జామర్ నీడలో చైనా పరీక్ష – 1.30 కోట్ల మందితో గావోకావో పరీక్ష

Gao Kao Exam - Toughest Exam in China
  • పరీక్షా కేంద్రాల చుట్టూ ఏఐ భద్రత
  • పేపర్ లీక్ కాకుండా డ్రాగన్ కట్టుదిట్టం
  • అమెరికా అడ్మిషన్ల ప్రక్రియ మరింత ఆసక్తికరం
  • స్కూల్ గ్రేడ్లు, ఎస్సేలు, సిఫారసు లేఖలే కీలకం
  • వివిధ దేశాల అనుసరిస్తున్న పరీక్ష పద్ధతులు

సహనం వందే, హైదరాబాద్:

మన దేశంలో పరీక్షలంటేనే గుండెల్లో దడ మొదలవుతుంది. ఒక్క పేపర్ లీక్ అయితే చాలు లక్షలాది మంది విద్యార్థుల కష్టమంతా నీళ్లపాలవుతుంది. మరి ప్రపంచంలో మిగతా దేశాలు ఈ సమస్యను ఎలా ఎదుర్కొంటున్నాయో తెలుసుకుంటే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. చైనా నుంచి అమెరికా వరకు పెద్ద పెద్ద దేశాల్లో ఎగ్జామ్ సిస్టమ్స్ ఎలా ఉంటాయో చూద్దాం.

సంస్కరణల బాధ్యత
మన దేశంలో నీట్ పేపర్ లీక్ తర్వాత పరీక్షా వ్యవస్థపై నమ్మకాన్ని మళ్లీ నిలబెట్టేందుకు ప్రభుత్వం తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగానే ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నందన్ నీలేకని నేతృత్వంలో ఒక ప్రత్యేక టాస్క్ ఫోర్స్‌ను ఏర్పాటు చేశారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీలో కీలకమైన సంస్కరణలను సూచించే బాధ్యతను వీరికి అప్పగించారు. కేవలం మన దేశమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు ఇలాంటి సవాళ్లను ఎదుర్కొన్నాయి. విద్యార్థులను ఎంపిక చేయడానికి ఆయా దేశాలు అనుసరిస్తున్న విధానాలు పూర్తిగా భిన్నంగా ఉన్నాయి.

చైనా గావోకావో పరీక్ష
ప్రపంచంలోనే అత్యంత కఠినమైన పరీక్షా విధానం ఉన్న చైనా గురించి చెప్పుకోవాలి. అక్కడ నిర్వహించే గావోకావో పరీక్ష ప్రపంచంలోనే అతిపెద్ద, కట్టుదిట్టమైన ప్రవేశ పరీక్షగా పేరుగాంచింది. ప్రతి సంవత్సరం దాదాపు 1.3 కోట్ల మందికి పైగా విద్యార్థులు ఈ పరీక్ష రాస్తారు. పరీక్ష ప్రారంభం కావడానికి కొన్ని నెలల ముందే అక్కడి విద్యాశాఖ అధికారులు ಅప్రమత్తమవుతారు. పోలీస్ శాఖ, సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీలు, టెలికాం రెగ్యులేటర్లు అన్నీ కలిసికట్టుగా పనిచేస్తాయి. పరీక్షా కేంద్రాల వద్ద భద్రత మామూలుగా ఉండదు, అదొక పెద్ద కోటలా మారుతుంది.

China GAOKAO Exam
China Toughest Exam GAOKAO

జామర్లతో భద్రత మరింత కట్టుదిట్టం…
డ్రాగన్ కంట్రీలో విద్యార్థులు పరీక్ష హాల్‌లోకి వెళ్లేటప్పుడు బయోమెట్రిక్ సహా పలు దఫాలుగా కఠినమైన తనిఖీలు చేస్తారు. ఎగ్జామ్ సెంటర్స్ చుట్టుపక్కల ఎలాంటి కమ్యూనికేషన్ సిగ్నల్స్ అందకుండా జామింగ్ టెక్నాలజీ వాడతారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో విద్యార్థుల కదలికలను నిరంతరం పర్యవేక్షిస్తారు. అనుమానాస్పదంగా ఎవరైనా కనిపిస్తే క్షణాల్లో గుర్తిస్తారు. వివిధ ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేస్తే ఎంతటి పెద్ద పరీక్షనైనా ఎంత భద్రంగా నిర్వహించవచ్చో చైనా నిరూపిస్తోంది.

అమెరికాలో పరిగణలోకి స్కూల్ గ్రేడ్లు…
ఇప్పుడు సరిగ్గా దీనికి పూర్తి విరుద్ధమైన అమెరికా విధానం గురించి చూద్దాం. అక్కడ మన దేశంలో లాగా ఒకే ఒక ప్రభుత్వ ప్రవేశ పరీక్ష అంటూ ఏదీ ఉండదు. యూనివర్సిటీలే స్వయంగా తమ అడ్మిషన్ క్రైటేరియాని నిర్ణయించుకుంటాయి. ఎస్ఏటీ లేదా ఏసీటీ మార్కులతో పాటు స్కూల్ గ్రేడ్లను పరిగణలోకి తీసుకుంటారు. విద్యార్థులు రాసిన ఎస్సేలు, సిఫారసు లేఖలు, పాఠశాల బయట వారు సాధించిన విజయాలను కూడా అంచనా వేస్తారు. ప్రవేశాలు కేవలం ఒక్క పరీక్ష మీద ఆధారపడి ఉండవు కాబట్టి సిస్టమ్ చాలా ప్రశాంతంగా ఉంటుంది. అమెరికా పద్ధతి సులభంగా అనిపించినప్పటికీ అది కాస్త సంక్లిష్టమైన ప్రక్రియ.

ఆస్ట్రేలియాలో ప్రతిభే ఆధారం…
ఇక ఆస్ట్రేలియా విషయానికి వస్తే అక్కడ కూడా ఒకే ఒక్క పరీక్ష భారాన్ని విద్యార్థుల మీద మోపరు. పాఠశాల స్థాయిలో విద్యార్థులు చూపిన ప్రతిభ ఆధారంగా వారికి జాతీయ స్థాయిలో ఒకే రకమైన ర్యాంకులను కేటాయిస్తారు. రోజూవారీగా చదువులో చూపించే స్థిరమైన ప్రతిభే యూనివర్సిటీ సీట్లను నిర్ణయించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. దీనివల్ల విద్యార్థులపై మానసిక ఒత్తిడి చాలా వరకు తగ్గుతుంది.

జర్మనీ విధానం…
జర్మనీలో కూడా ఒక సరికొత్త, ఆసక్తికరమైన విధానం అమలవుతోంది. ఇక్కడ వికేంద్రీకరణతో పాటు కొన్ని ప్రత్యేక కోర్సులకు మాత్రమే కేంద్ర ప్రభుత్వం పర్యవేక్షణ ఉంటుంది. సాధారణంగా యూనివర్సిటీ అడ్మిషన్లన్నీ విద్యార్థులు స్కూల్ చివర్లో సాధించిన మార్కుల ఆధారంగానే జరుగుతాయి. కానీ మెడిసిన్, ఫార్మసీ, డెంటిస్ట్రీ వంటి అత్యంత పోటీ ఉండే కోర్సులకు మాత్రం సెంట్రలైజ్డ్ అడ్మిషన్లను ఉపయోగిస్తారు.

బ్రెజిల్ లో ఒకే ఒక జాతీయ ప్రవేశ పరీక్ష
ఇక లాటిన్ అమెరికా దేశమైన బ్రెజిల్ విధానం మరోలా ఉంటుంది. అక్కడ విద్యార్థులు ఒకే ఒక జాతీయ ప్రవేశ పరీక్ష రాస్తారు. ఆ వచ్చిన స్కోర్‌ను ఉపయోగించి ఒకే ఒక సెంట్రల్ ఆన్‌లైన్ ప్లాట్‌ఫాం ద్వారా అనేక ప్రభుత్వ యూనివర్సిటీలకు దరఖాస్తు చేసుకుంటారు. వేర్వేరు సంస్థల కోసం వేర్వేరు పరీక్షలు రాసే పనే లేకుండా కేవలం ఒక్క స్కోర్‌తో పలు యూనివర్సిటీల తలుపులు తట్టవచ్చు. పరీక్ష నిర్వహణను, అడ్మిషన్ ప్రక్రియను బ్రెజిల్ చాలా చక్కగా వేరు చేసింది.

ఒక్కో దేశం ఒక్కో తీరు…
ప్రపంచంలోని ఈ దేశాలన్నింటినీ పరిశీలిస్తే ఒక్కో దేశం ఒక్కో ప్రత్యేక సమస్యకు పరిష్కారం కనుగొన్నట్లు స్పష్టమవుతుంది. చైనా భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తే… అమెరికా, ఆస్ట్రేలియాలు విద్యార్థులను అంచనా వేయడానికి బహుళ మార్గాలను నమ్ముకున్నాయి. జర్మనీ కేవలం కొన్ని ముఖ్యమైన కోర్సులకు మాత్రమే సెంట్రలైజ్డ్ విధానాన్ని పెట్టింది. బ్రెజిల్ పరీక్షను అడ్మిషన్ ప్రాసెస్ నుంచి పూర్తిగా వేరు చేసి సులభం చేసింది. అయితే దీన్ని బట్టి భారత్ కూడా అచ్చం అలాగే చేయాలని కాదు, ఎందుకంటే మన దేశ విద్యా వ్యవస్థ చాలా పెద్దది, వైవిధ్యభరితమైనది. కానీ ఇతర దేశాల నుంచి మనం ఎంతో నేర్చుకోవాల్సి ఉంది.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *