- ఫుడ్ సేఫ్టీ అధికారుల సంచలన దాడులు
- మందులో రుచి కోసం కృత్రిమ రంగులు
- బాటిళ్లలో కెమికల్ ఫ్లేవర్ మాయాజాలం
- నకిలీ టేస్టీ… సీసాలో వయసు గోల్మాల్
సహనం వందే, హైదరాబాద్:
గ్లాసులో పోసే మందులో అసలు మత్తెంత, అందులో కల్తీ ఎంత అనే కోణంలో ఇప్పుడు దేశవ్యాప్తంగా కలకలం రేగుతోంది. తాగే వారి గొంతులోకి దిగేది అసలు సిసలైన సరుకా లేక రసాయనాల రసమా అనే దిగ్భ్రాంతికర నిజాలు ఒక్కటొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. నిత్యం కిక్కు కోసం కోట్లాది మంది నమ్ముతున్న కొన్ని ప్రముఖ బ్రాండ్ల వెనుక జరుగుతున్న నయా మోసాన్ని ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా బట్టబయలు చేసింది. అసలు తయారీ లేకుండానే ఆర్టిఫిషియల్ ఫ్లేవర్లతో నడిపిస్తున్న వ్యాపారాన్ని కట్టడి చేసేందుకు రంగంలోకి దిగింది.
కల్తీ మందుపై కొరడా
కేంద్రం దేశంలోని పలు ప్రముఖ లిక్కర్ తయారీ కంపెనీలపై విరుచుకుపడింది. రుచిని కృత్రిమంగా సృష్టించి మోసం చేస్తున్నారనే ప్రధాన ఆరోపణలతో అమ్మకాలపై నిషేధపు ఉత్తర్వులు జారీ చేసింది. వినియోగదారులను మోసం చేస్తూ అసలు రుచిని మైమరిపిస్తున్న ఈ దందాను ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా తీవ్రంగా తప్పుపట్టింది. కాఫీ లేదా వెనిల్లా వంటి వాటిని వాడేందుకు చట్టపరంగా అనుమతి ఉన్నా, కేవలం రమ్ రుచిని రమ్‌కు, విస్కీ రుచిని విస్కీకి కృత్రిమంగా జోడించడాన్ని మాత్రం అధికారులు సహించలేకపోతున్నారు.

రుచి పేరుతో పెద్ద మోసం
అసలు రమ్ లేదా విస్కీ తయారీకి చాలా పెద్ద ప్రొసెస్ ఉంటుంది. మొలాసెస్ లేదా మాల్ట్ ఆధారంగా పులియబెట్టి, స్వేదన క్రియ జరిపి, సరైన కాలం పాటు బ్యారెళ్లలో నిల్వ చేస్తేనే వాటికి సహజమైన రుచి, వాసన వస్తాయి. కానీ చాలా మంది తయారీదారులు ఇవేమీ పట్టించుకోకుండా ఎక్స్ట్రా న్యూట్రల్ ఆల్కహాల్‌ను వాడుతున్నారు. దీనికి ఎలాంటి రుచి, వాసన ఉండవు. దీనిని ఆధారం చేసుకుని రసాయనాలతో తయారు చేసిన కృత్రిమ ఫ్లేవర్లను కలిపి అసలైన బ్రాండ్ల పేరుతో మార్కెట్లోకి వదులుతున్నారు.
అసలు రుచికి కృత్రిమ రంగులు
బండారం బయటపడడంతో అధికారులు వివిధ తయారీదారుల నుంచి నమూనాలను సేకరించి ల్యాబ్‌లకు పంపించారు. అక్కడ జరిగిన పరీక్షల్లో ఈ బ్రాండ్లు దారుణంగా విఫలమయ్యాయి. బయటి నుంచి కలిపిన కృత్రిమ ఫ్లేవర్లు సహజమైన రుచిని పూర్తిగా కప్పిపుచ్చుతున్నట్లు తేలింది. వీటిని సాధారణ రమ్ లేదా విస్కీ అని లేబుల్ వేసి అమ్మడం వినియోగదారులను మోసం చేయడమేనని తేల్చారు.
ఏళ్ల తరబడి పాత మోసం
సీసాలపై ఏళ్ల తరబడి పాతవి అంటూ తప్పుదారి పట్టించే పదాలు వాడటంపై కూడా కొరడా ఝుళిపించారు. పాత నిబంధనల ప్రకారం బ్లెండ్‌లో ఏ వయసు ఉందో దాని ప్రకారం లేబుల్ ఉండాలి కానీ పాతది లేదా సగటు చెప్పకూడదు. ఓల్డ్ మాంక్ ఎక్స్ఎక్స్ రమ్ వేరియంట్లో ఏడేళ్లుగా బ్లెండ్ చేసినట్లు రాశారు. కానీ అసలు లిక్విడ్‌లో మెచ్యూర్డ్ రమ్ ఐదు శాతానికంటే తక్కువగా ఉండి మిగతాదంతా న్యూట్రల్ స్పిరిట్ అని విచారణలో తేలింది. ఇలాంటి మోసపూరిత ఉత్పత్తులను ఇకపై సాధారణ పేర్లతో అమ్మడానికి వీలే లేదు. వాటిని రమ్ ఫ్లేవర్డ్ స్పిరిట్ లేదా విస్కీ ఫ్లేవర్డ్ స్పిరిట్ అనే స్పష్టంగా లేబుల్ చేయాలని ఆదేశించారు. లేబులింగ్ నిబంధనల ప్రకారం ప్రతి ప్యాకేజీ ముందు భాగంలో అసలు ఉత్పత్తి ఏమిటో కచ్చితంగా రాయాల్సిందే.
దిగ్గజ కంపెనీలపై చర్యలు
ఓల్డ్ మాంక్ ది లెజెండ్ రమ్, ఓల్డ్ మాంక్ గోల్డ్ రిజర్వ్ రమ్, ఓల్డ్ మాంక్ ఎక్స్ఎక్స్ మెచ్యూర్డ్ రమ్లపై వేటు పడింది. యునైటెడ్ స్పిరిట్స్ బారామతి యూనిట్ మెక్డవెల్స్ నెం.1 రమ్, ఐఎన్బీఆర్ఈడబ్ల్యూ బెవరేజెస్ బాప్పైపర్ డిలక్స్ విస్కీ, ఓల్డ్ క్యాస్క్ డిలక్స్ ఎక్స్ఎక్స్ రమ్, అసోసియేటెడ్ ఆల్కహాల్ సెంట్రల్ ప్రావిన్స్ విస్కీ, మెక్డవెల్స్ నెం.1 సెలబ్రేషన్ మెచ్యూర్డ్ ఎక్స్ఎక్స్ రమ్, యాంటిక్విటీ బ్లూ విస్కీ, రాయల్ ఛాలెంజ్ విస్కీలు ఈ జాబితాలో ఉన్నాయి. వీటన్నిటిపై చర్యలు తీసుకున్నారు.