాయి. త్రీ-వీలర్లలో కొద్దిగా మందగమనం కనిపించినప్పటికీ, సంప్రదాయ మార్కెట్ నెమ్మదించిన ఆ నిరాశను ఎలక్ట్రిక్ వాహనాల విప్లవం పూర్తిగా కవర్ చేసి ఆటో రంగానికి కొత్త కళ తెచ్చింది. పెట్రోల్ ధరలు మండుతున్న ఈ రోజుల్లో జనాలు తెలివిగా ఆలోచించి ఎలక్ట్రిక్ వైపు అడుగులు వేస్తున్నారు. అందుకే సంప్రదాయ కార్ల సేల్స్ తగ్గినప్పటికీ, ఈవీలు సరికొత్త చరిత్ర సృష్టించాయి.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *