- 9న విక్టరీ వెంకటేష్ ఆదర్శకుటుంబం
- అదేరోజు శ్రీవిష్ణు కామ్రేడ్ కళ్యాణ్ సైతం
- 15న సూపర్ స్టార్ రజనీ జైలర్ ధమాకా
- 16న విజయ్ దేవరకొండ దంపతుల రణబాలి
సహనం వందే, హైదరాబాద్:
ఈసారి దసరా పండుగ సీజన్ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి మంట పుట్టించబోతోందో తెలుసా? ఏకంగా నాలుగు పెద్ద సినిమాలు థియేటర్లలోకి దూసుకొస్తున్నాయి. మరి ఈ రేసులో అసలు విజేత ఎవరు, దేనికి ఎక్కువ హైప్ ఉందో తెలుసుకోవాలని ఉందా? నాలుగు సినిమాలు వస్తున్నా కూడా అనుకున్నంత రేంజ్ లో సందడి ఉందా అంటే డౌటే అనిపిస్తోంది.
వెంకీ మామ త్రివిక్రమ్ కలయిక
అందరి కంటే ముందుగా ఈ నెల 9న విక్టరీ వెంకటేష్ తన ఆదర్శకుటుంబం సినిమాతో బాక్సాఫీస్ బరిలోకి దిగుతున్నాడు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో తనదైన స్టైలిష్ మార్క్ తో పాటు కాస్త క్రైమ్ అంశాలు కూడా కలిపారట. అయితే ఏంటో గానీ ఈ సినిమాకు ఇప్పటివరకు మార్కెట్లో సరైన సందడి మాత్రం కనిపించడం లేదు. నువ్వు నాకు నచ్చావు సినిమా స్థాయిలో దీన్ని ఉంచుకునే పరిస్థితి ఊహించుకునే పరిస్థితి లేదని సినీ విశ్లేషకులు అంటున్నారు.
కనుచూపు మేరలో లేని కామ్రేడ్…
వెంకటేష్ సినిమా వచ్చే రోజునే యంగ్ హీరో శ్రీవిష్ణు నటించిన కామ్రేడ్ కళ్యాణ్ కూడా థియేటర్లలోకి వస్తోంది. నక్సలిజం అనే చాలా తీవ్రమైన నేపథ్యానికి సరదా కామెడీని జోడించి ఈ సినిమా తీశారు. ఐతే ఈ సినిమా అసలు థియేటర్లకు వస్తున్నట్టే చాలా మందికి తెలీని పరిస్థితి నెలకొంది. శ్రీ విష్ణు కామెడీ పండితే మాత్రం సినిమాకు తిరుగుండదని అంటున్నారు.
సూపర్ స్టార్ రజనీ జైలర్ ధమాకా
ఇక పండుగ వారం మధ్యలో అంటే 15న సూపర్ స్టార్ రజనీకాంత్ తన జైలర్ 2 సినిమాతో ఊచకోత కోసేందుకు వస్తున్నాడు. గతంలో భారీ విజయం సాధించిన జైలర్ కి ఇది రెండో భాగం. కుటుంబ కథతో పాటు విపరీతమైన యాక్షన్ థ్రిల్లర్ గా దీనిని మలిచారు. నెల్సన్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా మొదటి భాగం కంటే డబుల్ రేంజ్ లో అలరిస్తుందని చెప్తున్నారు. దసరాకు వచ్చే నాలుగు సినిమాల్లో కాస్తో కూస్తో మంచి హైప్ ఉన్న సినిమా ఇదే అని చెప్పుకోవాలి.
విజయ్ దేవరకొండ రణబాలి సస్పెన్స్
చివరగా 16న రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటించిన రణబాలి ప్రేక్షకుల ముందుకు వస్తోంది. గతంలో టాక్సీవాలా తీసిన రాహుల్ సాంకృత్యాయన్ దర్శకత్వంలో పీరియాడిక్ కథాంశంతో ఈ సినిమా రూపుదిద్దుకుంది. పెద్ద కాంబినేషన్ అయినా కూడా ఎందుకోగానీ ఈ సినిమాపై సైతం ఆశించిన స్థాయిలో అంచనాలు పెరగలేదు. భార్య భర్తలు కలిసి నటిస్తున్నప్పటికీ సినిమాకు హైప్ రాలేదని అంటున్నారు.
ఎవరిది అసలైన గెలుపు
బాక్సాఫీస్ దగ్గర నాలుగు విభిన్నమైన కథలతో వస్తున్న ఈ సినిమాల్లో ఏది హిట్ కొడుతుందో చూడాలి. ప్రేక్షకుల మదిని గెలిచి దసరా విజేతగా ఏ సినిమా నిలుస్తుందో కొద్ది రోజుల్లోనే తేలిపోనుంది. ఏది ఏమైనా పేరున్న హీరో హీరోయిన్లు, దర్శకులు ఉండటంతో ఈ సినిమాలు దసరాకు సందడి చేస్తాయని అంటున్నారు.