- ప్రస్తుత పరిస్థితిని 25 ఏళ్లు పొడిగింపుకు పట్టు
- లేదా అన్ని పార్లమెంట్ స్థానాలు 50% పెంచాలి
- డీలిమిటేషన్ బిల్లుకు వ్యూహాత్మక అడుగులు
- ఎలాగైనా బిల్లు ఆమోదానికి కేంద్రం కసరత్తు
- సౌత్ పై వేలాడుతున్న డీలిమిటేషన్ కత్తి
- నోరు మెదపని అనేక దక్షిణాది పార్టీలు
సహనం వందే, చెన్నై:
దేశ రాజధాని ఢిల్లీలో సరికొత్త రాజకీయ తుఫాను చెలరేగుతోంది. నియోజకవర్గాల పునర్విభజన బిల్లును ఆమోదించుకునేందుకు నరేంద్ర మోడీ ప్రభుత్వం పావులు కదుపుతుంటే, డీఎంకే పార్టీ మాత్రం గట్టి షరతులు విధిస్తోంది. దక్షిణాది వాటా పడిపోకుండా ఉండాలని, యాభై శాతం సీట్ల పెంపును అమల్లోకి తెస్తూ మరో పాతికేళ్ల పాటు ఫ్రీజ్ కొనసాగించాలని ఆ పార్టీ డిమాండ్ చేస్తోంది.

సీట్ల సర్దుబాటుపై డీఎంకే కండిషన్లు
నరేంద్ర మోడీ ప్రభుత్వం తాజా పునర్విభజన ప్రక్రియ కోసం రాజ్యాంగ సవరణ బిల్లును తెచ్చేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఈ తరుణంలో డీఎంకే ఈ బిల్లుకు మద్దతు ఇవ్వడానికి మూడు ప్రధాన షరతులను తెరపైకి తెచ్చింది. రాజ్యాంగంలోని 1971 నాటి సవరణ ఆధారంగా ఉన్న ఫ్రీజ్ గడువు 2027 నాటి జనాభా లెక్కల తర్వాత ముగియనుంది. ఈ ఫ్రీజ్‌ను మరో 25 ఏళ్ల పాటు పొడిగించాలని ఆ పార్టీ కోరుతోంది. అలాగే అన్ని రాష్ట్రాల లోక్‌సభ స్థానాలను 50 శాతం మేర పెంచాలని డిమాండ్ చేస్తోంది. గతంలో పార్లమెంట్‌లో హోం మంత్రి అమిత్ షా దీనిపై స్పష్టమైన హామీ ఇచ్చారని ఆ పార్టీ గుర్తు చేస్తోంది.
పార్లమెంట్‌లో మారుతున్న సంఖ్యాబలం…
ప్రస్తుత పార్లమెంట్‌లో ప్రభుత్వానికి పూర్తి స్థాయి మెజారిటీ లేకపోయినా రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఏప్రిల్ 17న రాజ్యాంగ 110వ సవరణ బిల్లు వీగిపోయినప్పటి పరిస్థితులు ఇప్పుడు పూర్తిగా మారిపోయాయి. ప్రస్తుత 540 మంది సభ్యుల లోక్‌సభలో మూడింట రెండు వంతుల మెజారిటీకి 360 సీట్లు అవసరం కాగా, 22 మంది డీఎంకే సభ్యులు మద్దతిస్తే ప్రభుత్వ బలం 346కి చేరుతుంది. ఇక కొన్ని పార్టీల మద్దతుతో ప్రభుత్వం మెజారిటీ దిశగా దూసుకెళ్తోంది.
మద్దతు కోసం అధికార కూటమి కసరత్తు
ప్రభుత్వం తన బలాన్ని నిరూపించుకునేందుకు మిత్రపక్షాల మద్దతును కూడగట్టుకుంటోంది. తృణమూల్ కాంగ్రెస్ నుంచి వేరుపడిన 20 మంది ఎంపీలు నేషనల్ సిటిజెన్స్ పార్టీ ఆఫ్ ఇండియాలో చేరగా, శివసేనలో ఆరుగురు ఎంపీలు ఏక్‌నాథ్ షిండే వర్గానికి మద్దతుగా నిలిచారు. ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా ఈ ఎంపీలతో అల్పాహార భేటీ ఏర్పాటు చేయడం విశేషం. మరోవైపు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీతో భేటీ అయి మద్దతు కోరారు. కాగా వచ్చే వారం రాబోయే బిల్లులను ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతోంది. త్రీ లైన్ విప్ జారీ చేసి తమ సభ్యులందరూ పార్లమెంట్‌లో విధిగా ఉండాలని ఆదేశించింది.
డీఎంకే తుది నిర్ణయంపై ఉత్కంఠ
డీఎంకే పార్టీ అధికారికంగా మాత్రం బిల్లు పూర్తి పాఠం చేతికి వచ్చిన తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేస్తోంది. ఏ రాష్ట్రానికి ఎన్ని సీట్లు వస్తాయనే పూర్తి షెడ్యూల్ తమకు కావాలని ఆ పార్టీ డిమాండ్ చేస్తోంది. మహిళా రిజర్వేషన్ల అమలు కోసం లోక్‌సభ స్థానాలను 850కి పెంచేందుకు ప్రభుత్వం తెస్తున్న ఈ బిల్లుపై దేశవ్యాప్తంగా తీవ్ర చర్చ నడుస్తోంది. అయితే, సంఖ్యాబలం కొరత ఉన్నప్పటికీ గైర్హాజరు లేదా ఇతరత్రా వ్యూహాల ద్వారా నెగ్గుకురావాలని కేంద్రం చూస్తోంది. డీఎంకే షరతులకు కేంద్రం ఎలా స్పందిస్తుందనేది రాబోయే రోజుల్లో తేలనుంది. ఇది ఇలా ఉంటే దక్షిణాదిలో ఉన్న అనేక ప్రాంతీయ పార్టీలు డీలిమిటేషన్ విషయంలో నోరు మెదపకపోవడం దారుణం.