పదేళ్లలోపు చెంప పగులుద్ది – ఆ వయసు వారికి ఎనర్జీ డ్రింక్స్ నిషేధం

Energy Drinks
  • బ్రిటన్ తరహాలో యోచిస్తున్న కేంద్రం
  • ఎనర్జీ డ్రింక్స్ పేరు మార్చాలని ఆదేశం
  • రెడ్ బుల్, రిలయన్స్ కాంపా, పెప్సీలకు బ్రేక్
  • కంపెనీలపై ఎఫ్ఎస్ఎస్ఏఐ కఠిన చర్యలు

సహనం వందే, న్యూఢిల్లీ:

శరీరానికి తక్షణ శక్తిని ఇస్తాయంటూ మార్కెట్లో విక్రయిస్తున్న హై కెఫిన్ పానీయాలపై భారత ఆహార భద్రతా నియంత్రణ సంస్థ ఎఫ్ఎస్ఎస్ఏఐ ఉక్కుపాదం మోపింది. ఈ పానీయాలను ఇకపై ఎనర్జీ డ్రింక్స్ అనే పేరుతో అమ్మడానికి వీల్లేదని స్పష్టం చేసింది. ఈ నిబంధనను అతిక్రమిస్తే కఠిన చర్యలు ఉంటాయని ప్రముఖ కంపెనీలను హెచ్చరించింది.

నిబంధనలు లేవు
భారతదేశ ప్రస్తుత ఆహార భద్రతా చట్టాల ప్రకారం ఈ రకమైన హై కెఫిన్ ఉత్పత్తులకు ఎలాంటి నిర్దిష్టమైన ప్రమాణాలు లేవు. ఎలాంటి స్టాండర్డ్స్ లేకుండా ఇష్టానుసారంగా ఎనర్జీ డ్రింక్స్ అని లేబుల్ వేసి అమ్మడం పూర్తిగా చట్టవిరుద్ధం. వినియోగదారులను తప్పుదారి పట్టించేలా ప్రకటనలు చేయడం వల్ల ప్రజల ఆరోగ్యం తీవ్రంగా ప్రమాదంలో పడుతోంది. శరీరాన్ని మనస్సును వెంటనే ఉత్తేజపరుస్తాయని లేదా నీరసాన్ని మాయం చేస్తాయని చెప్పే ప్రకటనలు పూర్తిగా తప్పుదారి పట్టించేలా ఉన్నాయని అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం చిన్న నోటీసులతో ఆగకుండా ఈ నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని నిర్ణయించుకున్నారు.

దిగ్గజ కంపెనీలకు హెచ్చరికలు
పెప్సి, రెడ్ బుల్, మాన్స్టర్ బెవరేజ్, రిలయన్స్, హెల్ ఎనర్జీ కంపెనీలకు ఎఫ్ఎస్ఎస్ఏఐ గట్టి హెచ్చరికలు జారీ చేసింది. ఈ కంపెనీలన్నీ కలిసి ప్రభుత్వ నిర్ణయాన్ని అడ్డుకోవడానికి తెరవెనుక గట్టి ప్రయత్నాలు చేశాయి. భారతీయ బెవరేజ్ అసోసియేషన్ ద్వారా ప్రభుత్వానికి రహస్య లేఖలు రాశాయి. ఇలాంటి ఆకస్మిక నిర్ణయాలు తీసుకుంటే తమ బ్రాండ్ పేరు దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేశాయి. మార్కెట్లో తీవ్ర గందరగోళం ఏర్పడుతుందని వ్యాపార కార్యకలాపాలకు తీవ్ర అంతరాయం కలుగుతుందని వాదించాయి.

లాబీయింగ్ విఫలం
కంపెనీల ఈ లాబీయింగ్ ఏమాత్రం పనిచేయలేదు. ఇటీవల జరిగిన ఒక అత్యవసర సమావేశంలో ఎఫ్ఎస్ఎస్ఏఐ చీఫ్ ఎగ్జిక్యూటివ్ రాజిత్ పున్హాని కంపెనీల వాదనలను పూర్తిగా తోసిపుచ్చారు. వ్యాపారాల నష్టాల గురించి తాము ఆలోచించబోమని మీకు ఏమాత్రం అభ్యంతరం ఉన్నా నేరుగా కోర్టును ఆశ్రయించుకోవచ్చని తెగేసి చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేయడంతో దిగ్గజ కంపెనీలకు దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వం తీసుకున్న ఈ దూకుడు నిర్ణయంతో కంపెనీలు చివరికి తలవంచక తప్పలేదు.

దాడులు… ఆన్ లైన్ ఆంక్షలు
ఈ లోపు తమ ఉత్పత్తుల మీద ఉన్న ఆ పేర్లను పూర్తిగా తొలగించాలని ఆదేశించారు. ఇప్పటికే రాజస్థాన్ లాంటి కొన్ని రాష్ట్రాల్లో వేలాది సంఖ్యలో స్టింగ్, కాంపా ఎనర్జీ, రెడ్ బుల్ బాటిళ్లను అధికారులు స్వాధీనం చేసుకుని దాడులు ప్రారంభించారు. ఈ ప్రభావం కేవలం రిటైల్ దుకాణాల మీదే కాకుండా ఆన్ లైన్ మార్కెట్ల మీద కూడా గట్టిగా పడింది. అమెజాన్, ఫ్లిప్ కార్ట్, బ్లింకిట్, స్విగ్గీ ఇన్ స్టామార్ట్ లాంటి ప్రముఖ ఈ కామర్స్ కంపెనీలకు కూడా ప్రభుత్వ వర్గాలు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశాయి. తమ ప్లాట్ ఫారమ్ లలో ఏ ఒక్క ఉత్పత్తిని కూడా ఎనర్జీ డ్రింక్ అనే పేరుతో ప్రమోట్ చేయడానికి వీళ్లేదని హెచ్చరికలు జంపాయి.

పదేళ్ల లోపు వారికి నిషేధం…
ఈ ఎనర్జీ డ్రింక్స్ లో అధిక మోతాదులో కెఫిన్, చక్కెర, టౌరిన్ అనే అమైనో ఆమ్లం ఉండటం వల్ల ఆరోగ్యంపై తీవ్ర దుష్ప్రభావం చూపుతున్నాయని వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ప్రపంచంలోని పలు దేశాలు వీటిపై కఠినమైన ఆంక్షలు విధిస్తున్నాయి. బ్రిటన్ లాంటి దేశాలు రాబోయే సంవత్సరంలో పదేళ్ల లోపు పిల్లలకు ఇలాంటి డ్రింక్స్ అమ్మడాన్ని పూర్తిగా నిషేధించడానికి సిద్ధమవుతున్నాయి. మన దేశంలో కూడా అదే బాటలో అడుగులు పడుతున్నాయి. రోజూ పొగతాగే సమయంలో లేదా నీరసంగా ఉన్నప్పుడు ఇలాంటి డ్రింక్స్ తాగడం అలవాటు చేసుకున్న చాలామంది యువకులు వీటికి బానిసలవుతున్నారు. క్షణంలో శక్తి వస్తుందనే భ్రమలో ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ప్రభుత్వం ఇప్పుడు తీసుకున్న ఈ కఠినమైన నిర్ణయం ద్వారా ప్రజలను తప్పుదారి పట్టించే ప్రకటనలకు అడ్డుకట్ట వేయాలని చూస్తోంది.

భవిష్యత్ కార్యాచరణ
భారతదేశంలో ఈ మార్కెట్ వేగంగా పెరుగుతున్నప్పటికీ ప్రజల ఆరోగ్యం కంటే వ్యాపారం ముఖ్యం కాదని ప్రభుత్వం నిరూపించింది. రాబోయే రోజుల్లో ఈ కంపెనీలు తమ మార్కెటింగ్ వ్యూహాలను పూర్తిగా మార్చుకోవాల్సి వస్తుంది. నిబంధనలను ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని రెగ్యులేటర్ హెచ్చరించడంతో కంపెనీల్లో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. రాబోయే కాలంలో ఈ డ్రింక్స్ రూపురేఖలు ఎలా మారతాయనేది వేచి చూడాలి.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *