- ఉద్యోగుల విదేశీ పర్యటనలపై ఉక్కుపాదం
- విడాకులపై నిఘా… సైనిక ఆంక్షలు
- అక్రమ సంబంధాలుంటే పార్టీ నుంచి గెంటివేత
- ఎవరికైనా ఫస్ట్ పార్టీ… ఆ తర్వాతే కుటుంబం
సహనం వందే, చైనా:
చైనాలో ప్రేమించడం, పెళ్లి చేసుకోవడం ఇప్పుడు ఒక పెద్ద నేరంగా మారింది. కమ్యూనిస్ట్ పార్టీ సభ్యులు, ప్రభుత్వ ఉద్యోగులు తమ వ్యక్తిగత జీవితాలను పూర్తిగా వదులుకోవాల్సి వస్తోంది. అధ్యక్షుడు జిన్‌పింగ్ తెచ్చిన కఠినమైన ఆంక్షలతో కోట్లాది మంది సామాన్య ప్రజలు నరకం చూస్తున్నారు.
విదేశీయులను పెళ్లాడితే ఉద్యోగం ఊస్ట్
చైనాలో సివిల్ సర్వెంట్లు లేదా కీలకమైన రక్షణ రహస్యాలు తెలిసిన వారు ఎవరూ విదేశీయులను వివాహం చేసుకోకూడదనే కఠినమైన నిబంధన అమల్లో ఉంది. ఒక విదేశీయుడిని ప్రేమించి పెళ్లి చేసుకోవాలని భావించిన ఒక మహిళా ఉద్యోగికి ఆమె సహోద్యోగులు పెద్ద షాకే ఇచ్చారు. ప్రేమ కావాలా లేక ఉద్యోగం కావాలా అని అధికారులు ఆమెను హెచ్చరించారు. చైనాలో అధికారం ఉన్న ప్రతి ఒక్కరూ కచ్చితంగా పార్టీ సభ్యుడే అయి ఉంటారు కాబట్టి పార్టీ నుంచి బయటికి గెంటేస్తే రాజకీయ జీవితం పూర్తిగా ముగిసిపోతుంది.

విదేశీ పర్యటనలపై ఉక్కుపాదం
చైనాలో ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల ఉద్యోగులు విదేశీ పర్యటనలకు వెళ్లాలంటే అనేక అడ్డంకులను ఎదుర్కొవాల్సి వస్తుంది. ఒక రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి తన కుమారుడి యూరప్ విశ్వవిద్యాలయ స్నాతకోత్సవానికి హాజరుకావడానికి ఆరు నెలల ముందే దరఖాస్తు చేసుకున్నప్పటికీ అధికారులు అనుమతించలేదు. ఉద్యోగులంతా తమ పాస్‌పోర్టులను ప్రభుత్వానికి అప్పగించి, ముందస్తు అనుమతి పొందిన తర్వాతే వాటిని తీసుకోవాలని కొత్త నిబంధనలు చెబుతున్నాయి. ప్రయాణ వివరాలను అధికారులకు ముందే స్పష్టంగా తెలపాలి. డైరెక్టర్ జనరల్ స్థాయికి చేరుకున్న అధికారులైతే రిటైర్మెంట్ తర్వాత కూడా విదేశాలకు వెళ్లే స్వేచ్ఛను పూర్తిగా కోల్పోతారు. అలాగే విదేశాలలో కుటుంబ సభ్యులు ఉన్న అధికారులకు పదోన్నతులు లభించవు.
విడాకులపై నిఘా… సైనిక ఆంక్షలు
చైనాలో కేవలం ప్రయాణాలు మాత్రమే కాకుండా విడాకుల ప్రక్రియ కూడా తీవ్రమైన అంశమే. ఒక సీనియర్ అధికారి తనపై విచారణ జరుగుతుందని తెలిసి వెంటనే భార్యకు విడాకులు ఇచ్చి అక్రమంగా సంపాదించిన ఆస్తులను ఆమెకు బదిలీ చేయడానికి ప్రయత్నించాడు. ఇలాంటి మోసాలను అడ్డుకోవడానికి వివాహ స్థితిలో ఏ చిన్న మార్పు వచ్చినా అధికారులు వెంటనే నిఘా పెడతారు. ఇక పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ సైనికుల పరిస్థితి మరింత దారుణంగా ఉంటుంది. సైనికులు వివాహం చేసుకునే ముందు తమ భాగస్వామికి సంబంధించిన పొలిటికల్ బ్యాక్‌గ్రౌండ్ వివరాలు సమర్పించాలి. ఒకవేళ సైనికులు విడాకులు తీసుకోవాలనుకుంటే ఆర్మీ అనుమతి తప్పనిసరి.
అక్రమ సంబంధాలపై ఆంక్షల కత్తి…
చైనా కమ్యూనిస్ట్ పార్టీలో అక్రమ సంబంధాలకు పాల్పడితే వారి రాజకీయ జీవితం క్షణాల్లో ముగిసిపోతుంది. పార్టీ నియమావళి ప్రకారం అక్రమ సంబంధాలు కలిగి ఉంటే వారిని తక్షణమే బహిష్కరిస్తారని సెంట్రల్ పార్టీ హెచ్చరిస్తోంది. కేవలం ప్రేమ వ్యవహారాలే కాకుండా కార్యాలయంలోని సహోద్యోగుల మధ్య సాధారణ స్నేహాలు కూడా అనుమానాలకు తావు ఇస్తున్నాయి. సహోద్యోగులు ఎవరూ కలిసి గ్రూప్ డిన్నర్లకు వెళ్లకూడదనే నిబంధన ఉంది. సహోద్యోగుల మధ్య ఎలాంటి అనధికారిక బంధాలు ఏర్పడకుండా చూసేందుకు అధ్యక్షుడు జిన్‌పింగ్ ఈ కఠినమైన ఆంక్షలను అమలు చేస్తున్నారు.
అత్యున్నత స్థాయి ప్రక్షాళన
చైనా కమ్యూనిస్ట్ పార్టీ 1921లో కొద్దిమంది మేధావులతో ప్రారంభమై నేడు 10 కోట్ల మందికి పైగా సభ్యులతో ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ శక్తిగా ఎదిగింది. 2017లో జిన్‌పింగ్ ప్రభుత్వం, సైన్యం, సమాజం, పాఠశాలలు ఇలా అన్ని రంగాలను పార్టీయే శాసిస్తుందని కొత్త నిబంధనను పార్టీ చార్టర్‌లో చేర్చారు. సీఐఏ మాజీ చైనా అనలిస్ట్ జోనాథన్ సిజిన్ మాట్లాడుతూ జిన్‌పింగ్ పార్టీని ఒక అత్యున్నత నైతిక విలువలతో కూడిన వ్యవస్థగా తీర్చిదిద్దాలని చూస్తున్నారని తెలిపారు. అవినీతి ఆరోపణలపై లి షాంగ్‌ఫుకు మరణశిక్ష విధించారు. అలాగే 24 మంది సభ్యులున్న అత్యంత శక్తివంతమైన పొలిట్ బ్యూరోలో ప్రస్తుతం కేవలం 21 మంది మాత్రమే మిగిలారు. ఈ కఠినమైన వాతావరణంలో ప్రతి పార్టీ సభ్యుడు ప్రతి నిమిషం నిబంధనలకు లోబడి ప్రవర్తించాలని ప్రభుత్వం గట్టిగా కోరుకుంటోంది.