6 కోట్లు కట్టి… 22 వేల కోట్లు కాజేసి – 22 వేల కోట్ల అప్పుకు 6 కోట్లతో సెటిల్మెంట్

ZEE Founder Subhas Chandra Issue
  • జీ గ్రూప్ అధినేత సుభాష్ చంద్రకు గులాం
  • నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ తీర్పు
  • బ్యాంకులు, ఎల్ఐసీలకు శఠగోపం
  • బడా బాబుల దందాకు చట్టాల అండ

సహనం వందే, హైదరాబాద్:

ఇరవై రెండు వేల కోట్ల అప్పు ఉంటే కేవలం ఆరున్నర కోట్లు కట్టి బయటపడటం బడా బాబులకే చెల్లింది. సామాన్యులకి చట్టాలు ఉరితాళ్లుగా మారుతుంటే, దిగ్గజాలకు మాత్రం అవే చట్టాలు రక్షణ కవచాలవుతున్నాయి. జీ గ్రూప్ వ్యవస్థాపకుడు సుభాష్ చంద్ర కేసులో నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పు దేశ ఆర్థిక వ్యవస్థను దిగ్భ్రాంతికి గురిచేస్తోంది.

వేలకోట్ల భారీ బకాయిలు
భారతీయ కార్పొరేట్ వర్గాలను కుదిపేస్తున్న తాజా పరిణామం జీ గ్రూప్ వ్యవస్థాపకుడు సుభాష్ చంద్ర వ్యక్తిగత దివాలా కేసుకు సంబంధించింది. ఈ కేసును పరిశీలిస్తే ఎవరికైనా మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే. సుభాష్ చంద్ర అప్పు మొత్తం అక్షరాల 22 వేల కోట్ల రూపాయలు. కానీ ట్రిబ్యునల్ ఆమోదించిన సెటిల్‌మెంట్ అమౌంట్ కేవలం 6.5 కోట్ల రూపాయలు మాత్రమే. అంటే అప్పులు ఇచ్చిన వారికి దాదాపు 99.97 శాతం మేర భారీ నష్టం వాటిల్లింది. ఇంతటి భారీ వ్యత్యాసంతో కూడిన రీపేమెంట్ ప్లాన్‌కు ట్రిబ్యునల్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం ఇప్పుడు ఆర్థిక రంగంలో తీవ్ర చర్చనీయాంశమైంది.

వ్యాపార సామ్రాజ్యం
జీ గ్రూప్ వ్యవస్థాపకుడిగా సుభాష్ చంద్ర సాధించిన విజయాలు ఒకప్పుడు టీవీ రంగంలో విప్లవం సృష్టించాయి. కానీ అదే విజయాల ముసుగులో జరిగిన భారీ ఆర్థిక అవకతవకలు ఇప్పుడు దేశ ఆర్థిక మూలాలను కదిలిస్తున్నాయి. కంపెనీలను, బ్యాంకులను నిండా ముంచిన తర్వాత కూడా బయటపడే మార్గాలు కార్పొరేట్ శక్తులకు మాత్రమే ఎలా సాధ్యమవుతున్నాయనే కోపంతో ప్రజలు రగిలిపోతున్నారు.

బ్యాంకులు… ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ రుణం
సుభాష్ చంద్ర తన వ్యాపార అవసరాల కోసం వివిధ బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి విపరీతంగా అప్పులు తీసుకున్నారు. ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ వంటి పెద్ద సంస్థలు ఆయనకు భారీగా రుణాలు ఇచ్చాయి. కాలక్రమేణా ఆ అప్పులు తిరిగి చెల్లించలేనంతగా పెరిగిపోయి మొండి బకాయిలుగా మారిపోవడంతో ఈ వ్యక్తిగత దివాలా ముద్ర ఆయనకు చుట్టుకుంది.

బెంచ్‌లో విభేదాలు
ఈ తీర్పు వెలువడటానికి ముందే ట్రిబ్యునల్ బెంచ్‌లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఒరిజినల్ బెంచ్‌లోని ఇద్దరు సభ్యుల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో మూడో సభ్యుడిగా జ్యుడీషియల్ మెంబర్ నీలేష్ శర్మ రంగంలోకి దిగారు. ఆయన జోక్యంతో ఈ విచారణ కొలిక్కి వచ్చింది. ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ నేతృత్వంలోని కొన్ని బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ఈ ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకించాయి. ఇది పూర్తిగా చట్టవిరుద్ధమని, ఏమాత్రం ఆచరణ సాధ్యం కానిదని వాదించినప్పటికీ ఆ వాదనలను ట్రిబ్యునల్ పక్కన పెట్టింది.

మాల్యా విమర్శలు
ఈ పరిణామంపై దేశవ్యాప్తంగా విమర్శలు వస్తున్న తరుణంలో పరారీలో ఉన్న వ్యాపారవేత్త విజయ్ మాల్యా ఎక్స్ వేదికగా స్పందించడం మరింత హాట్ టాపిక్‌గా మారింది. తనకు 6203 కోట్ల రూపాయల అప్పు ఉంటే, బ్యాంకులు, ప్రభుత్వం తన నుంచి ఏకంగా 14,100 కోట్ల రూపాయలను రాబట్టినట్లు అంగీకరించాయని పేర్కొన్నారు. అసలు బాకీ కంటే రెండింతలకు పైగా వసూలు చేసుకున్నారని ఆయన ఆరోపించారు. కానీ తన విషయంలో ఉన్న నిబంధనలు ఇతరులకు వర్తించలేదని, చాలా మంది బకాయిదారులు ఇలాగే నామమాత్రపు మొత్తాలతో సెటిల్ చేసుకుంటున్నారని మాల్యా మండిపడ్డారు.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *