- సాఫ్ట్‌వేర్ డెవలపర్లకు 1.17 కోట్ల ప్యాకేజీ
- నర్సులకు కోటి రూపాయల ప్యాకేజ్…
- వివిధ రకాల ఉద్యోగాలకు భారీ డిమాండ్
- అత్యధిక జీతాల టాప్ – 20 జాబ్స్
- మారుతున్న జాబ్ మార్కెట్ లెక్కలు
సహనం వందే, హైదరాబాద్:
మారుతున్న కాలానికి తగ్గట్టుగా ఉపాధి రంగం కొత్త పుంతలు తొక్కుతోంది. ఆర్డర్ క్లర్కుల ఉద్యోగాలు కనుమరుగవుతుంటే మేధో సంపత్తితో కూడిన వృత్తులకు ఎర్రతివాచీ స్వాగతం లభిస్తోంది. అమెరికా లేబర్ బ్యూరో తాజాగా విడుదల చేసిన నివేదిక ప్రకారం ఏఐ మాయాజాలం నుంచి టెక్నాలజీ వరకూ రాబోయే రోజుల్లో ఏ కొలువులకు కోట్లు క్యూ కడతాయో ఈ విశ్లేషణలో చూద్దాం.
సాఫ్ట్‌వేర్ కొలువుల జోరు…
జాబ్ లిస్ట్ లో మొదటి స్థానంలో నిలిచిన సాఫ్ట్‌వేర్ డెవలపర్ ఉద్యోగాల గురించైతే ప్రత్యేకంగా చెప్పుకోవాలి. కోడింగ్ స్క్రీన్ల ముందు గంటల తరబడి గడిపే ఈ టెక్ నిపుణులకు ఏడాదికి దాదాపు 1.17 కోట్ల రూపాయల వరకు సగటు వేతనం లభిస్తోంది. రాబోయే దశాబ్దంలో దాదాపు 1.70 లక్షలకు పైగా కొత్త ఉద్యోగాలు ఈ రంగంలో పుట్టుకొస్తాయని అంచనా వేస్తున్నారు. ప్రతి ఆఫీసులోనూ ప్రతి చిన్న టెక్ కంపెనీలోనూ ఈ డెవలపర్ల అవసరం ఇప్పుడు అనివార్యంగా మారిపోయింది.
నర్సులకు కోటి రూపాయల ప్యాకేజ్…
నర్సింగ్, మేనేజ్‌మెంట్ సేవలు రికార్డు స్థాయి వృద్ధిని సాధించబోతున్నాయి. రిజిస్టర్డ్ నర్సులు, నర్స్ ప్రాక్టీషనర్లు, మెడికల్ సర్వీసెస్ మేనేజర్లు జాబ్ మార్కెట్ ను అమాంతం శాసించబోతున్నారు. రిజిస్టర్డ్ నర్సులకు ఏడాదికి సుమారు 82 లక్షల రూపాయల వరకు జీతం దక్కుతుంది. అంతేకాకుండా రాబోయే పదేళ్లలో దాదాపు 2 లక్షల మందికి పైగా కొత్త నర్సులు అవసరమవుతారని నివేదిక స్పష్టం చేస్తోంది. మాస్టర్ డిగ్రీ అర్హత కలిగిన నర్స్ ప్రాక్టిషనర్లకు ఏటా 1 కోటి రూపాయల వరకు జీతం లభిస్తుండడం విశేషం.
కార్పొరేట్ మేనేజ్‌మెంట్ హవా…
మేనేజ్‌మెంట్, కార్పొరేట్ రంగం వైపు చూస్తే జనరల్ అండ్ ఆపరేషన్స్ మేనేజర్లు, హెల్త్ సర్వీసెస్ మేనేజర్లు టాప్ ప్లేస్‌లో నిలిచారు. జనరల్ మేనేజర్లకు దాదాపు 88 లక్షల రూపాయల వార్షిక వేతనం అందుతుండగా దాదాపు 1.80 లక్షలకు పైగా కొత్త అవకాశాలు రానున్నాయి. ఇక మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ మేనేజర్ల విషయానికి వస్తే వీరికి 1 కోటి రూపాయలకు పైగా వేతనం లభిస్తోంది. హాస్పిటల్స్, కార్పొరేట్ సంస్థల నిర్వహణ పూర్తిగా వీళ్ల చేతుల్లోనే నడుస్తుండడంతో వీటికి డిమాండ్ ఎప్పుడూ తగ్గేదే లేదు.

ఫైనాన్షియల్ మేనేజర్లకు 1.40 కోట్లు
ఈ హోదాలో ఉన్నవారికి ఏడాదికి ఏకంగా 1.45 కోట్ల రూపాయల వరకు సగటు వేతనం అందుతుంది. రాబోయే దశాబ్దంలో 1 లక్షకు పైగా కొత్త ఉద్యోగాలు ఈ రంగంలో రానుండగా కేవలం బ్యాచిలర్ డిగ్రీ అర్హతతో ఈ స్థాయికి చేరుకోవచ్చు. టెక్నాలజీ భద్రత, సిస్టమ్స్ నిర్వహణ అత్యంత కీలకం కావడం వల్ల వీరికి కంపెనీలు భారీగా ప్యాకేజీలు ఇస్తున్నాయి. ఫైనాన్షియల్ మేనేజర్లకు ఏడాదికి సుమారు 1.40 కోట్ల రూపాయల వేతనం లభిస్తుండగా మార్కెటింగ్ మేనేజర్లకు కూడా దాదాపు అదే స్థాయిలో ప్యాకేజీ అందుతోంది.
లాయర్లకు ఏడాదికి 1.30 కోట్ల ప్యాకేజ్…
డేటా సైంటిస్టులు, ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ అనలిస్టుల హవా కూడా రాబోయే రోజుల్లో మరింతగా పెరగనుంది. డేటా సైంటిస్టులకు ఏడాదికి 1 కోటి రూపాయలకు పైగా వేతనం అందుతుండగా దాదాపు 1 లక్ష వరకు కొత్త ఉద్యోగాలు రాబోతున్నాయి. సమాచారం భద్రతను కాపాడే ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ అనలిస్టులకు కూడా 1 కోటి రూపాయల వరకు వేతనం లభిస్తోంది. హ్యాకర్ల బెడద నుంచి కంపెనీలను రక్షించే ఈ సెక్యూరిటీ నిపుణుల కొలువులకు ఇప్పుడు భారీ డిమాండ్ ఏర్పడింది. లాయర్లకు ఏడాదికి 1.30 కోట్ల రూపాయలకు పైగా వేతనం లభిస్తుండగా డాక్టోరల్ లేదా ప్రొఫెషనల్ డిగ్రీ తప్పనిసరిగా ఉండాలి.
కన్స్రక్షన్ మేనేజర్లకు సుమారు 96 లక్షలు…
నిర్మాణ రంగాలను ముందుకు నడిపించే కన్స్రక్షన్ మేనేజర్లకు సుమారు 96 లక్షల రూపాయల వార్షిక వేతనం అందుతోంది. పారిశ్రామిక ఇంజనీర్లకు దాదాపు 86 లక్షల రూపాయల వేతనం లభిస్తుండగా హెచ్‌ఆర్ స్పెషలిస్టులకు 60 వేలకు పైగా కొత్త ఉద్యోగాలు రానున్నాయి. మార్కెట్ రీసెర్చ్ అనలిస్టులు, ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్ నిపుణులు కూడా ఈ లిస్ట్‌లో తమకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. ఉద్యోగుల మధ్య సమన్వయం సాధించడం నుంచి కంపెనీ వృద్ధి వ్యూహాలను రచించడం వరకు వీళ్ల పాత్ర ఎంతో కీలకమైనది. చదువుకునే రోజుల నుంచే ప్రాక్టికల్ నాలెడ్జ్ మీద టెక్నాలజీ మీద పట్టు సాధిస్తే భవిష్యత్తులో మీరే కింగ్స్ అవుతారు.