ప్రజల ప్రాణాలకు రామ్‌దేవ్ హామీ – బీమా రంగంలోకి పతంజలి ప్రవేశం

Pathanjali RamDev Baba Deal with Magma
  • వేల కోట్ల వ్యాపారం కోసం వ్యూహం
  • నమ్మకం సెంటిమెంట్… మార్కెట్ వ్యూహం
  • మాగ్మాతో భారీ ఒప్పందం… 4500 కోట్ల డీల్

సహనం వందే, హైదరాబాద్:

ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు పతంజలి ప్రొడక్ట్స్ వాడే ప్రజల ముందుకు ఇప్పుడు బాబా రామ్‌దేవ్ ఏకంగా ప్రాణాలకు, ఆస్తులకు గ్యారెంటీ ఇచ్చేందుకు సరికొత్త ఇన్సూరెన్స్ వ్యాపారంతో వస్తున్నారు. కేవలం సబ్బులు, నూనెలు అమ్మిన స్థాయి నుంచి ఏకంగా రూ. 4500 కోట్ల భారీ పెట్టుబడితో బీమా రంగంలోకి అడుగుపెడుతున్న ఈ సంస్థ మాగ్మా డీల్‌తో తన సామ్రాజ్యాన్ని విస్తరిస్తోంది.

బీమా రంగంలోకి పతంజలి ప్రవేశం
ఒకప్పుడు కేవలం యోగా శిబిరాలతో మొదలైన పతంజలి ప్రయాణం ఆయుర్వేద ఔషధాల వైపు మళ్ళి దేశంలోనే అతిపెద్ద ఎఫ్‌ఎంసీజీ కంపెనీలలో ఒకటిగా అవతరించింది. కొన్నేళ్ల కిందట దివాలా తీసిన రుచి సోయా కంపెనీని చేజిక్కించుకుని పతంజలి ఫుడ్స్‌గా మార్చిన ఈ సంస్థ, ఇప్పుడు అదే బాటలో ఇన్సూరెన్స్ రంగాన్ని శాసించేందుకు సిద్ధమవుతోంది. దశాబ్దాలుగా ప్రజల నమ్మకంపై బతికిన ఈ బ్రాండ్ ఇప్పుడు ఫైనాన్షియల్ సర్వీసులోకి అడుగుపెట్టడం నిజంగా పెద్ద సాహసమే. ఎల్‌ఐసీ మొదలుకుని అనేక ప్రైవేట్ దిగ్గజాలు ఏలుతున్న ఈ రంగంలోకి ఆయుర్వేద బ్రాండ్ ఎంట్రీ ఇవ్వడం మార్కెట్లో రాబోయే రోజుల్లో గట్టి పోటీ ఇస్తుందనడంలో సందేహం లేదు.

ఐఆర్‌డీఏఐ గ్రీన్ సిగ్నల్…
ఇన్సూరెన్స్ రంగంలోకి అడుగుపెట్టాలంటే మన దేశంలో సెంట్రల్ రెగ్యులేటరీ సంస్థ ఐఆర్‌డీఏఐ నుంచి అనుమతులు తప్పనిసరి. అన్ని రకాల చట్టపరమైన పరిశీలనలు, ఆర్థిక లావాదేవీల తనిఖీల తర్వాత పతంజలికి ఎట్టకేలకు ఈ అనుమతులు లభించాయి. కేవలం వస్తువులు అమ్మే స్థాయి నుంచి ప్రజల భద్రతను చూసే స్థాయికి సంస్థ ఎదగడం దీని ద్వారా స్పష్టమవుతోంది. రెగ్యులేటరీ అప్రూవల్స్ రావడంతో బాబా రామ్‌దేవ్ టీమ్ ఇక గ్రౌండ్ వర్క్ వేగవంతం చేసింది.

మాగ్మా డీల్… రూ. 4500 కోట్ల ప్లాన్
ఈ భారీ అడుగులో భాగంగా పతంజలి సంస్థ సుమారు రూ. 4500 కోట్ల భారీ పెట్టుబడితో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ భారీ ప్లాన్‌లో భాగంగానే మాగ్మా సంస్థతో ఒక కీలకమైన ఒప్పందం కుదిరింది. మాగ్మా ఫిన్‌కార్ప్ లేదా సంబంధిత ఆర్థిక సంస్థల నెట్‌వర్క్‌ను వాడుకుని దేశవ్యాప్తంగా ఇన్సూరెన్స్ సేవలను విస్తరించాలని పతంజలి భావిస్తోంది. గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాల వరకు పతంజలికి ఉన్న గట్టి పట్టును ఈ ఇన్సూరెన్స్ వ్యాపారానికి అనుకూలంగా మలచుకోవాలని చూస్తున్నారు. ఇప్పటికే ఆయుర్వేద దుకాణాలు, పతంజలి చికిత్సాలయాలు ఉన్న ప్రతిచోటా ఈ బీమా సేవలను సులభంగా అందుబాటులోకి తీసుకురావొచ్చనేది వాళ్ల మాస్టర్ ప్లాన్.

నమ్మకం సెంటిమెంట్… మార్కెట్ వ్యూహం
సాధారణంగా ప్రజలకు ఇన్సూరెన్స్ అనగానే పెద్ద పెద్ద పత్రాలు, క్లిష్టమైన రూల్స్, ఏజెంట్ల మోసాలు గుర్తుకు వస్తాయి. కానీ పతంజలి మాత్రం నమ్మకం అనే ఒకే ఒక్క బలమైన ఆయుధంతో ప్రజల ముందుకు వెళ్లాలని చూస్తోంది. మన దేశంలో ఇప్పటికీ కోట్లాది మంది ప్రజలకు బ్యాంకులు, బీమా సంస్థల మీద పూర్తిస్థాయి అవగాహన లేదు. కానీ బాబా రామ్‌దేవ్ పేరు చెబితే చాలు నమ్మేసే ఒక బలమైన వర్గం ఉంది. ఆ సెంటిమెంట్‌ను క్యాష్ చేసుకుని ప్రతి ఇంటికి ఆరోగ్య, జీవిత బీమాను చేరువ చేయాలనేది వాళ్ళ ఆలోచనగా కనిపిస్తోంది. సబ్బులు, నూనెలు అమ్మిన చేతులతోనే ఇకపై మన కుటుంబ భవిష్యత్తుకు రక్షణ కల్పిస్తామంటోంది.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *