- ఏఐతో నకిలీ రోగులు, రివ్యూలు
- ఆన్లైన్నే ఆశ్రయిస్తున్న ప్రజలు
- అడ్డుకట్టకు ఎన్ఎంసీ మార్గదర్శకాలు
సహనం వందే, హైదరాబాద్:
గూగుల్‌లో ఫైవ్ స్టార్ రేటింగ్ చూసి, ఆన్లైన్లో అద్భుతమైన రివ్యూలు చదివి ఆస్పత్రికి వెళ్తున్నారా? ఏఐతో సృష్టించిన నకిలీ రోగుల అనుభవాలను చూసి మోసపోతున్నారా? ఇకపై అలాంటి ఆన్లైన్ గిమ్మిక్కులు నడవవు. డిజిటల్ మాధ్యమాల్లో జరిగే ఫేక్ ప్రచారాలపై నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) కఠిన చర్యలకు సిద్ధమైంది. డాక్టర్లు, ఆస్పత్రులు రోగులను ఆకర్షించడానికి వాడుతున్న అడ్డదారులపై చెక్ పెడుతూ సరికొత్త మెడికల్ ఎథిక్స్ నిబంధనలను అమల్లోకి తెచ్చింది.
ఆన్లైన్నే ఆశ్రయిస్తున్న ప్రజలు
చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా వెంటనే గూగుల్‌లో శోధించడం అలవాటుగా మారింది. ఏ డాక్టర్‌కు ఎక్కువ రేటింగ్, ఏ ఆస్పత్రికి మంచి కామెంట్లు వచ్చాయో చూసి అక్కడికి వెళ్తుంటాం. ఇక్కడే కొందరు డాక్టర్లు ఆన్లైన్ ప్రచారాలతో వ్యాపారాన్ని విస్తరించుకుంటున్నారు. అందుకే ఈ డిజిటల్ దందాను అరికట్టేందుకు ఎన్ఎంసీ రంగంలోకి దిగింది. ఇప్పటివరకు వైద్య రంగంలో నేరుగా ఇచ్చే ప్రకటనలపై కొన్ని పరిమితులు ఉండేవి. కానీ ఆన్లైన్ వేదికలు విస్తరించడంతో ప్రచారాల శైలి మారిపోయింది. డాక్టర్లు, ఆస్పత్రులు సామాజిక మాధ్యమాలు, వెబ్సైట్ల ద్వారా రోగులను ఆకర్షిస్తున్నారు. అందుకే ఆన్లైన్ ప్రచారాలను, రోగులను ఆకట్టుకునే మార్గాలను మెడికల్ ఎథిక్స్ పరిధిలోకి తెచ్చారు.

డబ్బులతో రేటింగ్‌లకు చెక్
ఇంటర్నెట్లో కనిపించే ఫైవ్ స్టార్ ర్యాంకింగ్‌లలో కొన్ని నిజమైనవి కావు. ఏజెన్సీలకు డబ్బులు చెల్లించి ర్యాంకింగ్‌లు కొనుగోలు చేసే సంస్కృతి పెరిగింది. ఇలా డబ్బులతో టాప్ ర్యాంకింగ్ తెచ్చుకోవడాన్ని ఎన్ఎంసీ నిషేధించింది. ఇవి రోగులను తప్పుదోవ పట్టిస్తాయని, వైద్య నీతికి విరుద్ధమని స్పష్టం చేసింది. ఫేక్ రివ్యూలను పూర్తిగా నిషేధిస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. నిబంధనలు ఉల్లంఘిస్తే డాక్టర్లు, ఆస్పత్రులపై తీవ్ర చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
రెఫరల్ ఫీజులకు నో
ఒక డాక్టర్ మరో డాక్టర్‌కు లేదా ఆస్పత్రికి రోగులను పంపినప్పుడు కమీషన్లు లేదా రెఫరల్ ఫీజులు తీసుకోవడంపై ఎన్ఎంసీ పూర్తి నిషేధం విధించింది. రోగికి అవసరమైన చికిత్స అందించడమే ధ్యేయంగా ఉండాలి తప్ప కమీషన్ల కోసం రోగులను వేరే చోటికి పంపడం నేరమని తేల్చి చెప్పింది. ఉచిత సేవలు లేదా కమీషన్ల ఆశ చూపి రోగులను ఆకర్షించకూడదు. వైద్య రంగంలోకి ఏఐ సాంకేతికత విస్తృతంగా ప్రవేశించింది. దాని సాయంతో లేని రోగులను సృష్టించి వారి పేరిట నకిలీ టెస్టిమోనియళ్లను తయారు చేస్తున్నారు. వ్యాధి నయమైపోతుందని ఏఐతో వీడియోలు, ఆడియోలు సృష్టించి ప్రచారం చేసుకుంటున్నారు.
నిజమైన సమాచారానికే అనుమతి
ఏఐని ఉపయోగించి రోగుల ఫీడ్‌బ్యాక్‌లను తయారు చేయడం లేదా ఉన్న నిజాలను మార్చడాన్ని ఎన్ఎంసీ పూర్తిగా నిషేధించింది. రోగుల అనుభవాలను కృత్రిమంగా సృష్టించడం వల్ల ప్రజలు తప్పుడు నిర్ణయాలు తీసుకునే ప్రమాదం ఉంది. నిజమైన రోగుల సమాచారాన్ని మాత్రమే, వారి పూర్తి సమ్మతితోనే బహిర్గతం చేయాలి. కొన్ని ఆస్పత్రులు ఇచ్చే అబద్ధపు హామీలు, తప్పుదోవ పట్టించే క్లెయిమ్‌లపై కూడా ఉక్కుపాదం మోపారు. నూటికి నూరు శాతం వ్యాధి నయం చేస్తామని, కొన్ని రోజుల్లోనే ఉపశమనం కలిగిస్తామని ఇచ్చే గ్యారెంటీ ప్రచారాలను నిలిపివేయాలి. వైద్యంలో ఏ చికిత్సకూ నూటికి నూరు శాతం గ్యారెంటీ ఉండదని ఎన్ఎంసీ స్పష్టం చేసింది.
నిజాయితీ వైద్యానికి మేలు
ఈ కొత్త నిబంధనల వల్ల నిజాయితీగా పనిచేసే వైద్యులకు, ఆస్పత్రులకు మేలు జరుగుతుంది. కేవలం ప్రచారాల మీద ఆధారపడి రోగులను ఆకర్షించే వారి ఆటలు ఇకపై సాగవు. డిజిటల్ మాధ్యమాల్లో వైద్య నీతిని పాటించడం వల్ల రోగులకు సరైన సమాచారం అందుతుంది. వైద్యం అనేది లాభాపేక్షతో కూడిన వ్యాపారం కాదని, అదొక పవిత్రమైన సేవ అని ఎన్ఎంసీ మరోసారి గుర్తుచేసింది. ఎన్ఎంసీ నిర్ణయం వల్ల ఆన్లైన్ మోసాలకు అడ్డుకట్ట పడుతుందని భావిస్తున్నారు.