బీసీ ఉప-వర్గీక’రణం’ – తెరపైకి సబ్-కేటగిరైజేషన్ డిమాండ్

BC Sub categorisation Demand
  • మరో రిజర్వేషన్ కోసం ఓబీసీల పోరు
  • క్రీమీలేయర్ తొలగించాలన్న డిమాండ్లు
  • వెనుకబడిన వర్గాల్లో విభిన్న అభిప్రాయాలు
  • ఎస్సీ రిజర్వేషన్లపై తీర్పుతో కొత్త చిచ్చు

సహనం వందే, హైదరాబాద్:

రిజర్వేషన్ల ఫలాలు నిజంగా అర్హులైన పేదలకు అందుతున్నాయా? లేక ఒకే కులంలో ఉన్న కొద్దిమంది బాగా స్థిరపడిన వాళ్లే రిజర్వేషన్లను కొల్లగొడుతున్నారా? ఇప్పుడు దేశవ్యాప్తంగా ఇదే హాట్ టాపిక్! ఓబీసీ రిజర్వేషన్లలో ‘క్రీమీలేయర్’ విధానాన్ని ఎత్తివేసి ఉప-వర్గీకరణ (సబ్-కేటగిరైజేషన్) తేవాలనే డిమాండ్ ఊపందుకుంటోంది. అసలు సుప్రీంకోర్టు తాజా తీర్పులు ఏంటి? ప్రభుత్వాలు ఎందుకు తికమక పడుతున్నాయి?

క్రీమీలేయర్ అమలులో లొసుగులు…
ఓబీసీ వర్గాల్లో ఇప్పటికే ఆర్థికంగా, ఉద్యోగపరంగా స్థిరపడిన ఉన్నత వర్గాలను వేరు చేసేందుకు ‘క్రీమీలేయర్’ నిబంధనను తెరపైకి తెచ్చారు. కానీ ఈ నిబంధన అమలులో లెక్కలేనన్ని లొసుగులు ఉన్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా తల్లిదండ్రుల ఉద్యోగాలు, జీతాల లెక్కింపు విషయంలో స్పష్టమైన కొలమానం లేకపోవడం పెద్ద సమస్యగా మారింది. దీనివల్ల కొందరు అర్హులు నష్టపోతుంటే, మరికొందరు నిబంధనల వెసులుబాటుతో ప్రయోజనం పొందుతున్నారనే వాదన బలపడింది.

OBC Demand for Sub Categorisation

సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో రిజర్వేషన్లపై …
సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో ఓబీసీ అభ్యర్థుల ఎంపిక సమయంలో జీతాలను ఆదాయంతో కలిపి క్రీమీలేయర్ కింద లెక్కించకూడదని కోర్టు స్పష్టం చేసింది. ఈ నిబంధనల వల్ల అనేక మంది ప్రతిభావంతులైన అభ్యర్థులు సర్వీసులకు దూరమయ్యారు. అయితే కోర్టు తీర్పుల తర్వాత కూడా కేంద్ర ప్రభుత్వం, సంబంధిత శాఖల మధ్య సమన్వయం లేకపోవడం అభ్యర్థులను అయోమయంలో పడేసింది. ఒకవైపు కోర్టు తీర్పును అమలు చేస్తామని చెబుతూనే, మరోవైపు పునఃపరిశీలన కోరడం ఈ సమస్య ఎంతటి సంక్లిష్టంగా మారిందో తెలియజేస్తోంది.

కొన్ని కులాలకే లబ్ధి జరుగుతుందా?
అందుకే ఇప్పుడు ఓబీసీ వర్గాలన్నింటినీ సమానంగా చూడలేమనే వాదన గట్టిగా వినిపిస్తోంది. ఓబీసీ జాబితాలో ఉన్న వందలాది కులాలలో కేవలం కొన్ని కులాలు లేదా కొన్ని కుటుంబాలు మాత్రమే రిజర్వేషన్ల ఫలాలను సింహభాగం తన్నుకుపోతున్నాయనేది ప్రధాన ఆరోపణ. మిగిలిన అత్యంత వెనుకబడిన కులాలు మాత్రం దశాబ్దాలు గడిచినా కనీసం రిజర్వేషన్ ఫలితాలను పొందలేకపోతున్నాయి. అందుకే, ఓబీసీ రిజర్వేషన్లలో ఉప-వర్గీకరణ చేపట్టాలనే డిమాండ్ తెరపైకి వచ్చింది.

ఉప-వర్గీకరణ అంటే ఏమిటి?
ఉప-వర్గీకరణ అంటే ఏమిటి? ఓబీసీ రిజర్వేషన్ కోటాను కూడా వివిధ వర్గాల వెనుకబాటుతనం ఆధారంగా ఉప-కోటాలుగా విభజించడం. దీనివల్ల ప్రతి కులానికి, ప్రతి ఉప-వర్గానికి జనాభా ప్రాతిపదికన లేదా వారి వెనుకబాటుతనాన్ని బట్టి రిజర్వేషన్ ఫలాలు అందుతాయని నిపుణులు వాదిస్తున్నారు. ఎస్సీ సబ్-కేటగిరీలపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులు ఈ చర్చకు మరింత బలాన్నిచ్చాయి. ఎందుకంటే పెద్ద కులాల గుప్పెట్లోకి అన్ని రిజర్వేషన్ ఫలాలు వెళ్లిపోతే, అట్టడుగున ఉన్న అణగారిన కులాలకు ఒరిగేదేమిటనే ప్రశ్న తలెత్తుతుంది.

క్రీమీలేయర్ ఎత్తివేతకు డిమాండ్లు…
మరోవైపు, క్రీమీలేయర్ నిబంధనను పూర్తిగా ఎత్తివేయాలనే డిమాండ్లు కూడా కొన్ని వర్గాల నుంచి గట్టిగానే వస్తున్నాయి. ఆర్థిక ప్రాతిపదికన రిజర్వేషన్లను రద్దు చేయడం సరైన పద్ధతి కాదని, ఆర్థికంగా బలపడినంత మాత్రాన సామాజిక వివక్ష అనేది పోదని వారు వాదిస్తున్నారు. ఒక వ్యక్తి ఎంత సంపాదించినా కుల వివక్ష పోదని, కాబట్టి ఆర్థిక గీతను అడ్డుపెట్టి రిజర్వేషన్లను దూరం చేయడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని కొందరు అభిప్రాయపడుతున్నారు.

అమలులో కఠినత్వం అవసరమా?
దీనికి విరుద్ధంగా ఆలోచించే మరో వర్గం వాదన మరోలా ఉంది. ఒకే కుటుంబంలో తండ్రి ఐఏఎస్ అధికారిగా లేదా కోట్లు సంపాదించే వ్యాపారవేత్తగా ఉండి, అదే కుటుంబానికి చెందిన పిల్లలు మళ్లీ రిజర్వేషన్ ఫలాలను అనుభవిస్తే అది నిజంగా అర్హులైన పేదలక తీవ్రమైన అన్యాయం చేయడం అవుతుందని వారు స్పష్టం చేస్తున్నారు. నిజమైన సామాజిక న్యాయం జరగాలంటే రిజర్వేషన్ ఫలాలు అట్టడుగున ఉన్న వారికి చేరాలని, అందుకే క్రీమీలేయర్ నిబంధన మరింత కఠినంగా ఉండాలని కోరుకుంటున్నారు.

సమగ్రమైన కులగణనే పరిష్కారమా?
ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం దొరకాలంటే కేవలం తాత్కాలిక కోర్టు తీర్పులు సరిపోవు. సమగ్రమైన కులగణన చేపట్టి ఏ కుల జనాభా, ఏ వర్గం జనాభా ఎంత వెనుకబడి ఉందనే పక్కా డేటాను సేకరించాలి. ఆ తర్వాతే విధానాలను రూపొందించాలి. అప్పుడే క్రీమీలేయర్ ఎత్తివేత లేదా సబ్-కేటగిరైజేషన్ అనే చర్చలకు అర్థం ఉంటుంది. లేకపోతే ఇది కేవలం రాజకీయ లబ్దికోసం జరిగే చర్చగానే మిగిలిపోతుంది.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *